Friday, April 19, 2024
HomeTrending Newsప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు: అఖిలపక్షం నిర్ణయం

ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు: అఖిలపక్షం నిర్ణయం

అఖిలపక్షం నేతృత్వంలో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి రాష్ట్రంలో జరుగుతోన్న పరిస్థితులను వివరిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.  రాష్ట్రంలో ప్రజాస్యామ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకంకావాలని, పార్టీలు- అభిప్రాయాలు వేరైనా రాష్ట్ర ప్రయోజనాలు,  భవిష్యత్ కోసం అందరం కలిసి పోరాడాలని పిలుపు ఇచ్చారు.  ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం- సేవ్ డెమోక్రసీ’ పేరితో విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో అఖిల పక్ష సమావేశాన్ని తెలుగుదేశం ఏర్పాటు చేసింది. అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్, జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక’ పేరుతో  నిరంతరం అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తూ, రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇబ్బంది ఎదురైనా ఈ వేదిక అక్కడకు వెళ్ళి అక్కడ పోరాటం చేయాలని నిర్ణయించారు.

ఈ భేటీలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… సిఎం జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, రాజ్యాంగం కల్పించిన వాక్  స్వాతంత్ర్యం కూడా కరువైందని ఆరోపించారు.  ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా విపక్షాలకు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని, మరికొందరు నేతల ఇళ్ళను రాత్రికి రాత్రి కూల్చి వేస్తున్నారని, అసలు ఈ ప్రభుత్వం ప్రజా వేదిక కూల్చడంతోనే పాలన మొదలు పెట్టిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలతో పాటు, వైసీపీలో ఉన్న నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారని, అందుకే ప్రభుత్వం ఈ వ్యతిరేకతను పక్కదారి పట్టించడంకోసం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని అచ్చెన్న అన్నారు. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరం రాష్ట్రం విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో జరుగుతోన్న హింసాత్మక, అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక పరిరక్షణ, ఉద్యమ, ఉద్యోగ సంఘాలు కలిసి రాష్ట్ర గవర్నర్, రాష్ట్రానికి రానున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ లను కలిసి వినతి పత్రం ఇవ్వాలని…

ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మరింతగా సమన్వయ పరచుకోవానికి, అఖిలపక్ష నాయకులు రాష్ట్రస్థాయిలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ‘ఏర్పాటు చేయాలని…  అదేవిధంగా జిల్లా, నియోజాకవర్గ, మండల స్థాయి వరకూ ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని అఖిల పక్ష సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానం వివరాలను జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తెలియజేశారు.

Also Read : ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయి: అచ్చెన్న

RELATED ARTICLES

Most Popular

న్యూస్