తెలంగాణ ప్రభుత్వం అనాథలకు ప్రభుత్వమే తల్లిదండ్రిగా అన్ని తానై ఉండి, దేశం గర్వించే మరో అద్భుత విధానాన్ని తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలో అనాథలు అనేవారు ఇక ఉండొద్దనే గొప్ప సంకల్పంతో వారిని రాష్ట్ర బిడ్డలుగా పరిగణిస్తూ, వారికి కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పెట్టి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించి, జీవితంలో స్థిరపడేలా ఉపాధి కల్పించి, కుటుంబం ఏర్పాటు చేసే విధంగా చట్టంలో ప్రత్యేక రక్షణలు కల్పించాలని కమిటీ చర్చించింది. రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ నేడు హైదరాబాద్ లోని, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో సమావేశమై అనాథలపై చర్చించింది. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు కేటిఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రత్యేక ఆహ్వానితులుగా బోయినపల్లి వినోద్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కోవిడ్ అనంతరం దేశంలోని అనేక రాష్ట్రాలు అనేక ప్రతిపాదనలు చేశాయని, జీవోలు తెచ్చాయని, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా కోవిడ్ బాధితులకు దేశంలో ఎవరూ చేయని విధంగా చేయుత అందించినప్పటికీ కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, మిగిలిన అనాథలందరినీ చూసి మనసు చలించి, ఇక తెలంగాణలో అనాథలు అనేవారు ఉండకూడదనే వజ్రసంకల్పంతో పెద్ద కేబినెట్ సబ్ కమిటీ వేసి, దేశం గర్వించే విధంగా వారికోసం సమగ్ర చట్టం చేసేందుకు నివేదిక ఇవ్వాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అనాథలకు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అన్ని విధాల సాయం అందుతోందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి, కమిటీ కన్వీనర్ శ్రీమతి దివ్య దేవరాజన్ తెలిపారు. రాష్ట్రంలో అనాథల కోసం నిర్వహిస్తున్న అనేక అనాథ ఆశ్రమాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి, వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని మంత్రులకు వివరించారు. అనాథల కోసం వచ్చిన ప్రతిపాదనల సమాహారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు.
అనాథల కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది పిల్లలను అడ్డుపెట్టుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, వారితో సిగ్నళ్ల వద్ద బిక్షాటన చేస్తున్నారని, వీరిపై పిడి చట్టం పెట్టి భవిష్యత్ లో ఇంకెవరు ఇలా చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకునే విధంగా రానున్న నూతన చట్టంలో నిబంధనలు రూపొందించాలని మంత్రులు సూచించారు. సిగ్నళ్ల వద్ద పిల్లలతో బిక్షాటన చేయించే వారిని గుర్తించి, వారికి ప్రభుత్వ హోమ్స్ లలో షెల్టర్ కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు.
అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడి కార్డులు ఇవ్వాలని, ఈ కార్డు ఉంటే ఇన్ కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటి ఇతర సర్టిఫికేట్ లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లీంలలో అనాథలను చేరదీసే విధంగా యతీమ్ ఖానాలు నిర్వహిస్తున్నారని, వాటిని కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అన్ని విధాల వారికి వసతులు కల్పించి అండగా నిలబడాలన్నారు.
ప్రభుత్వ బిడ్డల కోసం చేసే ఖర్చును గ్రీన్ ఛానల్ లో పెట్టాలని, దీనికి ఎస్సీ, ఎస్టీ ప్రగతి పద్దుకు ఉన్నట్లు నిధులు ఆ సంవత్సరంలో ఖర్చు కాకపోతే మురిగిపోకుండా వచ్చే సంవత్సరానికి ఉపయోగించుకునే విధానం పెడితే వారికి శాశ్వతంగా ఆర్ధిక భద్రత లభిస్తుందన్నారు. సమాజంలో చాలామంది వ్యక్తులు, వ్యవస్థలు ఇలాంటి ప్రత్యేక పిల్లలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇచ్చేందుకు చాలామంది ఉన్నారని, అనాథలకు ఆర్ధిక సాయం చేయడం వల్ల టాక్స్ మినహాయింపు వస్తుందన్న విషయం అందరికీ తెలువదని, దీనిని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నారు.
నో చైల్డ్ బిహైండ్ అన్న నినాదంతో అనాథల కోసం కార్పోరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ కింద ముందుకు వచ్చే వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చి వారి సాయం తీసుకోవాలన్నారు. అనాథలందరికీ ఒక అలుమ్నై, నెట్ వర్క్ ఏర్పాటు చేయాలని, వారు ఎప్పుడు కూడా అనాథలవలె భావించకుండా ఉండేందుకు ఈ నెట్ వర్క్ పనిచేసేలా చూడాలన్నారు. అనాథలుగా ఉంటూ గొప్ప, గొప్ప స్థాయికి చేరుకున్న వారి విజయగాథలను ఇక్కడ చెబుతూ స్పూర్తినందించాలన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ అనాథల కోసం అద్భుతమైన విధానం తీసుకొచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేసినప్పటి నుంచి అనేక వర్గాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఫోన్లు, ప్రతిపాదనలు వచ్చాయని, అందరూ హర్షం వ్యక్తం చేశారని, ఇంతటి గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానని కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. మంత్రుల సలహాలు, సూచనలతో దేశం గర్వించే విధంగా నివేదిక అతి త్వరలో సమర్పిస్తామని చెప్పారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే విధంగా నివేదిక ఇవ్వాలన్న మంత్రుల సూచనల ప్రకారం నివేదిక ఉంటుందన్నారు.
కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అనంతరం మంత్రులు, అధికారులు కలిసి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉన్న స్టేట్ హోమ్, అక్కడి విద్యార్థులు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం రసాయనాలు లేకుండా పండించేందుకు ఏర్పాటు చేసిన న్యూట్రి గార్డెన్ ను సందర్శించి, ప్రశంసించారు. ప్రభుత్వ బిడ్డలు ఉండే ఈ ప్రధాన కేంద్రం ఆహ్లాదకరంగా ఉండాలని, అన్ని వసతులు కలిగి ఉండేందుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందని మంత్రులంతా హామీ ఇచ్చారు.