Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవంటిల్లే వైద్యశాల

వంటిల్లే వైద్యశాల

Popu Dabba: సంస్కృత ఆంధ్ర కన్నడ ప్రాకృత భాషల్లో పండితుడు, విఖ్యాత విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ “రాయలనాటి రసికత” పేరుతో సుదీర్ఘమయిన వ్యాసం రాశారు. విజయనగర సామ్రాజ్యంలో జనం అభిరుచులు, భాష, వేషం, తిండి, అలంకారాలు, ఉత్సవాలను అనేక గ్రంథాల ఆధారాలతో వివరించారు. నిజానికిది పరిశోధన స్థాయి వ్యాసం. అందరూ రాయలేరు.  ఆ రోజుల్లో ఒక్కో రుతువుకు కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు చేసుకునే వారు. ఇంటిల్లిపాది వెన్నెల్లో భోంచేయడానికి డాబా మీద ప్రత్యేకమయిన ఏర్పాట్లు ఉండేవి. జాజి, మల్లె, తీగ సంపెంగ తీగలు ఆ డాబా దాకా అల్లుకుని ఉండేవి. పారిజాతం చెట్టు లేని ఇల్లు ఇల్లే కాదు.

నీళ్లల్లో అల్లం, జీలకర్ర, మిరియాలు ఉడికించి కాచి వడపోసిన పానీయం, చెరుకు రసం, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పోపు వేసిన మజ్జిగ, యాలకులు, మిరియాలు దంచి వేసిన బెల్లం పానకం…ఇలా భోజనానికి ముందు- భోజనం తరువాత వారు తాగిన రసాలను చెబుతూ పోతే పెద్ద రస గ్రంథమవుతుంది. ఇక మెయిన్ కోర్సులో తిన్న ఐటమ్స్ తెలుసుకుంటే మనకు కళ్లు తిరుగుతాయి. సైడ్ డిష్ లుగా నంజుకోవడానికి పెట్టుకున్న వడియాలు, అప్పడాలు, వడలు, మిరపకాయలు, ఉల్లి గడ్డలు చెబితే నోరెళ్లబెడతారు. అలా ఎలా తిన్నారని మనం ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. నోటికి దొరికింది తినకుండా- రుతువు, పగలు, రాత్రి, వయసు, సందర్భాన్ని బట్టి ఏది తినాలో అదే తినేవారు. ఏది తాగాలో అదే తాగేవారు. పెద్దన వర్ణించిన దానిమ్మ రసం వట్టి వర్ణన కాదు- ఆయన రోజూ తాగిన ఫలరసమే అని రాళ్లపల్లి నిరూపించారు. ఇప్పుడు మనం ఏమి తింటున్నామో? ఎలా తింటున్నామో? ఎవరికి వారు తేల్చుకోవాలని మనకే వదిలేశారు.

Spices Ingredients

ఒక్కో భౌగోళిక ప్రాంతానికి కొన్ని ఆహారపుటలవాట్లు కాలగతిలో దానికవిగా ఏర్పడతాయి. దక్షిణ భారతదేశంలో వంటిళ్లలో తప్పనిసరిగా వాడే అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, యాలకులు, లవంగాలు, కేసరి, పచ్చ కర్పూరం, మెంతులు…అన్నీ ఔషధ గుణాలున్నవే. రోగనిరోధక శక్తికి ఉపయోగపడేవే. ఇలాగే మనం సంప్రదాయంగా చేసుకుంటున్న వడపప్పు, పానకం, గుగ్గిళ్లు, తులసి తీర్థం, గసగసాల పాయసం, సగ్గుబియ్యం పాయసం అత్యంత ఆరోగ్యకరమయినవే. పేడ నీళ్ల కళ్ళాపి, గుమ్మాలకు ఎర్రమట్టి పసుపు, ద్వారానికి మామిడి, అరటి, వేప మండలు, సాంబ్రాణి పొగ, వేపాకు పొగ మంచివే. మట్టి కుండలు మంచివే. ఇనుప బాణళ్లు మంచివే. ఒక ఆచారం స్థిరపడడానికి ముందు ఎన్నో ప్రయోగాలు జరిగి ఉంటాయి. మానవ నాగరికతకు ఉపయోగపడని ఆచారాలు వాటంతటవే తెరమరుగు అయిపోతాయి. మన ఆహారం విషయంలో మాత్రం ఆచారాన్ని ద్వేషించాలన్న గుడ్డి సిద్ధాంతంతో నక్కకు నాకలోకానికి దేనికీ చెందకుండా రెంటికీ చెడ్డ రేవళ్లమయ్యాం.

ఇంట్లో అందరూ కలిసి తింటేనే ఆరోగ్యం!
ఇంట్లో వారందరూ కలిసి కూర్చుని ఒకేసారి తింటే ఆరోగ్యమని బ్రిటన్ లో ఒక పరిశోధన తేల్చింది. ఇంగ్లీషు వాడు చెబితేనే ఏదయినా మనం వింటాం కాబట్టి- అందరూ కూర్చుని ఒకేసారి తినడంలో ఉన్న సౌలభ్యమేమిటో ఆలోచించాలి. నిజానికి భారత దేశంలో మొన్నటిదాకా అన్ని ప్రాంతాల్లో ఇలా తినడమే ఉండేది. ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారు. అర్బన్ లైఫ్, వేగం, ఉద్యోగాల ఉక్కిరి బిక్కిరి, డైనింగ్ టేబుళ్ల నాజూకు, టీ వీ చూస్తూ, సెల్ మాట్లాడుతూ తినడం లాంటి వాటి వల్ల తింటున్నదేమిటో తెలియదు. తిన్నది వంటబట్టదు.

“అమృతమస్తు” అని అనుకుని తినడం మన సంప్రదాయం. అంటే తింటున్నది అమృతం అగుగాక అని తింటున్నాం. వంటకు మంట వెలిగించేప్పుడే ఒక దైవకార్యానికి పని మొదలు పెడుతున్నంత పవిత్రంగా భావించిన రోజులనుండి శరణార్థులకు స్విగ్గీ ఆహార పొట్లాలదాకా మన ఆహార ప్రయాణం చిన్నది కాదు. బ్రిటన్ పరిశోధనతో మనం విభదించాల్సిన పనిలేదు కానీ- ఆచరణలో మనకు కొన్ని చిక్కులున్నాయి.

దయ్యాలు నెయ్యాలతో కయ్యాలు పెట్టుకునే గబ్బిలాల పురుషుల, సాలీడు పురుషోత్తముల విరోచితగాథలు చూస్తే తప్ప మన పిల్లలు నోట్లో ముద్ద పెట్టుకోలేరు. అత్తా కోడళ్లు కొట్టుకునే సీరియళ్లను అత్తా కోడళ్లు కొట్టుకుంటూ చూస్తేనే అన్నం తినగనలరు. క్రికెట్ మ్యాచ్ వస్తుంటే మ్యాచ్ చూస్తూ తినాలి. సరిగ్గా భోజనం దగ్గరే ఆలుమగలు గొడవపడి రుసరుసలాడుతూ విసవిస మెతుకులు మింగాలి. మరీ అర్జెంటు పనులున్న పెద్దవారు కారులో వెళుతూ- ఎవరూ లేని అనాథలా కారు వేగానికి అనుగుణంగా తినాలి. ఇంకా సంపన్నులు గాల్లో విమానంలోనే తిని గాల్లోనే తిరుగుతూ ఉండాలి. పనిలేకపోయినా అర్ధరాత్రి దాకా ఊరిమీదపడి తిరిగి ఇంటికొచ్చి ఫ్రిడ్జ్ లో సాంకేతికంగా పాచి ముద్ర పడని పాత పదార్థాన్ని దొంగలా తినాలి. వీకెండ్, సెలవులు, ఇంట్లో శుభ కార్యాలు జరిగితే ఇంట్లో వండినది తినడం మహాపరాధం. నామోషి. బయట హోటల్లో కృతయుగారంభానికి ముందు బ్రహ్మ లోకాలను సృష్టి చేసిన రోజు వండి ఫ్రిడ్జ్ లో పెట్టినది మనకు క్యాండిల్ లైట్ లో వడ్డిస్తే ఆ రుచే రుచి.

Spices Ingredients

తాజాకలం:-
భారతీయులు వేల ఏళ్లుగా వంటింట్లో పెట్టుకుని తప్పనిసరిగా వాడుతున్న పోపుల పెట్టె గొప్ప వైద్యశాలతో సమానమని తాజా పరిశోధన తేల్చి చెప్పింది. దేశ దేశాల్లో కరోనా ప్రభావాన్ని అధ్యయనం చేసినప్పుడు…సుగంధ ద్రవ్యాలు…ప్రత్యేకించి అల్లం, వెల్లుల్లి రోజూ వాడుతున్నవారిలో సహజంగా రోగనిరోధక శక్తి పెరగడాన్ని గమనించారు. జీలకర్ర, పసుపు, మిరియాలు, ధనియాలు, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా అద్భుతమయిన ఔషధాలుగా పనిచేస్తున్నాయి.

ఏయ్!
ఎవర్రా అక్కడ!
వంటింట్లో పోపుల పెట్టెను పక్కన పడేసింది?
రేపు మాపు వెయ్యండి పోపు-
ఇంటిల్లిపాదికి అదే కాపు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

కాదేదీ గొడవకనర్హం?

Also Read :

ఇది మామిడి వేళయని…

RELATED ARTICLES

Most Popular

న్యూస్