Tuesday, April 16, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇది మామిడి వేళయని...

ఇది మామిడి వేళయని…

Mango Season: ప్రతి వేసవిలో లెక్కలేనన్ని మామిడి పళ్లు తినడం, ఐస్ క్రీములు లాగించేయడం…నెక్స్ట్ సమ్మర్ లో అస్సలు మామిడి పళ్లు, ఐస్ క్రీముల జోలికే వెళ్లకూడదని గట్టి నిర్ణయం తీసుకోవడం నా వరకు అలవాటైపోయింది. చూసే కళ్లకు, తినే పొట్టకు రుచి తెలియనే తెలియదు. నాలుకకే రుచి.  వెధవది…ఆ నాలుక నా మాట విని చావదు.

బంగారు రంగు బంగినపల్లిని చూడగానే భోజనానికి ముందే తినేద్దామా? పెరుగన్నంలోకి తిందామా? అన్న మామిడి మీమాంసలో మనసు డోలాయమాన సంకట స్థితిలో ఊగిసలాడుతూ ఉంటుంది. రాయలసీమలో పుట్టి పెరిగి…నీలాన్ని ఎలా వదిలేస్తాం? అంటుమామిడి లేదా తోతాపురి రుచి చూడకపోతే మర్యాదగా ఉండదు. ఒక్క కాయ కిలో బరువు తూగుతున్నా ఇమామ్ పసంద్ పసందుగా తినకపోతే పసందు మాటకు రుచి తెలియదు. కిలో నాలుగయిదు వందల ధర ఉన్నా…మహారాష్ట్ర రత్నగిరిలో పండే అల్ఫోన్సా తినకపోతే నాలుక ఉన్నదెందుకు? మధ్యలో దశేరా, పెద్ద రసాలు, చిన్న రసాల రస చర్చ ఉండనే ఉంటుంది.

Mangoes

ఈలోపు ఎవరో ఒకరు అభిమానం కొద్దీ పంపిన మామిడికాయలను స్టోర్ రూములో మాగబెట్టుకుని తినాల్సిన మామిడిగురుతర బాధ్యత ఒకటి ఎలాగూ ఉంటుంది. పండుతుండగా ఆ వాసన పీల్చడానికి కూడా రాసి పెట్టి ఉండాలి.

వేసవిలో ఆవకాయ పెట్టకపోతే రౌరవాది నరకాల్లో పడతారన్న శాస్త్రమేదో ఉన్నట్లుంది కాబట్టి…మా ఆవిడ శాస్త్రానికి లేదా శాస్త్ర ప్రకారం అనేక రకాల అవకాయలను కలుపుతూ…వంటిల్లంతా డార్క్ రెడ్ కలర్ చేసి…చూసుకుని చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. ఆ సకారాలు నకారాలు నాకసలు పడవని నామీద కారాలు మిరియాలు నూరుతూ కొంత వాటిలో కలుపుతూ ఉంటుంది.

Mangoes

మామిడిపండును కోయకుండా తినడానికి చిన్నప్పుడు మా అమ్మ ఇచ్చిన ట్రయినింగ్ సామాన్యమయినది కాదు. పండును వేళ్లతో ఒత్తుతూ…మెత్తగా చేసి…నోటితో తొడిమను కొరికి…లోపలి రసాన్ని జుర్రుకోవడం బ్రహ్మవిద్య కాకపోవచ్చు కానీ…ఒక ప్రత్యేకమయిన కళ. బయటికి చుక్క రసం చిందకూడదు. రసాన్ని పీల్చి తృప్తి పడకూడదు. పళ్లతో ఒడుపుగా తొక్కమీద ఏమీ మిగల్చకుండా తినాలి. వేళ్ళమధ్య టెంకను రకరకాల యాంగిల్స్ లో హ్యాండిల్ చేస్తూ జుర్రుకోవాలి. ఇది చెప్పినంత సులభం కాదు.

ముందు మహా మామిడి సంకల్పం చెప్పుకుని…కరువుతీరా పళ్లు ప్లేట్లో పెట్టుకుని ఆచమనం చేసి ప్రారంభించాలి. సకల ఇంద్రియాలను సమన్వయపరిచి…మామిడి మీదే దృష్టి కేంద్రీకరించి తదేక దీక్షతో తినాలి. కడుపు పట్టేంతవరకు తినేందుకు వీలుగా సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి.

పండును ముక్కలుగా కోసి…ఫోర్క్ ను తిరగేసి సుతారంగా నూట అరవై పాయింట్ ఏడు మిల్లీ గ్రాముల మోతాదులో కొలుచుకుని తినే నవ నాజూకు గ్రహాంతరవాసుల గురించి ఇలాంటప్పుడు అస్సలు పట్టించుకోకూడదు. చేతనయినంత మొరటుగా, ఇంకెప్పుడూ పళ్లు దొరకవేమోనన్నంత ఆబగా, నోరంతా బంగారు వర్ణశోభితం అయ్యేలా…నరుల దిష్టి తగలకుండా తినాలి.

పండును పండుగా కాక మామిడి మిల్క్ షేక్ గా తీసుకోవచ్చు. మామిడి కాయ-ఉల్లిపాయ పచ్చడి. కొబ్బరి- మామిడి పచ్చడి. మామిడి పళ్ళ పులుసు. మామిడి తురుము పులిహోర. ఇలా మామిడి రుచులు అనంతం.

మామిడి ఎక్కువైతే వేడి చేస్తుందని…ఇంకేదో అవుతుందని మామిడి అంటే గిట్టనివాళ్ళు అనే అనేక అప్రస్తుత ప్రసంగాలను ఆట్టే పట్టించుకోవాల్సిన పనిలేదు. మామిడి తిన్నా…తినకపోయినా…వచ్చే రోగాలు వస్తూనే ఉన్నాయి కాబట్టి…మామిడి తినడం వల్లే రోగాలపాలవుతున్నారనే వాదన తర్కానికి నిలవదు. మామిళ్ళ వల్ల బరువు పెరిగే మాట నిజమే కానీ…పరువు బరువు కోల్పోయిన బతుకులో రెండు నెలలు బరువైనా పెరగడం ప్రతీకాత్మక సంతృప్తికి సంకేతంగానే చూడాలి.

అనితరసాధ్యమయిన అశ్వమేధ యాగమయినా…అతి స్వల్పమయిన పుణ్యావాచనమయినా మామిడి తోరణం కట్టనిదే మంత్రం ప్రారంభించడానికి శాస్త్రమే అడ్డుపడుతుంది. సనాతన ధర్మంలో మామిడితోరణం అంటే మంగళం. శుభం.

సీతారామ లక్ష్మణులు పద్నాలుగేళ్ల వనవాసంలో గంగ, గోదావరి, పంపా తీరాల అడవుల్లో మామిడి పళ్లు తిన్నట్లు వాల్మీకి ప్రత్యేకంగా చెప్పకపోయినా…తిని ఉండరు అని మనం తీర్మానించడానికి వీల్లేదు. పద్నాలుగేళ్లల్లో రోజూ పొద్దున ఏమి తిన్నారు? మధ్యాహ్నం ఏ ఫలాహారం తీసుకున్నారు? అన్నవి రాస్తూ పోతే…24 వేల శ్లోకాలు కాదు…24 లక్షల శ్లోకాలయినా రామాయణం పూర్తి కాదు. గ్రంథవిస్తరణ సమస్య వల్ల వాల్మీకి మామిడి పళ్ల గురించి రాసి ఉండడు. పైగా వారిది మనలాగా ఔటింగ్, ఫారెస్ట్ రిసార్ట్ క్యాంప్ స్టే కాదు. వనవాస దీక్ష.  మిరపకాయ బజ్జీలు, పునుగులు, గుత్తి వంకాయ కూరలు, దోసావకాయ పచ్చళ్ళు, వేపుళ్ళు తినడానికి దీక్షానియమాలు ఒప్పుకోవు. కందమూలాలు తవ్వుకుని తినడానికి వీలుగా కైకేయి దగ్గరుండి పలుగు, పార, తట్ట, బుట్ట ఇచ్చి పంపిన విషయాన్ని మరిచిపోవడానికి వీల్లేకుండా వాల్మీకి ప్రస్తావించాడు. చెట్టునుండి కాయలు, పండ్లు కోయడానికి కూడా దీక్షా నియమాల ప్రకారం వీల్లేదు. చెట్టు నుండి వాటంతటవే రాలి పడ్డ కాయలు, పళ్లను మాత్రం తినవచ్చు. ఈలెక్కన ఖచ్చితంగా పద్నాలుగు వేసవుల్లో ఎప్పుడో ఒకప్పుడు సీతారామ లక్ష్మణులు మామిడి కాయలు, పళ్లు తినే ఉంటారు. సీతమ్మ తినకుంటే సీతాఫలానికి సీతాఫలం అన్న పేరు వచ్చేదా? రామయ్య తినకుంటే రామాఫలానికి రామాఫలం అన్న పేరు వచ్చేదా? కాబట్టి రసాలూరే మేలురకం అడవి మామిడి పళ్లు తినే ఉంటారు.

అన్నట్లు-
అక్షరాలన్నీ మామిడికే సరిపోయాయి. వేసవిని ఎదిరించి కర్పూరంలా కరిగిపోయే ఐస్ క్రీమ్ అనుభవాలకు చోటే లేకుండా పోయింది.

నా పరిమిత అనుభవానికి ఎదురయిన మిడి మిడి మామిడి ఇది. మీ మామిడి ఇంకా గొప్పదై ఉంటుందని…ఉండాలని కోరుకుంటూ…
ఈ ఏడాది ఉన్న పళ్ళన్నీ తిన్న తరువాత…వచ్చే వేసవి వరకు ఇక మామిడిపళ్ళ జోలికే వెళ్లనని ప్రమాణం చేస్తూ…
అంతదాకా పండగ పండగకు గుమ్మానికి కట్టుకునే మామిడి తోరణంతో సరిపెట్టుకుంటూ…

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

మామిడా? మజాకా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్