తెలుగు పాటకు మకరందాన్ని అద్దిన గాయకుడు .. మధురత్వాన్ని దిద్దిన రాగాల సేవకుడు పీబీ శ్రీనివాస్. సున్నితమైన భావాలను .. సుతిమెత్తగా తన స్వరం నుంచి ప్రవహింపజేయడం ఆయన ప్రత్యేకత. ఆయన పాటలు వింటుంటే మత్తుపూల తోటలో మనసు సేదదీరుతుంది .. అనుభూతుల వెన్నెల్లో తడుస్తూ విహరిస్తుంది. పాట అంటే ఆయనకి ఎంత అభిమానమో .. ఆయనంటే పాటకి అంతటి ఆరాధనా భావం. ఆయన పాటల తోటమాలి అయితే, ప్రతిపాటా ఆ తోటలో పూయాలనీ .. ఆయన సన్నిధిలో పరిమళించాలానే కోరుకుంటుంది. అందుకే ఆయన స్వరం .. రాగం చివరివరకూ ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేదు.
పీబీ శ్రీనివాస్ అంటే ప్రతివాది భయంకర శ్రీనివాస్. ఆయన కాకినాడ సమీపంలోని ‘గొల్లప్రోలు’లో జన్మించారు. ఆయన తల్లికి సంగీతం తెలుసు .. ఆమె మంచి గాయకురాలు. ఆమె పాడుతూ ఉండటం వల్లనే పాటల పట్ల ఆయనకి ప్రేమ పెరిగింది .. రాగాల పట్ల అనురాగం ఏర్పడింది. అలా పాటల పట్ల ఆయనకి గల మక్కువ పెరుగుతూపోయింది. అందువలన తన తొలి గురువు తన తల్లినే అని తరచూ ఆయన చెబుతూ ఉండేవారు. ఇక పాటపై పట్టు సాధించాలంటే భాషపై పట్టు ఉండాలనేది ఆయన అభిప్రాయం. ఈ కారణంగానే ఆయన తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ .. ఉర్దూ భాషలను నేర్చుకున్నారు.
గాయకుడిగా ఆయన హిందీలో ‘మిస్టర్ సంపత్’ అనే సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తరువాత ఇక మిగతా భాషలలో గాయకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన స్వరం మెలోడీ సాంగ్స్ కి చాలా బాగా ఉంటుందని ఎక్కువగా ఆ పాటలనే ఆయనతో పాడించేవారు. చిగురాకుల ఊయలలో (కానిస్టేబుల్ కూతురు) నీలి మేఘమాలవో (మదనకామరాజు కథ) నీలి కన్నుల నీడలలోన (గుడి గంటలు) వెన్నెల రేయి ఎంతో చలి చలి (ప్రేమించుచూడు) అందాల ఓ చిలకా అందుకో నా లేఖ (లేత మనసులు) ఆనాటి చెలిమి ఒక కల(పెళ్లిరోజు) ఓహో గులాబీ బాలా (మంచి మనిషి) ముద్దుముద్దు నవ్వు (సత్తెకాలపు సత్తెయ్య) బుజ్జి బుజ్జి పాపాయి (ఆడబ్రతుకు) పాటలు మనసు తెరపై పాల తరకలా తేలుతూనే ఉంటాయి.
తెలుగులో ఆయన ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కాంతారావు .. జగ్గయ్య .. హరనాథ్ వంటివారికి ఎక్కువ పాటలు పాడారు. తెలుగులో ఆయన చాలా తక్కువ పాటలు పాడారనే అనుకుంటారు కానీ, కన్నడలో ఎక్కువ పాటలు పాడారనే విషయం చాలామందికి తెలియదు. అప్పట్లో కన్నడలో రాజ్ కుమార్ సినిమాలకు పీబీ ఎక్కువగా పాడేవారు. తన సినిమాలకి ఆయనే పాడాలని రాజ్ కుమార్ బలంగా చెప్పడం వలన, దర్శక నిర్మాతలు ఆయనతోనే పాడించేవారు. అలా ఆయన రాజ్ కుమార్ సినిమాలకు 3 దశాబ్దాల పాటు పాటలు పాడటం విశేషం.
ఇక తమిళంలో ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ .. జెమినీ గణేశన్ వంటి కథానాయకులకు పాడుతూ అక్కడ కూడా ఆయన స్వర విహారం చేశారు. లతా మంగేష్కర్ .. సుశీల .. జానకి .. భానుమతి వంటి గాయనీమణులతో కలిసి ఆయన తన స్వరయాత్ర కొనసాగించారు. ఆయన పాటలన్నీ కూడా హాయిగా పాడుకునేలా ఉంటాయి. పాడుకుంటూ హాయిని పొందేలా ఉంటాయి. తన అదృష్టం కొద్దీ తన వాయిస్ కి తగిన పాటలే తనని వెదుక్కుంటూ వచ్చాయనీ, పాడిన పాటలన్నీ జనంలోకి వెళ్లాయని ఆయన అంటూ ఉండేవారు.
పీబీ ఎప్పుడు చూసిన తలపాగాను ధరించి .. ఎంతో పద్ధతిగా .. సరస్వతీదేవి పురుష రూపం ధరించినట్టుగా ఉండేవారు. పాటల కోసం ఎప్పుడూ కూడా ఆయన ఎవరినీ అడిగేవారు కాదు. రికార్డింగులు లేని సమయంలో ఆయన వివిధ భాషల్లోని పాటల పోకడను పరిశీలించేవారు. అలాగే పాటలు రాస్తుండేవారు .. అలా ఆయన లక్ష పాటలు రాశారంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇక పాట విడుపుగా ఆయన అప్పుడప్పుడు కవిత్వం కూడా రాసేవారు. పెన్ను .. పుస్తకాలను ఆయన పొదివి పట్టుకునే తీరును చూస్తే, వాటిని అంతగా ప్రేమించేవారు ఎవరూ ఉండరేమోనని అనిపిస్తుంది. ఇలా సంగీత సాహిత్యాల చుట్టూనే ఆయన ఆలోచనలు తిరుగుతూ ఉండేవి.
మెలోడీ పాటలు కొన్ని పీబీ స్వరంలో పలికినట్టుగా తన స్వరంలో పలకవని ఒకానొక సందర్భంలో ఘంటసాల వారు అన్నారు. ఆయన పాటలు వింటుంటే అమృతంలో తేనె కలుపుకుని తాగుతున్నట్టుగా ఉంటుందని బాలు అన్నారు. తాను ఎస్పీబీ అయితే ఆయన పీబీఎస్ అంటూ ఆ పెద్దాయనను బాలు ఆత్మీయంగా హత్తుకుపోయేవారు. ఇలా చిత్రపరిశ్రమలో ఎంత పోటీ ఉన్నప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని, చివరివరకూ దానిని కాపాడుకుంటూ వచ్చిన కమ్మని పాటల ఱేడు పీబీ శ్రీనివాస్. ఈ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా మనసారా ఓ సారి ఆయనను స్మరించుకుందాం.
(సెప్టెంబర్ 22, పీబీ శ్రీనివాస్ జయంతి ప్రత్యేకం)
— పెద్దింటి గోపీకృష్ణ