పరుగుల రేడు మిల్కా సింగ్ లేడు. కొందరు కొన్ని పనులు చేయడానికి పుడతారు. అలా పరుగులకు పరుగు నేర్పడానికి పుట్టినవాడు మిల్కా సింగ్. చిన్నతనంలోనే దేశ విభజన గాయాలు మనసును ముక్కలు చేస్తే- ఆ మనసు ముక్కలను కాళ్లకు అతికించుకుని… ప్రపంచానికి తన కాళ్లతో సమాధానం చెప్పినవాడు మిల్కా. ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్నవాడు మిల్కా. తన పాదగమన వేగంతో ప్రపంచాన్నే వెనక్కు నెట్టినవాడు మిల్కా. అంతర్జాతీయ రన్నింగ్ ట్రాక్ మీద దేశం పరువును తన పరుగుతో పెరుగుతూ నిలిపినవాడు మిల్కా. ఇసుక తిన్నెల్లో, బురదలో, కొండా కోనల్లో సంప్రదాయేతర కఠోర సాధన చేసి పరుగును గెలిచినవాడు మిల్కా. అగమ్యగోచరమయిన భవిష్యత్తుకు ఆగని పరుగును తనకుతాను సంకల్పంగా ఇచ్చుకుని భూత భవిష్యత్ వర్తమానాలకు తన పరుగునే ప్రమాణంగా ఇచ్చినవాడు మిల్కా.
సరిగ్గా నాలుగు అడుగులు కూడా నడవలేని ఇప్పటి మన కాళ్లు మిల్కాను తలచుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు దాటి అలుపు సొలుపులేక దశాబ్దాల పాటు సాగిన మిల్కా పరుగులను ప్రతి అడుగులో మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడే మన మువ్వన్నెల జెండాను ముందు వరుసలో పరుగులు పెట్టించిన మిల్కా మెరుపు వేగాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుని పొంగిపోవాలి. పరుగులతో నింగికి నేలకు నిచ్చెన వేసి ఆకాశమంత ఎదిగినా ఒదిగి ఉన్న మిల్కా వినయం మనకు ఆదర్శం కావాలి.
తొమ్మిది పదులంటే పూర్ణాయుస్సే. అయినా శరీరంలో అణువణువునూ చైతన్యంతో పరుగులు పెట్టించినవాడు కనుక శతమానం దాకా ఉండగలిగాడు. ప్రపంచ రన్నింగ్ ట్రాక్ ను తన ఎడమకాలితో తన్ని అవలీలగా నిలబడినవాడు- కరోనాను చాచి తన్నలేకపోయాడు.
మిల్కాకు ముందు పరుగు ఉంది. మిల్కా తరువాత పరుగు ఉంటుంది. కానీ- మిల్కా పరుగుకు పోలిక మిల్కా పరుగే. ఎందుకంటే పరుగుకు పర్యాయపదం మిల్కా. పరుగే మిల్కా. సాధారణ భాష పదాలు మిల్కా పరుగును అందుకోలేవు. పరుగు కోసమే పుట్టి, పరుగులు పెట్టి, పరువు నిలిపిన పరుగు.
అది- దివికేగిన పరుగు.
-పమిడికాల్వ మధుసూదన్