కాపు సామాజికవర్గాన్ని తొలినుంచీ వేధించింది తెలుగుదేశం పార్టీయేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇటీవల వైసీలోని కాపు నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని రాంబాబు అన్నారు. సిఎం కావాలనుకుంటున్న వ్యక్తి ఇలాంటి భాష ఉపయోగించరని, కానీ అయన తనకు తాను సిఎం అవ్వాలని కోరుకోవడంలేదని, బాబును సిఎం చేయడానికే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
వంగవీటి రంగాకు కాపులు అండగా ఉండి ఉంటే ఆయన హత్య జరిగి ఉండేది కాదని పవన్ చెప్పారని, ఆ కాసేపటికే రంగా హత్యకు కారకుడైన చంద్రబాబుతో కరచాలనం చేశారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో వైసీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల సమావేశం జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ ల ఛైర్మన్లు పాల్గొన్నారు. భేటీ అనంతరం మీడియాతో రాంబాబు మాట్లాడుతూ తుని ఘటనలో దాదాపు తమ అందరి మీదా, ఎందరో కాపు యువత మీద నాటి బాబు ప్రభుత్వం కేసులు పెట్టిందని, జగన్ సిఎం కాగానే ఒక్క కలంపోటుతో ఆ కేసులన్నీ మాఫీ చేశారని రాంబాబు గుర్తు చేశారు. వైసీపీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలుగా, ముగ్గురు ఎంపీలుగా, ఐదుగురు ఎమ్మెల్సీలుగా ఉన్నారని, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లుగా ఉన్నారని చెప్పారు.
నాకు పది సీట్లు ఇవ్వండి చాలు అని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందని, ఎవరికో తాకట్టు పెట్టడానికే కదా ఈ రాజకీయాలు అని మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ది ఒక రాజకీయ పార్టీ కాదని , ఓ సెలెబ్రిటీ పార్టీ అని అభివర్ణించారు. తాము సభ్యత సంస్కారం ఉన్నవారమని, అందుకే పరుష పదజాలం ఉపయోగించలేదని, చెప్పులు చూపించడం రాదని వ్యాఖ్యానించారు. 175 సీట్లలో పవన్ పార్టీ పోటీ చేయగలడా అని పవన్ ప్రశ్నించారు. తాము పెట్టింది కుల సంఘం మీటింగ్ కాదని, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు కలిశామని చెప్పారు.
ప్రజారాజ్యం పార్టీ సందర్భంలో ద్రోహం చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని, వారి సంగతి తెలుస్తానంటూ చెప్పిన పవన్ ఇప్పుడు వారితోనే దోస్తీ చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఎప్పుడూ ఆయన చంద్రబాబుకు కొమ్ముకాస్తూనే ఉన్నారని విమర్శించారు.
గత ప్రభుత్వ హయంలో కాపు సామాజికవర్గాన్ని ఒక సంఘ వ్యతిరేకశక్తిగా ముద్రించే కుట్ర జరిగిందని మాజీ మంత్రి కన్నబాబు ఆరోపించారు. గత ఎన్నికల్లో కాపులు వైసీపీ వెంట నిలిచారని, అందుకే సిఎం జగన్ కాపు సంక్షేమంకోసం కృషిచేస్తున్నారని వివరించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులుగా అందరూ బాగుండాలి, అందులో కాపులు కూడా ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధి అంటే ఒక కులానికే ప్రతినిధి కాదని మొత్తం ప్రజలకు ప్రతినిధి అని, అందరూ ఓట్లు వేస్తేనే గెలుస్తామని, కనీసం ఈ జ్ఞానం కూడా లేకుండా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
Also Read : సవాళ్ళకు సిద్ధం : పవన్ కళ్యాణ్