Sunday, September 22, 2024
Homeసినిమాపవన్ పిలుస్తున్నాడు

పవన్ పిలుస్తున్నాడు

Pawan Kalyan open remarks on Jagan Government

శషభిషలు లేవు.
గుసగుసలు లేవు.
ముసుగులో గుద్దులాటలు లేవు.
గిరిగీశాడు.
బరిలోకి రమ్మంటున్నాడు.
ఆ గట్టునుంటావా?
ఈ గట్టునుంటావా?
తేల్చుకోమంటున్నాడు.
హీరోలూ రెడీనా?
నిర్మాతలూ సిద్ధమా?
దర్శకలూ మీ మాటేంటి?
పవన్ సవాల్ విసిరాడు.
సై అనే దమ్ము పరిశ్రమకి వుందా?
ఏమయ్యా..మోహన్ బాబూ.. మాట్లాడరేం?
అన్నయ్యా.. చిరంజీవీ.. మళ్ళీ మైకు ముందుకు వస్తారా?
భయాలకు, బతిమాలడాలకూ ఫుల్ స్టాప్ పెడతారా?
దిల్ రాజు రెడ్డీ.. మీరెటు?
సురేష్ బాబు చౌదరీ మీ సంగతేంటి?
కులాల వారీగా అయినా సరే..
పార్టీల వారీగా అయినా సరే..
గీత దాటే మొనగాళ్లెవరు?

మేనల్లుడి సినిమా వేదిక మీద పవన్ చాలా మాట్లాడాడు.
అందులో అనవసరమైనవి వుండొచ్చు..
అధిక ప్రసంగాలూ వుండొచ్చు.
ప్రజాసమస్యల మీద ట్వీట్లతో రికార్డెడ్ బైట్లతో సరిపెడతాడు..
సినిమా సమస్యల మీద మాత్రం పబ్లిక్ గా మాట్లాడతాడని
ఎంతైనా  విమర్శించొచ్చు..
సినిమా ఫంక్షన్ సేఫ్ ప్లేస్ అనుకుని  చెలరేగిపోయాడని
చెవులుకొరుక్కోవచ్చు.
ఎవరెన్ని అన్నా..పవన్ స్పీచ్ లో ఒక క్లారిటీ వుంది.
కళామతల్లి బిడ్డలం..
సినిమా తల్లి కొడుకులం..
అని ఎన్ని డైలాగులు చెప్పొచ్చు.
కానీ, సినిమా పరిశ్రమలో ఎవడి దుకాణం వాడిదే.
ఏవైనా డౌట్లుంటే, రెండేళ్లకొకసారి జరిగే మా ఎన్నికల్లో చూడండి.
నలుగురైదుగురు లాభాల కోసం అందరదీ ఒకేమాట ఒకే బాట
అని భ్రమింపజేస్తారు..
ఏ రాజశేఖర్ లాంటి వాడో లోపలున్నది బయటకి కక్కేస్తే,
అతడి నోరు నొక్కేస్తారు.
హేమలాంటి అల్పజీవుల మీద అధికారం చెలాయిస్తారు.
కానీ, ఇప్పుడు ఏకంగా పరిశ్రమ పవర్ స్టారే బయట పడ్డాడు..
వకీల్ సాబ్ లాభాలు ఎలాగూ పోయాయి.
ఇప్పుడు అటు ఆచార్య.. ఇటు పుష్ప.. అటు రిపబ్లిక్, ఇటు
భీమ్లానాయక్..
ఎటు చూసినా మెగా సినిమాలే ..
మరి ఈ సినిమాలు,  వాటి బెనిఫిట్ షోలు, ఫస్ట్ వీక్ లో ఎక్స్ ట్రా  
కలెక్షన్లు.. చాలా గొడవుంది.
జగన్ మొండి మనిషి
చర్చలతో వినేలా లేడు.
పోనీ..టికెట్లు పెంచుకుంటామని డైరెక్టుగా యుద్ధానికి దిగితే,
జనం ఎదురు తిరుగుతారు.
నాతో వచ్చేదెవరు.. లాభాలు గడించేదెవరు.. తేల్చుకోమని
పరిశ్రమకు పిలుపిచ్చాడు.
పైకి పరిశ్రమకి కులం మతం లేవని కబుర్లు చెప్తారు.
కానీ, ఏ కులం ఎటుందో కృష్ణనగర్ కోడైకూస్తుంది.
ఇప్పుడు పవన్ కూడా అదే అంటున్నాడు.
పరిశ్రమలోని  రెడ్లు సంగతేంటి .. దిల్రాజు రెడ్డీ అని ప్రశ్నిస్తున్నాడు..
కమ్మోళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుంటే, 
నువ్వేంటయ్యా మోహన్ బాబూ అని ఎత్తిపొడుస్తున్నాడు.
కాపోళ్ళంతా నిన్నే నమ్ముకుంటే,  నువ్వు మెత్తగా
వుంటావేంటయ్యా చిరంజీవీ అని రెచ్చగొడుతున్నాడు.

ఇక ఇండస్ట్రీ సమాధానం చెప్పాలి.
ఇటు మా ఎన్నికలున్నాయి.
అటు సినిమా రిలీజులున్నాయి.
చిరంజీవి  మెత్తగా చెప్పినా.,
పవన్ రంకెలేసి అరిచినా..
మెసేజ్ ఒకటే.
టాలీవుడ్ లో తనవాళ్లెవరో,  కానివాళ్ళెవరో తేల్చుకోవాలి.
పైకి అంతా ఒకటే అని చెప్పినా..
చిన్న సినిమాలూ పెద్ద సినిమాలూ ఒకటి కాదు.
పెద్ద సినిమాలకు పెద్ద కలెక్షన్లు కావాలి.
ఇష్టమున్నన్ని షోస్ వేసుకోవాలి.
తోచినంత రేటు పెట్టి ప్రేక్షకుల్ని దోచుకోవాలి.
ప్రేక్షకులకి ఒకటి, ప్రభుత్వానికి ఒకటి కలెక్షన్ల లెక్క చెప్పాలి.
వీటన్నిటికీ ప్రభుత్వం అడ్డుపడితే,
మా డబ్బులు,  మా సినిమా అని బెదిరించాలి.
మరి స్టూడియోల పేరుతో,  ఫిల్మ్ సిటీల పేరుతో, ఫిల్మ్ క్లబ్ ల పేరుతో ప్రభుత్వం దగ్గర చేయిచాచేటప్పుడు మా  సినిమా మా ఇష్టం అని అనగలరా..
ఇక్కడే వాహిని వారి పెద్దమనుషులంతా నోరుతెరవలేకపోతున్నారు.
ప్రభుత్వంతో పోరాడితే చెరువుమీద అలిగినట్టే చిరంజీవికి కూడా తెలుసుకాబట్టే చేతులెత్తి మొక్కతున్నాడు.
మరి పవన్ అరుపులు.. అరణ్య రోదనేనా!

-శైలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్