సరైన ధృవపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్ధిక నేరారోపణలు చేయవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సూచించారు. మీడియాలో వచ్చిందనో… ఇతరులు ఎవరో చేశారనో దాన్ని ఆసరాగా చేసుకుని ఆరోపణలు చేయవద్దని కోరారు. మైత్రీ మూవీ మేకర్స్ లో బాలినేని శ్రీనివాసరెడ్డికి పెట్టుబడులు ఉన్నాయని, వైఎస్ భారతీ రెడ్డి ఆయన చేత ఈ పెట్టుబడులు పెట్టించారంటూ విశాఖ జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే, దీనిపై బాలినేని నిన్న తీవ్రంగా స్పందించారు. పవన్ వెంటనే దీనిపై స్పందించాలని, ఈ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. బాలినేని పేరును ప్రస్తావించకుండా పవన్ నేడు ఓ ప్రకటన విడుదల చేశారు. మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలని.. స్థాయి, తీవ్రత, హద్దులు దాటినట్లు సభ్య సమాజం భావించని విధంగా మాటలు వుండాలని హితవు పలికారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించవద్దన్నారు.
జనసేన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పని చేస్తున్నాయని, వీటిని అర్ధం చేసుకొని పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల ఆధారంగా మాట్లాడొద్దని, మనతో సయోధ్యగా ఉన్న పార్టీల్లోని చిన్న చితకా నేతలు ఏవైనా విమర్శలు చేస్తే వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దని, అనవసరంగా స్పందించవద్దని పేర్కొన్నారు. తీవ్రమైన ఆర్ధిక నేరాల గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని సంప్రదించాలని కోరారు.