Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమంచి మంత్రికి ఆయన పిఆర్ఓ తుది వీడ్కోలు నివాళి ఇది

మంచి మంత్రికి ఆయన పిఆర్ఓ తుది వీడ్కోలు నివాళి ఇది

Tributes to Gowtham Reddy: (మేకపాటి గౌతమ్ రెడ్డి సహృదయత, వినయసంపద, సౌశీల్యం గురించి ఎన్నెన్నో విన్నారు కదా? ఆయన దగ్గర పి ఆర్ ఓ గా పనిచేసిన వ్యక్తి ఆయన్ను ఎలా స్మరించుకుంటున్నాడో చూడండి. గుండె లోతుల్లో నుండి బాధ తన్నుకొస్తుంటే బహుశా భాష చిన్నబోయినట్లుంది. మనసు మంచిదయితే ఎన్ని మనసులను కదిలిస్తుందో చూడండి. గౌతమ్ రెడ్డిలో ఏదో ప్రత్యేకత ఉంది. కళ్లల్లో ఏదో కాంతి ఉంది. పెదవి మీద చెదరని చిరునవ్వు ఉంది. తన దగ్గర పి ఆర్ ఓ గా పనిచేసిన వ్యక్తి ఏమంటున్నాడో చదవండి.)

నా పనితీరు, స్పందించే విధానాన్ని గుర్తించి మెచ్చుకున్న సహచర జర్నలిస్టులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనం

కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గం ఇలాంటివి ఏవీ చూడకుండా… కేవలం డెమో స్పీచ్ లు రాయించుకుని సుమారు 3 సంవత్సరాల క్రితం ఆయన వద్ద పిఆర్ఓగా చేర్చుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి గారు దొరకడం నా అదృష్టం. అదే నాకు పెద్ద వరం. ఎంతో మర్యాదగా పలకరిస్తూ, నేను చేసే ప్రతి పనిని, రాసే ప్రతి అక్షరాన్ని అడిగి తెలుసుకుని అడుగడుగునా నన్ను ప్రోత్సహించిన కల్మషమెరుగని మనసు దివంగత మంత్రి మేకపాటి గారిది. అనామకుడిని అందరివాడిని చేశారు. కుటుంబ పెద్దలా ఆపదలో అండగా ఉంటూనే ఆయన ఇపుడు మన మధ్యలో లేకపోయినా మీరూపంలో వసుదైక కుటుంబాన్ని బహుమానంగా ఇచ్చారు. నాకంటే గొప్పగా రాసే విలేకరులు, నాకన్నా అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, ఏదొచ్చినా ముందే అప్రమత్తం చేయగల సమర్థులు చాలామంది ఉన్నారు. కానీ, ఆయన నాకే అవకాశం ఇవ్వడం, తర్వాత పార్టీ, కుటుంబం, ఇతర సంబంధాలు ఉన్న వారి నుంచి అవకాశాల కోసం వచ్చినప్పటికీ నన్నే ఉంచడం , వారికి నా గురించి బాగా చేస్తున్నాడని చెప్పడం కన్నా అమూల్యమైనదేముంది?

ఏ సమయంలో పత్రికా ప్రకటన ఇచ్చినా ఎంతోకొంత వార్త కవర్ చేస్తూ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించిన మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నేను చేసిన దానికంటే కూడా నాకు దొరికిన సహకారం, ప్రోత్సాహమే బలమైనవి. విలువైనవి. ఈ మూడేళ్ల ప్రయాణంలో మంత్రి గారి తోనే మమేకం అయ్యాను. ఆయన లక్ష్యం, ధ్యేయం, ఆలోచనల్లో ఐక్యమై పని చేశాను. ఇంట్లో వాళ్లకి సమయం కేటాయించకుండా పూర్తిగా మంత్రి గారికి మంచి పేరు తీసుకు రావడానికి అహర్నిశలు కృషి చేశాను. కొన్నిసార్లు అనుకున్నది అనుకున్నట్లు చేయడంలో విఫలం అయి ఉండవచ్చు. కానీ నా ప్రయత్నంలో మాత్రం ఏరోజు రాజీపడలేదు. అడుగడుగునా నన్ను ప్రోత్సహించిన వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి మీతో ఏర్పడిన బంధాన్ని తగ్గించలేను.

మంత్రి గారి వ్యక్తిత్వం వల్లే నా సగం కర్తవ్యం ఎప్పుడు పూర్తయ్యేది. నేను చేసింది మిగతా సగం మాత్రమే అని నాకు తెలుసు. మంత్రిగారి కవరేజ్ విషయంలో ఇప్పుడైనా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మన్నించండి. దుబాయ్ పర్యటనకు నన్ను వెంటబెట్టుకుని తీసుకెళ్లిన మంత్రి మేకపాటి గారితో నా అసలు ప్రయాణం మొదలైందని అనుకున్నాను. అదే ఆఖరి ప్రయాణం అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. నన్ను కదిలిస్తే కన్నీళ్లు వస్తున్నాయి. గుర్తుకొస్తే గుండెంత బాధతో నిండిపోతుంది. కాసేపు ఒంటరితనంలో ఉన్నా వర్ణించలేని వేదన నా చుట్టూ అలుముకుంటోంది.

రాజకీయాల్లో చదువుకుని, గొప్ప విలువలున్న కుటుంబం నుంచి వచ్చిన మంచి వ్యక్తి దగ్గర పీఆర్ఓ గా పని చేయాలని ఏరికోరి క్యాబినెట్ , ప్రమాణస్వీకారం పూర్తవగానే రకరకాల ఆలోచనలతో ప్రయత్నం చేసి వచ్చాను. ఆయన వద్ద అవకాశం ఉందని చెప్పిన పూర్ణ అన్నని ఎప్పటికీ మరువను. మంత్రి పిఆర్ఓ గా అవకాశం అంటే నాకు తెలిసినంతవరకు 45 ఏళ్ల పైన వయసు, అందుకు తగిన అనుభవం అనేది తప్పనిసరి. అలాంటిది ఆరేళ్ల అనుభవమున్న నన్ను తీసుకున్నందుకు  ఆ స్థాయిలో కష్టపడి పేరు తీసుకురావాలని శక్తివంచన లేకుండా ప్రయత్నించాను. నా కుటుంబంలో కొందరు నా ఫోన్ లు, ల్యాప్ టాప్ ముందే గడపడం చూసి చూసి విసిగిపోయి ఇదేం ఉద్యోగంరా మానేసేయ్ అన్నా వృత్తి మీద ఆసక్తి వల్ల పట్టించుకోకుండా పని పూర్తి చేశాను. నాకు సహకరించిన ఐ&పీఆర్, సీఎంవో,మంత్రి గారి ఆత్మకూరు, నెల్లూరు, వెలగపూడి సచివాలయంలో పేషీలోని కుటుంబ సభ్యుల సమానమైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. టీటీడీ లెటర్ దగ్గరనుంచి చిత్తూరు జిల్లా ఇన్చార్జిగా ఉన్న మంత్రి మేకపాటి కవరేజ్ కోసం సహకరించిన వారికి, మంత్రిగారి ఢిల్లీ పర్యటనల సమయంలో ముందుగానే ఫోటోలు , వీడియోలు, సమాచారం అందించిన వారందరికీ, ముఖ్యంగా మంత్రిగారి శాఖలను చూసే సెక్రటరియేట్ జర్నలిస్టులకు కృతజ్ఞతలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? కృతజ్ఞతలు మాత్రమే చెప్పి మీ సాయాన్ని ఎలా మరువగలను?

Minister Gowtham Reddy

నా ప్రయాణం అనుకోని మలుపు తిరిగింది. మంత్రి మేకపాటి గారి అస్తమయంతో నా జీవితంలో కూడా చీకటి కమ్మేసింది. హటాత్తుగా మంత్రి దూరమైతే కడుపారా కన్నీళ్లు కార్చే సమయం కూడా చిక్కలేదు. ఇన్నాళ్లు చేసింది ఒక లెక్క ఇప్పుడు చేయవలసింది ఇంకో లెక్క అని తన్నుకొస్తున్న కన్నీళ్లను అదుముకుని, శోక సంద్రమైన గుండెలోని బాధను దిగమింగుకుని ఆయన అంత్యక్రియల నుంచి ఉత్తరక్రియలు వరకు నాకు సాధ్యమైనంతలో అక్షర నివాళి పలికాను. దుబాయ్ పర్యటన అనంతరం మంత్రిగారి చివరి ఫోన్ కాల్ లో ఇప్పుడే ఏమైంది ఇంకా నువ్వు ముందు ముందు చేయాల్సింది చాలా ఉంది అన్నారు. కానీ నా జీవితంలో కలలో కూడా ఊహించని విధంగా ఆయనకు వీడ్కోలు పలుకుతానని అనుకోలేదు. సాఫీగా సాగే నా ప్రయాణంలో ఒక్కసారిగా కుదుపు. ఎవరూ కోరుకోని మలుపు. ఈరోజుకి నా కర్తవ్యం పూర్తయింది. రేపు ఏంటో తెలియదు గానీ నా భవిష్యత్తు లో మీ అందరి ప్రోత్సాహం నాకు మునుముందు కూడా కావాలని మాత్రం వేడుకుంటున్నా.

-మంచిపగడం దేవదాస్

(దివంగత నేత, పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్యం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, చేనేత జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పీఆర్వో)

Also Read :

హృదయ స్పందన

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్