Saturday, January 18, 2025

పెన్నావతరణం

Glory & Significance of Penna River

పెన్నా నదిలో నీరు పారితే సూర్యుడు పడమట ఉదయించినంత అద్భుతం. ఆశ్చర్యం.

పెన్నలో నీటిని చూడడమే ఒక వింత. ఇరవై ఏళ్ల కిందట పెన్నలో నీటి చుక్క కనిపించింది.

మళ్లీ ఇన్నాళ్లకు పెన్న ప్రవహిస్తోంది అంటూ ఆ ప్రాంత ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఫోటోలను, వీడియోలను తీసి లోకానికి షేర్ చేసి మీసం మెలేస్తున్నారు. ఆ నీళ్లల్లో ఎగురుతున్నారు. దూకుతున్నారు. సెల్ఫీలు తీసుకుని డి పి లుగా పెట్టుకుంటున్నారు. పెన్నకు జలహారతులు పడుతున్నారు. పెన్న తల్లికి చీర, రవిక ముక్క, గాజులు వాయనాలు ఇస్తున్నారు. పెన్న పెద్దముత్తయిదువకు పసుపు కుంకుమ చల్లుతున్నారు. పూజలు చేసి, పెన్న నీటిని నెత్తిన చల్లుకుంటున్నారు.నిజానికి ఇరవై ఏళ్ల కిందటి సంగతి కాదిది. ముప్పయ్ ఏళ్ల కింద ఒకసారి పెన్న పొంగితే రెండు మూడు వారాల పాటు ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధమయ్యాయి. బస్సులు, బండ్లు కొట్టుకుపోయాయి. తరువాత ఇన్నేళ్లకు పెన్న పొంగి ప్రవహిస్తోంది.

కర్ణాటక నంది హిల్స్ లో పుట్టే పెన్న 600 కిలోమీటర్లు ప్రవహించి నెల్లూరు తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. పెన్న- పెద్ద; ఏరు కలిసి పెన్నేరు. శివుడి ధనస్సు పేరు పినాకం. నంది కొండల్లో శివుడి చెంత నంది కొమ్ముల మధ్య పుట్టిన నది కాబట్టి పినాకిని అని పెన్నకు మరొక పేరు. అంతటి ఆకాశగంగనే నెత్తిన జడలో చుట్టేసుకున్న శివుడి పినాకం పేరుతో ఉన్న నది రెండు, మూడు తరాలకొకసారి నీటి చుక్కను చూడడం కూడా శివుడి లీలే అయి ఉండాలి.

కర్ణాటకలో ప్రవహించే కుముద్వతి; జయమంగళి, చిత్రావతి, పాపాఘ్ని పెన్నకు ఉపనదులు. అనంతపురం జిల్లాలో, కర్ణాటకలో ఈ ఉపనదులన్నీ పెన్నలో కలుస్తాయి. అందుకే పెన్న దారి పొడుగునా అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో కన్నడ సంస్కృతి కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. కన్నడ నేలను దాటిన తరువాత కుందేరు, సగిలేరు, చెయ్యేరు, బహుదా, బొగ్గేరు, బీరాపేరు ఇలా మరికొన్ని ఉపనదులు పెన్నలో కలిసి బంగాళాఖాతం దాకా వెళ్లి వీడ్కోలు చెబుతాయి.పెన్నార్-కుముద్వతి; పి ఏ బి ఆర్; పెనకచర్ల; చిత్రావతి; మైదుకూరు; యోగివేమన; సోమశిలలాంటి డ్యాములు పెన్న కడుపులో జలభాండాగారాలు. ఇందులో పి ఏ బి ఆర్, పెనకచర్ల డ్యాములకు వచ్చే నీళ్లు తుంగభద్ర హై లెవెల్ కెనాల్ వి. కన్నడ- తెలుగు కలిసినట్లు పెన్న- తుంగ- భద్ర కూడా వియ్యమంది చుట్టాలయ్యాయి.

“నంది పర్వత జాత నవ పినాకినీ జలము నీ స్నాన సంస్పర్శ నిలువునా పులకించె” అన్నాడు అడవి బాపిరాజు. నంది కొండల్లో పుట్టిన పినాకినీ నీళ్లల్లో లేపాక్షి నంది స్నానం చేయడంతో ఆ నది నిలువెల్లా పులకించిందట. పెన్న దారంతా పుణ్య క్షేత్రాలే. పుణ్యతీర్థాలే.

పెన్న గురించి ఎవరు ఏమి చెప్పినా, ఏ సందర్భంలో చెప్పినా విద్వాన్ విశ్వం “పెన్నేటి పాట” గురించి చెప్పి తీరాల్సిందే. విషాద కావ్యమే అయినా పెన్నేటి పాట పెన్నా నదికి సిగ్నేచర్ ట్యూన్.గొంతు తడారిపోయిన కరువు బరువులో, కన్నీరు కూడా కరువయిన పెన్న ఇరుగట్ల బతుకుల్లో పెన్నేటి పాట కోటి గొంతులు చీల్చుకుంటూ…గుండె కంజర కొట్టుకుంటూ పెల్లుబికిన పాట. నీరింకిన పెన్నలో ప్రతి ఇసుక రేణువులో ఇంకిపోయిన పాట. మసకేసిన మబ్బుల కింద శిథిలమై…శూన్యమైపోయిన రైతు పాట. రాయలసీమ కన్నీటి పాట.

కృష్ణా, గోదావరిలాంటిది కాదు పెన్న. పెన్న రాకడ- ప్రాణం పోకడ తెలియదు. వచ్చినప్పుడు రాయలసీమ ప్రేమలా, రాయలసీమ కోపంలా మహోధృతంగా రావడమే తెలుసు పెన్నకు. లేనప్పుడు పీనుగులను కాల్చడానికి పనికివచ్చే వల్లకాడుగా ఏడవడమే తెలుసు పెన్నకు. అందుకే పీనుగుల పెన్న అన్న పేరు వచ్చింది.

ఈ మాత్రం పొంగు పెన్నలో ప్రతి ఏటా ఉండి ఉంటే-
రైతుల ఆత్మహత్యలు లేని పచ్చటి సీమ కళకళలాడుతూ ఉండేది. ఈమాత్రం జలకళ పెన్నలో ప్రతి ఏటా ఉండి ఉంటే-
వలసలు లేని సీమగా సీమ తల ఎత్తుకుని నిలబడగలిగి ఉండేది.

ఈ మాత్రం నీటి సవ్వడి పెన్నలో ప్రతి ఏటా ఉండి ఉంటే-
వేదవతి-హగరిలాంటి ఉపనదులు నామరూపాలతో మిగిలి, ఎడారి ఛాయల రాబందుల రెక్కల చప్పుడు లేని సీమ ఉండేది.

ఈ మాత్రం నీటి దూకుడు పెన్నలో ప్రతి ఏటా ఉండి ఉంటే-
ముప్పయ్ ఏళ్లుగా హంద్రీనీవా నామజపం చేయాల్సిన అవసరం లేని సీమగా సీమ నీటి ధీమాతో నిలబడగలిగి ఉండేది. తీరా ఆ హంద్రీనీవా వస్తే మంచి నీటి చుక్కలకే ఆవిరవుతోంది.

ఈ మాత్రం పెన్నలో ప్రతి ఏటా జలం నాట్యం చేసి ఉంటే-
జలసాధన సమితులు పెన్న పరిరక్షణ ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేని సీమగా సీమ జలదృశ్యం నిత్యం తడిగా, చల్లగా, పచ్చగా ఉండి ఉండేది.

ఈమాత్రం జల సంప్రోక్షణ ప్రతి ఏటా ఉండి ఉంటే-
పెన్నా నదిలో ఇళ్లు, ఊళ్లు వెలిసి ఉండక, గట్లు వేసి పొలాలుగా దున్ని ఉండక నది నదిగా హొయలుపోతూ, వంకర్లు తిరుగుతూ మిగిలి ఉండేది. ఇప్పుడు పెన్న నిండు మది పొంగి నదిగా వస్తున్నా పారడానికి నది దారి లేదు. పేరు మిగిలి…నీటి దారి లేని నదిగా పెన్న కాళ్లకు ఊళ్లు ముళ్లబాటలు పరచి ఉన్నాయి

అందుకే…పెన్న పొంగితే పెన్నా తీరంలో జనానికి చూడ్డానికి రెండు కళ్లు చాలడం లేదు. తమ కళ్లను తామే నమ్మలేకపొతున్నారు. పారే పెన్న అలుగులమీద కూర్చుని మురిసిపోతున్నారు. పెన్న నడిచే దారంతా సోషల్ మీడియాల్లో పెన్న పొంగులకు కామెంట్లే కామెంట్లు. షేర్లే షేర్లు. లైకులే లైకులు.

ముప్పయ్ ఏళ్లకొకసారి ఉన్నానని గుర్తు చేయడానికి పెన్న పారితేనే సీమ ఆనందం సీమలు దాటి తాండవం చేస్తోంది. అలాంటిది ఏటా పెన్న పారితే…ఇక ఆ ఆనందానికి లేపాక్షి బసవయ్య లేచి ఎగిరి దుముకుతాడు. రోజూ నదులు, కాలువలు, నీటి గలగలలు చూసే గోదావరి, కృష్ణ ప్రజలకు పెన్నానందం కొంచెం ఇదిగా అనిపించవచ్చు.“నీటి చుక్క ఒక్కటి ఉండి ఉంటే…” అని ఎడారి కోయిల కథలో మధురాంతకం రాజారామ్ కరువు నేల నుదిటి రాతను చదివినట్లు ఒక మాటంటాడు. అలా పెన్నలో నీటి చుక్క ప్రతి ఏడూ ఇలాగే ఉండి ఉంటే ఎంత బాగుండేదో!

రా! పెన్నా! రా!
ఏటేటా ఇలాగే రా!
నీకు చీరసారెలు పెడతాం.
పసుపు కుంకాలు పెడతాం.
కర్పూర హారతులు పడతాం.
పూలు చల్లుతాం.
కన్నీటిని తుడిచిన పెన్నీరు అని మనసారా జల స్తోత్రాలు చేస్తాం.

నీ ఇంటిపేరు చాలా పెద్ద- పెన్న.
నువ్ పుట్టింది నంది కొండ.
నీకు మరో పేరు శివుడి ధనుస్సు- పినాకిని.
నీ తోబుట్టువు జయమంగళి.
నీ సోదరి పాపాలను కడిగే పాపాఘ్ని.
నీ పిల్లలు కుందేరు, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేర్లు పిల్ల కాలువలు.
నీ పెంపకం పెద్ద కాలువలు.
నీ వియ్యపురాలు తుంగభద్ర. హిందూపురం, పి ఏ బి ఆర్, పెనకచర్ల, మైదుకూరు, సోమశిలలు నీ విశ్రాంతి సౌధాలు.

నీ పుట్టినిల్లు కర్ణాటక. నీ మెట్టినిల్లు ఆంధ్ర. నీభాష ఆంధ్ర కన్నడం. నీ శ్వాస రాయలసీమ. నీకు నువ్వే కట్టుకున్న కోట గండికోట. నీ తుది మజిలీ నెల్లూరు కడలి తీరం.

నీకు రక్ష వీరభద్రుడు. నీకు తోడు అహోబిల నారసింహుడు.

ఇదే పెన్న!
ఇదే పెన్న!
ఇదే పొంగు!
ఇదే సాగు!

ఇలాగే ఏటేటా ప్రవహిస్తే-
మిన్నేటి గంగకన్న మిన్న మా పెన్న.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

కొళాయిల్లో శుద్ధ జలం

Also Read:

కరోనాలో కరువు మాసం

Also Read:

గాడ్స్ మదర్ టంగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్