ఎవరు ఔనన్నా కాదన్నా హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో కూడా తాను చేసిన అభివృద్దిని ప్రజలు విస్మరించారని అందుకే ఇప్పుడు కష్టాలు పడుతున్నారని అన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన బహిరంగ సభలో బాబు ప్రసంగించారు. తాను చెప్పినా వినకుండా ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన జగన్ మాట నమ్మారని, కరెంటు తీగను పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల్లోకి వస్తున్నారనే భయంతోనే జగన్ జీవో నంబర్ వన్ తీసుకు వచ్చారని, లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్ర చేస్తుంటే మైక్ లాక్కుంటున్నారని, ఇది పద్ధతేనా అంటూ బాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తప్పవని, కార్యకర్తల ప్రాణాలకు తాను అండగా ఉంటానని బాబు భరోసా ఇచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని, రాష్ట్రం కోసం జగన్ చేసిన పని ఒక్కటైనా ఉందా అని బాబు నిలదీశారు. దక్షిణ భారత దేశంలో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం మనదేనని, కానీ దేశం మొత్తంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రం ఏపీ అని ఆ స్థాయికి జగన్ తీసుకు వెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ తీరుతో పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇవ్వాల్సిన సరెండర్ లీవ్స్ కు సంబంధించిన బకాయిలు కూడా ఇంతవరకూ ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఉద్యోగులు కూడా జీతాలు అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు, మద్యపానం రెట్లు పెంచి విపరీతంగా దోచుకుంటున్నారని బాబు ఆరోపించారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఇక రాష్ట్రం పని అయిపోయినట్లేనని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలని ప్రజలకు బాబు విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ కు మళ్ళీ ఓటేస్తే ఆ ఫ్యాన్ కే ఉరేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.