Saturday, November 23, 2024
HomeTrending Newsముందు గుడివాడ అభ్యర్ధిని వెతుక్కోండి: పేర్ని

ముందు గుడివాడ అభ్యర్ధిని వెతుక్కోండి: పేర్ని

Gudivada: కొడాలి నాని దెబ్బకు ప్రతిపక్షనేత చంద్రబాబుకు నిద్ర కరువైందని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.  ఒకప్పుడు గుడివాడ అంటే ఆటో మొబైల్ ఇండస్ట్రీకి పేరుందని, కానీ నాని ఎమ్మెల్యే అయిన తరువాత గుడివాడ అంటే కొడాలి నాని పేరు చెబుతారని వ్యాఖ్యానించారు. గుడివాడలో నాని ఓడించడం సంగతి పక్కన పెట్టి కనీసం ఓ మంచి అభ్యర్ధిని వెతుక్కోవాలని బాబుకు పేర్ని సూచించారు. అంగలూరులో టిడిపి ప్లీనరీ పెట్టుకుంటే వర్షానికి రొచ్చు రొచ్చు అయ్యిందని, అలాగే రేపు గుడివాడ ఎన్నికలో కూడా టిడిపి పని అదే అవుతుందని జోస్యం చెప్పారు.  నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇస్తుంటే వాటిపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు నాని. నిరుపేదలకు ఈ సెంటు భూమి విలువ తెలుస్తుందని, కానీ తండ్రి అక్రమ సంపాదనతో బతుకుతున్న లోకేష్ లాంటి వారికి ఏమి తెలుస్తుందని ప్రశ్నించారు.

తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ కొడాలి నానిని చూస్తూ అబ్బురపడుతూ పెరిగానని, 2000 సంవత్సరం నుంచీ ఆయనతో తన బంధం పెరిగిందని పేర్ని గుర్తు చేసుకున్నారు. కొడాలి స్నేహానికి పాత్రుడిగా ఉండడం తన జీవితంలో గొప్ప విషయమని అభివర్ణించారు.

కార్యకర్తల కృషి వల్లే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని, వారి త్యాగం, కష్టం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు చేసిన పోరాటాల వల్లే తాము మంత్రులం అయ్యామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశామని, మళ్ళీ ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు తమకే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రభుత్వ నిధులు పప్పు బెల్లాల్లా పంచి పెడుతున్నారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలా అనిల్ కుమార్, జిల్లా పరిషత్ ఛైర్మన్ హారిక తదితరులు పాల్గొన్నారు.

Also Read : చాలా పండుగలు వచ్చాయి పోయాయి: పేర్ని

RELATED ARTICLES

Most Popular

న్యూస్