Review: నాగశౌర్యకి యూత్ లోను .. ఫామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది. ఆయన నుంచి ఇంతవరకూ వచ్చిన ఈ తరహా సినిమాలకి మంచి ఆదరణ లభించింది. ఇక గతంలో ఆయన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన ప్రేమకథలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇదే కాంబినేషన్లో రూపొందిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ సినిమాపై సహజంగానే యూత్ లో ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిన్న థియేటర్లకు వచ్చింది.
గతంలో ‘కల్యాణ వైభోగమే’ సినిమాలో నాగశౌర్య – మాళవిక నాయర్ మంచి జోడీగా మార్కులు కొట్టేశారు. ఈ సినిమాలోను అదే జోడీ. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ .. ఫీల్ తో ఈ కథను చెప్పడానికి అవసరాల తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే కథలో కొత్తదనం లేదు .. బలం లేదు. ఈ రెండూ లేనప్పుడు ఏ ప్రేక్షకుడు వెంటరాడు .. మధ్యలోనే జారిపోతాడు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ఇంతకుముందు చూసిన కథలను మళ్లీ చెప్పాల్సిన అవసరం ఏముందని, సినిమా మొదలైన కాసేపటికే ఆడియన్స్ అనుకుంటారు.
సాధారణంగా ప్రేమకథల్లో ఏముంటాయి? ప్రేమలో మునిగిపోవడం .. సరదాలు .. కోపాలు .. తాపాలు .. రాజీలు వంటివే ఉంటాయి. ఇందులోను అవే ఉన్నాయి. అయితే ఇవన్నీ కలగడానికి ఒక బలమైన కారణం కావాలి .. ఆ కారణం కొత్తగా అనిపించాలి. ఫీల్ పేరుతో ఎక్కువ సమయం తీసుకోకుండా కథను పరిగెత్తించాలి. లేదంటే ఆడియన్స్ అసహనానికి లోనవుతారు. కల్యాణి మాలిక్ నుంచి వచ్చిన రెండు పాటలు చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఈ కథను ఆదుకోవడం ఆ పాటల వల్ల అయ్యే పని కాదు. అవసరాలకి కథ – స్క్రీన్ ప్లే పై మంచి పట్టుంది. కానీ అన్నిసార్లూ అన్నీ కుదరాలని లేదు కదా!