నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి‘. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. నాయకనాయికల పదేళ్ల జీవిత ప్రయాణాన్ని ఏడు దశల్లో సహజంగా చూపించనున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ‘కనుల చాటు మేఘమా’ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు.
శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన మొదటి రెండు సినిమాలు ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’కు సంగీతం అందించిన కళ్యాణి మాలిక్ ముచ్చటగా మూడో చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. అప్పట్లో వంశీ-ఇళయరాజా కాంబినేషన్ కి ఎంతటి క్రేజ్ ఉందో.. ఇప్పుడు కేవలం రెండు చిత్రాలతోనే శ్రీనివాస్ అవసరాల-కళ్యాణి మాలిక్ కాంబినేషన్ కూడా అలాంటి ప్రత్యేక క్రేజ్ ను సొంతం చేసుకోవడం విశేషం. వీరి కలయికలో వచ్చిన సినిమాల్లోని మెలోడీలు ఎంతో ఆహ్లాదకరంగా, ఓ కొత్త లోకంలో విహరింపజేసే అంత హాయిగా ఉంటాయి. ఇటీవల ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి విడుదలైన మొదటి పాట ‘కనుల చాటు మేఘమా’ కూడా శ్రోతలను కట్టిపడేసింది. ఇక రెండో పాటగా విడుదలైన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టైటిల్ సాంగ్ కూడా అదే స్థాయిలో మెప్పిస్తోంది.
నాయకా, నాయికల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? వారి ప్రయాణం సాగింది? అనే విషయాలను తెలుపుతూ సాగే పాట ఇది. లిరికల్ వీడియోలో నాయకా నాయికల కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి పాత్రల తీరు, వారి పరిచయం కాస్త భిన్నం అని తెలిపేలా.. వీడియో ప్రారంభంలో ఓ వైపు నాయకా నాయికలు వర్షంలో తడుస్తూ ఉండటం, మరో వైపు ఆకాశంలో సూర్యుడు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. మొదటి నుండి చివరి వరకు వారి ప్రయాణం ఎంతో అందంగా ఆసక్తికరంగా సాగిందని అర్థమవుతోంది. “ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఇవాళే కలిశారు తొలిసారిగా..” అంటూ సాగే ఈ పాట మొదటిసారి వినగానే పాడాలి అనిపించేలా ఎంతో అందంగా, అర్థవంతంగా ఉంది. అందమైన మెలోడీలను స్వరపరచడంలో దిట్ట అయిన కళ్యాణి మాలిక్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు.