Sunday, January 19, 2025
Homeసినిమాప్రముఖుల సమక్షంలో ‘ఇట్లు అమ్మ’ ప్రివ్యూ షో

ప్రముఖుల సమక్షంలో ‘ఇట్లు అమ్మ’ ప్రివ్యూ షో

సీనియర్ నటి రేవతి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఇట్లు అమ్మ’. ఈ సందేశాత్మక చిత్రాన్ని బొమ్మక్ క్రియేషన్స్ పతాకంపై బొమ్మక్ మురళి నిర్మించారు. నాగులపల్లి కనకదుర్గ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సి.ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించారు. సోని లివ్ ఓటీటీలో ఈ సినిమా ఇవాళ్టి (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రివ్యూ షో ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ, రాజకీయ ప్రముఖులు తిలకించారు. మాజీ మంత్రి జె గీతారెడ్డి, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, సామాజిక వేత్త షాజియా, మహిళ సంఘ నేతలు దేవి, రచయిత జయరాజ్ తదితరులు ఈ ప్రివ్యూ షో కు హాజరయ్యారు.

నిర్మాత బొమ్మక్ మురళి మాట్లాడుతూ “చెడుమార్గంలో పయణిస్తున్న సమాజం తిరిగి సన్మార్గం పట్టేందుకు అమ్మ ముందడుగు వేయాలనే సందేశాన్ని ‘ఇట్లు అమ్మ’ చిత్రం ప్రేక్షకులకు ఇవ్వబోతోంది. మంచి సమాజాన్ని నిర్మించేందుకు ప్రపంచంలోని అమ్మలంతా ఒక్కటవ్వాలనే పిలుపునిస్తుందీ సినిమా. ఈ కథ దర్శకుడు చెబుతుంటే కన్నీళ్లు వచ్చాయి. ఒక మంచి చిత్రాన్ని సమాజానికి అందివ్వాలనే ఇట్లు అమ్మ చిత్రాన్ని నిర్మించాం. సోని లివ్ ఓటీటీలో తప్పకుండా మా చిత్రాన్ని చూడండి అన్నారు.

మాజీ మంత్రి  జె గీతా రెడ్డి మాట్లాడుతూ “శత్రువైనా మిత్రుడైనా అందరూ అమ్మకు బిడ్డలే అనే గొప్ప సత్యాన్ని ఇట్లు అమ్మ సినిమా చూపిస్తుంది. అమ్మ హృదయం ఎంత గొప్పదో ఈ సినిమా చూస్తే తెలుస్తోంది. ప్రతి అమ్మ, ప్రతి పురుషుడు చూడాల్సిన చిత్రమిది. మా అమ్మ ఈశ్వరీబాయి లైఫ్ డాక్యుమెంటరీ కూడా ఈ దర్శకుడు ఉమామహేశ్వరరావు తీయాలని కోరుతున్నాం. ఇట్లు అమ్మ లాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించి, తన అభిరుచి చాటుకున్న నిర్మాత బొమ్మక్ మురళీకి నా అభినందనలు. అన్నారు.

దర్శకుడు సి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ “ప్రపంచ గతిని మార్చే శక్తి అమ్మకు ఉంది.  సమాజంలో జరిగే హింసకు, బేధాలకు ఎక్కువగా ప్రభావితం అయ్యేది స్త్రీ. ముఖ్యంగా అమ్మ. హింస, తేడాలు లేని గొప్ప సంఘాన్ని స్థాపించగల శక్తి మహిళ సొంతం. ఇందుకు తల్లులందురూ ఏకమవ్వాలి అని చెప్పేందుకు ఈ చిత్రాన్ని రూపొందించాం. మహిళ నాలుగు గోడలకు పరిమితం కాకూడదు. సమాజాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తమ అభిప్రాయాలను గొంతెత్తి చెప్పాలి. అలా ఓ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథ. పురోగతి చెందే సమాజంలో మహిళ ప్రధాన భాగం కావాలని కథలో చూపిస్తున్నాం. ఇట్లు అమ్మ చిత్రాన్ని సోని లివ్ ఓటీటీలో తప్పక చూడండి” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్