Saturday, January 18, 2025
HomeTrending Newsదేశమంతా విద్యుత్తు సంక్షోభం

దేశమంతా విద్యుత్తు సంక్షోభం

దేశంలో భారీగా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. అందుకు సమర్థమైన వ్యవస్థలూ ఉన్నాయి. కానీ.. కేవలం కేంద్రం అసమర్థత, నిర్లక్ష్యం, నిరాసక్తత కారణంగా తగినంత విద్యుదుత్పత్తి జరగటం లేదు. అవసరమైన కరెంటు సరఫరా కావటం లేదు. పర్యవసానంగా పలు రాష్ట్రాలు తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తున్నది. కోతలు విధించడం మినహా రాష్ట్రాలకు   ప్రత్యామ్నాయమే లేకుండా పోతున్నది. గత మార్చిలో 30వ తేదీవరకు దేశవ్యాప్తంగా 574 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్తు కొరత ఎదుర్కొన్నదంటే కేంద్ర ప్రభుత్వ విధానంలో, పరిపాలనలోనే లోపం ఉన్నదని తేలిపోయింది. మార్చి 30న 37.12 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్తు కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా ప్రణాళికలు చేయలేకపోవడం, వ్యూహాత్మక కార్యాచరణ లోపించడంతో ఇవాళ దేశంలో విద్యుత్తు సంక్షోభం ఏర్పడింది.

నిజానికి భారీగా విద్యుత్తు స్థాపిత సామర్థ్యం మన దేశానికి ఉన్నది. రాష్ట్రాల క్యాటగిరీలో 1,05,325.98 మెగావాట్లు, ప్రైవేటు సెక్టార్‌లో 1,91,954.96 మెగావాట్లు, కేంద్ర ప్రభుత్వ సెక్టార్‌లో 98,326.93 మెగావాట్ల స్థాపిత సామర్థ్యమున్నది. మొత్తంగా చూసుకొంటే.. 3,95,607.86 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్నది. సౌర, జల విద్యుత్తు విషయంలో కొంత అస్పష్టత ఉంటుంది. సౌర విద్యుత్తు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. జల వనరుల లభ్యతను బట్టే జలవిద్యుదుత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏ సమయంలోనైనా ఉత్పత్తి చేసేది థర్మల్‌ మాత్రమే. ఈ థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొన్నా.. దేశవ్యాప్తంగా 2,10,510.50 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్నది. దీనికి అదనంగా గ్యాస్‌ ఆధారితంగా సుమారు 24.9 వేల మెగావాట్లు ఉండగా.. డీజిల్‌, న్యూక్లియర్‌ కలిసి 7,200 మెగావాట్ల వరకు స్థాపిత సామర్థ్యం ఉన్నది. ఈ మొత్తాన్ని కూడా గరిష్ఠంగా ఉపయోగించుకోలేని పరిస్థితిలో మన దేశం ఉండటం గమనార్హం.

గరిష్ఠ డిమాండ్‌
దేశవ్యాప్తంగా వస్తున్న గరిష్ఠ డిమాండ్‌, వినియోగాన్ని పరిశీలిస్తే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థమవుతుంది. కేంద్ర ప్రాధికార సంస్థలైన సీఈఏ (సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ), పొసొకొ (పవర్‌ సిస్టం ఆపరేషన్‌ కార్పొరేషన్‌)లో పొందుపర్చిన గణాంకాల ఆధారంగా పరిశీలిస్తే.. ఎప్పుడైనా 2 లక్షల మెగావాట్లకు కాస్త అటూ ఇటూగా గరిష్ఠ డిమాండ్‌ ఉంటున్నది. కానీ ఇక్కడే ఆ స్థాయిలోనూ మనం ఉత్పత్తి చేసి, వినియోగదారులకు అందించలేని పరిస్థితిలో ఉండటమనేది కేంద్ర విధానాల వల్లనే అని విద్యుత్తు నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. ఉదాహరణకు.. 2022 ఫిబ్రవరి నెలను పరిశీలిస్తే.. ఆ నెలలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ (దేశ వ్యాప్తంగా) 1,93,859 మెగావాట్లుగా నమోదయ్యింది. అందుబాటులో ఉన్న విద్యుత్తు మాత్రం 1,93,588 మెగావాట్లు. సుమారు 271 మెగావాట్ల కొరత తలెత్తింది. మొత్తంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో (ఫిబ్రవరి 2022 వరకు) పరిశీలిస్తే.. గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ 2,03,014 మెగావాట్లు రాగా.. అందుబాటులో ఉన్న విద్యుత్తు మాత్రం 2,00,539 మెగావాట్లు మాత్రమే. అంటే సుమారు 2,475 మెగావాట్ల లోటు ఏర్పడింది. ఈ లోటు గరిష్ఠ డిమాండ్‌లో 1.2 శాతం.

సామర్థ్యం ఉన్నా ఉత్పత్తి లేదు..
నిజానికి దేశవ్యాప్తంగా 3.95 లక్షల మెగావాట్లకుపైగా విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా.. గరిష్ఠ డిమాండ్‌ మాత్రం 2 లక్షల మెగావాట్లకు కాస్త అటూ ఇటూగా ఉంటున్నది. కానీ ఉత్పత్తి మాత్రం ఆ స్థాయిలోనూ చేయలేకపోతున్నాం. దీనికి ప్రధాన కారణం.. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాలేనని విద్యుత్తు రంగ నిపుణులు, కార్మిక సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నా.. కేవలం కార్పొరేట్‌ సంస్థలను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు, విద్యుత్తు రంగాన్ని కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో పెట్టేందుకు వీలుగా విధానాలు రూపొందిస్తున్నది. దీనిని దేశ వ్యాప్తంగా విద్యుత్తు కార్మిక సంఘాలు, సంస్థలు, దాదాపు 11 రాష్ట్రాలు బాహాటంగా వ్యతిరేకిస్తున్నా.. కేంద్రం తన విధానాలను మాత్రం మార్చుకోవడం లేదు. పైగా రోజుకో కొత్త నిబంధనను తీసుకొస్తూ విద్యుత్తు సంస్థలను మెల్లమెల్లగా హస్తగతం చేసుకొనేలా వ్యవహరిస్తున్నది.

ప్రైవేటును రక్షించేందుకేనా?
ఈ నేపథ్యంలోనే ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్‌ హాలిడే ప్రకటించారు. అనేక రాష్ర్టాల్లోనూ విద్యుత్తు కోతలను అమలు చేస్తున్నారు. ప్రైవేటు రంగంలో ఉన్న 1.02 లక్షల మెగావాట్ల రెన్యూవబుల్‌ ఎనర్జీని అందరూ వినియోగించుకునేలా చూస్తున్న కేంద్రం.. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను బలవంతంగా ఉత్పత్తిని తగ్గించుకొనేలా వ్యవహరిస్తున్నదని విద్యుత్తు రంగ నిపుణులు నెత్తి నోరు కొట్టుకొంటున్నారు. దీనివల్లనే ప్రజలకు అవసరమైనంత మేర విద్యుత్తును అందించడంలేదని వారంటున్నారు. ఇది కేవలం ప్రైవేటురంగంలోని బడా శక్తులను రక్షించడానికి, వారు ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం కల్పించడమేనని విమర్శలు వస్తున్నా.. కేంద్రం మాత్రం తన ఒంటెత్తు పోకడలతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే.. కావాల్సినంత విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉన్నా.. కేంద్రం నిబంధనలు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను కట్టిపడేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అంటే అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుని నోట్లో శని చందంగా.. కేంద్రం విద్యుత్తు రంగ సంస్కరణల పేరిట ప్రభుత్వ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను పడుకోబెడుతూ.. ప్రైవేటుకు పట్టం కడుతూ.. ప్రజలు మాత్రం కోతలతో సతమతమయ్యేలా చేస్తున్నది.

ఏపీలో మొదలైన విద్యుత్తు కోతలు
హైదరాబాద్‌, మార్చి 31 (నమస్తేతెలంగాణ) ః వేసవి ప్రారంభంలోనే ఏపీలో విద్యుత్తు కోతలు మొదలైనాయి. ఉదయం నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరెంట్‌ కోత విధించారు. డిమాండ్‌కు తగిన సరఫరా లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఉదయం నుంచి 6 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. డిమాండ్‌ 230 మిలియన్‌ యూనిట్లు ఉండగా, 180 యూనిట్లు మాత్రమే సరఫరా అవుతున్నదని అధికారులు తెలిపారు. పవర్‌ ఎక్స్చ్‌ంజ్‌లో పీక్‌ అవర్‌లో యూనిట్‌ రూ.12కు కొంటున్నట్టు అధికారులు తెలిపారు.

వినియోగంలోనూ..
విద్యుత్తు వినియోగం (ఎనర్జీ) విషయానికి వస్తే.. కావాల్సినంత విద్యుత్తును సరఫరా చేయలేకపోయారనేది స్పష్టమవుతున్నది. 2022 ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా 1,08,362 మిలియన్‌ యూనిట్ల అవసరం ఉండగా.. 1,08,032 మిలియన్‌ యూనిట్లు మాత్రమే సరఫరా చేయగలిగారు. అంటే సుమారు 330 మిలియన్‌ యూనిట్లు (మొత్తం వినియోగంలో 0.3 శాతం) కొరత ఏర్పడిందన్నమాట. 2021-22 ఆర్థిక సంవత్సరంలో (ఫిబ్రవరి 2022 వరకు) దేశవ్యాప్తంగా మొత్తం 12,50,625 మిలియన్‌ యూనిట్ల అవసరం ఉండగా.. 12,45,546 మిలియన్‌ యూనిట్ల మేర మాత్రమే విద్యుత్తును సరఫరాచేశారు. సుమారు 11 నెలల సమయంలో 5,078 మిలియన్‌ యూనిట్ల (మొత్తం వినియోగంలో 0.4 శాతం) మేర వినియోగానికి విద్యుత్తును ఇవ్వలేకపోయారన్నమాట. ఇలా చూస్తే.. అధికారిక గణాంకాల ప్రకారం 2022 మార్చి నెలలో (30 తారీఖు వరకు) మొత్తం 574 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు లోటు ఏర్పడింది. మార్చి 30 నాడు ఒక్క రోజే 37.12 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు కొరత తలెత్తింది. అందుకే రాష్ర్టాలు కోతలు విధించక తప్పలేదు. పీక్‌ సమయాల్లోనైతే యూనిట్‌కు భారీగా ఖర్చుచేసి కొనాల్సిన పరిస్థితి రాష్ర్టాలకు ఏర్పడింది.

పవర్‌ ఫుల్‌ తెలంగాణ
దేశమంతా సంక్షోభం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు.. పటిష్ఠమైన ప్రణాళికతో విద్యుత్తు ఉత్పత్తి, సరఫరాలో లోపం లేకుండా చూసుకొంటున్నది. మార్చి 29 నాడు రికార్డు స్థాయిలో 14,160 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ వచ్చినప్పటికీ.. ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నది.

విద్యుత్తు కొరత ఉన్న రాష్ట్రాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ ఆంధ్రప్రదేశ్‌, గోవా, హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌, బీహార్‌

ఇదీ దేశ విద్యుత్తు పరిస్థితి

★ గరిష్ఠ స్థాపిత సామర్థ్యం
3,95,607 మెగావాట్లు

★ సగటున గరిష్ఠ డిమాండ్‌
2,00,000 మెగావాట్లు

★ మార్చిలో కొరత
574 మిలియన్‌ యూనిట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్