ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఊహించని విధంగా ఆదిపురుష్ చిత్రం పై రోజుకో వివాదం వస్తుంది. రామాయణాన్ని వక్రీకరించారు అంటూ రామభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈతరానికి అర్థమయ్యే రీతిలో రామాయణాన్ని తెరకెక్కించారని.. ఇప్పుడున్న యూత్ కి ఇలా తీస్తేనే అర్థం అవుతుందని కొంత మంది సమర్థిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం పై విమర్శలు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాస్ కు చెందిన ఓ వీడియో వైరల్ అయ్యింది.
ఇంతకీ విషయం ఏంటంటే… ఆదిపురుష్ సినిమా షూటింగ్ నాలుగు రోజులు పూర్తయిన తర్వాత తాను పోషిస్తున్న రాఘవుడి పాత్ర పై అనుమానం వ్యక్తం చేసినట్లుగా ప్రభాస్ ఆ వీడియోలో పేర్కొన్నారు. రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన ఆ వీడియోను ప్రభాస్ అభిమానులు షేర్ చేస్తూ, ఓంరౌత్ మేకింగ్ ను విమర్శిస్తున్నారు. రాధేశ్యామ్ ప్రచారంలో భాగంగా అప్పుడు ప్రభాస్ మాట్లాడుతూ.. నాలుగు రోజులు షూటింగ్ తర్వాత ఓంరౌత్ ని పిలిచి నేను ఈ సినిమాను చేయవచ్చునా? అని అడిగాను. ఎందుకంటే అంతకు ముందు ఇలాంటి పాత్రలను నేను చేయలేదు. ఇతర సినిమాల విషయంలో తప్పు జరిగినా సమస్య లేదు కానీ ఆదిపురుష్ విషయంలో ఎలాంటి తప్పు జరగకూడదు అని చెప్పారట.
దానికి ఓంరౌత్ స్పందిస్తూ ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, నేను ఉన్నానని చెప్పాడని ఆ వీడియోలో ప్రభాస్ చెప్పినట్లుగా ఉంది. ప్రభాస్ ముందే హెచ్చరించినా ఓంరౌత్ అతివిశ్వాసంతో ఈ సినిమాను చేశారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభాస్ కు ఇలాంటి విమర్శలు వస్తాయని ముందే తెలియడం వలనే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ప్రమోషన్స్ చేయకుండా విదేశాలకు వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి. మరి.. ఆదిపురుష్ విమర్శల పై ప్రభాస్ స్పందిస్తాడేమో చూడాలి.