రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు శ్రీశైలంలో పర్యటించనున్నారు. భ్రమరాంభ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామివారిని ఆమె దర్శించుకుంటారు. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ ప్రసాద్ స్కీమ్ ద్వారా 43 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆమె ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో రాష్ట్రపతితో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిచడంతో పాటు నంది సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన పర్యాటకుల సౌకర్యాల కేంద్రానికి ఆమె లాంఛనంగా ప్రారంబోత్సవం చేస్తారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వారం రోజులుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భద్రత, బస, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రపతి ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో సున్నిపెంటలో హెలీప్యాడ్ దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుంటారని సమాచారం. దాదాపు 1800మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ, ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి తదితర అధికారులు ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో శ్రీమతి ముర్ము తిరిగి వెళతారు.