Psycho Squirrel : ఒకప్పుడు జంతువుల మధ్య ప్రేమ, అనురాగం పత్రికలకు సినిమాలకు మంచి సరుకు. కలికాలం ప్రభావమో ఏంటో మొన్నీమధ్య కోతులు పగపట్టి కుక్కపిల్లల్ని చంపిన విషయం తెలుసుకున్నాం. తాజాగా ఒక ఉడుత అందరినీ కొరికి దోషిగా మారి మరణ శిక్షకు గురయింది.
బ్రిటన్ లో కొరిన్ అనే జంతు ప్రేమికురాలి దగ్గరకి రోజూ ఒక ఉడుత వచ్చి ఆహారం తీసుకునేది. ఒకరోజు ఆహారం అందిస్తుంటే చెయ్యి కొరికి పారిపోయింది. ఇదేమిటా అని విస్తుపోయిన కొరిన్ ఫేస్ బుక్ తెరిస్తే ఉడుత గురించి అనేక ఫిర్యాదులు కనబడ్డాయి. అప్పటికే ఎందరినో కరిచిందట. వారిలో పిల్లలు, పెద్దలు, పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి. ఉడుతకి సైకో పేరు పెట్టి తిడుతూగాయపడ్డవారు బాధ వెళ్లగక్కుతున్నారు. దాంతో సంబంధిత అధికారులు కొరిన్ సాయంతో ఉడుత కి ఆహారం పెట్టించి ఉచ్చులో పడేలా చేసి పట్టుకున్నారు. అక్కడి చట్టాల ప్రకారం అడవిలో వదలడానికి లేదు కాబట్టి ప్రత్యేక అనుమతితో ఇంజెక్షన్ ఇచ్చి కారుణ్య మరణం ప్రసాదించారు. తనవల్లే ఈ మరణం సంభవించిందని కొరిన్ బాధ. ఔరా! కలికాలం అంటే ఇదేనేమో! లేకపోతే రాముడికి వారధి కట్టడంలో సాయం చేసిన ఉడుత ఇలా మారిపోయిందేమిటో! సినిమా కథకు పనికొచ్చే విషయమే సుమా!
Also Read : సోఫా సహిత సర్పం