Sunday, November 24, 2024
HomeTrending Newsయాసంగి సాగు రికార్డు

యాసంగి సాగు రికార్డు

యాసంగి వచ్చిందంటే భూములన్నీ బీడు పెట్టి రైతులంతా ఇంటికాడ కూర్చునేటోళ్లు. లేదంటే కూలీనాలీ పనులకు వెళ్లేటోళ్లు.. ఇది ఎనిమిదేండ్ల కిందటి ముచ్చట. ఇప్పుడు సాగు సీజన్‌ సీన్‌ మారింది. జీవధార కాళేశ్వరంతో పుష్కలమైన సాగునీరు, నిరంతర ఉచిత విద్యుత్తు, పెట్టుబడిసాయంతో మండుటెండల్లోనూ పసిడి పంటలు పండుతున్నాయి. ఈసారి యాసంగిలో ఏకంగా 68.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తెలంగాణ యాసంగి చరిత్రలో ఇదే ఆల్‌టైమ్‌ రికార్డు.

సరిగ్గా ఎనిమిదేండ్లలో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అద్దెకరం పారితే గొప్ప అనుకొనే రోజులు పోయి, ఏకంగా పదెకరాల పంటలను పారిస్తున్నరు మన తెలంగాణ రైతన్నలు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి ఫలితం. ఆ ఫలితం ఎంతటిదంటే.. ఈ యాసంగి సీజన్‌ పంటల సాగులో ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ఉమ్మడి పాలనలోనూ ఎప్పుడూ లేనివిధంగా ఈసారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 68.53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యాయి. 2020-21 రికార్డును బద్ధలు కొడుతూ సరికొత్త రికార్డు నమోదైంది. మొత్తం పంటల సాగుతో పాటు వరి సాగు కూడా నయా రికార్డులను సృష్టించింది. ఏకంగా 53.08 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం లెక్కలను బుధవారం వ్యవసాయ శాఖ విడుదల చేసింది. సాగుకు ఇంకా 10 రోజుల సమయం ఉన్నది. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది.

49 లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు
సాగునీటికి కరువుండే యాసంగిలోనూ రాష్ట్రంలో అనూహ్య రీతిలో పంట సాగు పెరుగుతుండటం గమనార్హం. ఎనిమిదేండ్లలోనే రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం ఏకంగా 48.61 లక్షల ఎకరాలు పెరిగింది. 2015-16 యాసంగిలో సీజన్‌లో తెలంగాణ అంతటా 19.92 లక్షల ఎకరాలే సాగైంది. అదిప్పుడు 68.53 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక, యాసంగి వరి గత ఎనిమిదేండ్లలో 45.73 లక్షల ఎకరాలు పెరగటం విశేషం. 2015-16 యాసంగిలో 7.35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. అంటే.. వరి సాగు ఏడింతలు పెరిగింది.

అంచనాలను మించి..
ఉమ్మడి ఏపీ, తెలంగాణ వ్యవసాయ చరిత్రలో 2020-21 యాసంగిలో అత్యధిక సాగు నమోదైంది. ఆ సీజన్‌లో మొత్తం 68.17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇదే స్థాయిలో వరి కూడా రికార్డు స్థాయిలో 52.80 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక భవిష్యత్తులో ఈ సాగును మించి కాబోదని అందరూ అంచనా వేశారు. కానీ ఈ సీజన్‌లో సాగు 68.53 లక్షలకు చేరుకోగా, వరి సాగు 53.08 లక్షలకు చేరింది.

సీఎం కేసీఆర్‌ కృషి ఫలితమే
అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోవటానికి ప్రధాన కారణం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆయన నిరంతర శ్రమ, పట్టుదల వల్లే నేడు తెలంగాణ సస్యశ్యామలంగా మారింది. వ్యవసాయాన్ని గాడిలో పెట్టి రైతులు సగర్వంగా జీవించేలా ప్రణాళికలు అమలు చేశారు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు నీరు, కరెంటు గోస తీర్చారు. రైతుబంధు అందించి రైతులకు అండగా నిలిచారు. వ్యవసాయ రంగంలో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ రికార్డు స్థాయిలో పంటలు సాగు చేసేలా చేశారు. సీఎం కేసీఆర్‌ చేయూతతో ఇప్పుడు తెలంగాణ రైతులు అధిక పంటలు సాగు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also Read : నాడు కంట తడి ఉంటే ..నేడు పంట తడి ఉంది : మంత్రి హరీశ్‌రావు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్