కొరియోగ్రఫర్ గా చాలా వేగంగా లారెన్స్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తరువాత నటుడిగా .. దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాలు కూడా సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ‘కాంచన’ .. ‘గంగ’ వంటి సినిమాలు ఆయన క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాలను ఏ భాషలో విడుదల చేస్తే ఆ భాషలో కాసుల వర్షం కురిసింది. ఆ తరువాత నుంచి ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూసే స్థాయికి ఆయన వెళ్లిపోయాడు.
గతంలో హారర్ కామెడీ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ, లారెన్స్ ఈ జోనర్ కి సంబంధించిన సినిమాలకి స్పెషలిస్టుగా మారిపోయాడు. హారర్ తో పాటు కావలసినంత కామెడీని జొప్పించి అందించడం వలన, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. దానితో ఆయన ఆ జోనర్ ను గట్టిగానే పట్టుకున్నాడు. ఆ మధ్య ఆయన నుంచి వచ్చిన ‘కాంచన 3’ .. ‘శివలింగ’ సినిమాలు కూడా హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందినవే. కారణం తెలియదుగానీ, ఆ తరువాత ఆయన చాలా గ్యాప్ తీసుకున్నాడు.
మళ్లీ ఇప్పుడు ఆయన ‘రుద్రుడు’ సినిమాతో వస్తున్నాడు. కథిరేసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ప్రియా భవాని శంకర్ కథనాయికగా అలరించనుండగా, శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. పోస్టర్స్ తోనే ఆసక్తిని పెంచుతున్న ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. చాలా గ్యాప్ తరువాత వస్తున్నాడు గనుక ఇప్పుడు ఈ సక్సెస్ ఆయనకి చాలా అవసరం. గతంలో మాదిరిగానే లారెన్స్ కి ఇక్కడి ప్రేక్షకులు గట్టి విజయాన్నే కట్టబెడతారేమో చూడాలి. ఈ సినిమా తరువాత ఆయన నుంచి ఇదే జోనర్లో రావడానికి ‘చంద్రముఖి 2’ .. ‘దుర్గ’ లైన్లోనే ఉండటం విశేషం.