కరోనా రెండో దశ ఎదుర్కోవడంలో ప్రధానమంత్రి మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇటీవలి కాలంలో మోడీపై విమర్శల దాడి చేస్తున్న రాహుల్ తాజాగా మరోసారి కరోనా విషయంలో మోడీ తీరుపై నిలదీశారు. కోవిడ్ మొదటి దశ వచ్చినప్పుడు దానిపై ఎవరికీ అంతగా అవగాహన లేదని… కానీ రెండో దశ కోవిడ్ పై నిపుణులు హెచ్చరికలు చేసినా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
కరోనా వ్యాక్సిన్ మనమే తయారు చేసున్నా ఇక్కడి ప్రజలకే వ్యాక్సిన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ త్వరగా ఇవ్వలేకపోతే మనదేశం మరిన్ని కోవిడ్ దశలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా మరణాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆరోపించిన రాహుల్ గాంధీ, నిజాలు చెప్పడం వారికి అలవాటు లేదంటూ ఘాటు వ్యాఖలు చేశారు,
దురదృష్టవశాత్తు మన ప్రధానమంత్రి ఒక ఈవెంట్ మేనేజర్ అని ఆయన ఒకేసారి రెండు ఈవెంట్లు మేనేజ్ చేయలేరంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి ఈవెంట్ మేనేజర్లు అవసరం లేదని సత్వరం స్పందించే సమర్థవంతమైన పరిపాలన యంత్రాంగం ఇప్పుడు అవసరమని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోడీ తన ఇమేజిని పునరుద్ధరించుకునే పనిలో పడ్డారని… కానీ ఇమేజ్ ను పూర్తిగా కోల్పోయిన వాస్తవాన్ని గ్రహించాలని సూచించారు. ఇప్పటికైనా దేశాన్ని ఒక సరైన మార్గంలో నడిపించాలని ప్రధాని మోడికి రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.