ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా…తమిళనాడు తీర ప్రాంతాలను అల్లకల్లోలం చేసే ఈశాన్య రుతు పవనాలు ఈ ఏడాది కూడా వచ్చాయి. తిరోగమన రుతుపవనాలతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది తమిళనాడువైపు దూసుకొస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (గురువారం) ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి. చెన్నై సహా పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తోంది. చెన్నైలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘మాండస్’ తుపాను హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్రంలోని 14 జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలకు అవకాశమున్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జాతీయ విపత్తుల నివారణ బృందాలను (ఎన్డీఆర్‌ఎప్) రంగంలోకి దింపింది.
కాగా, తుపాను ‘మాండస్’ ఈనెల రేపు (శుక్రవారం) రాత్రి తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. తుఫాను ప్రభావంతో దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తుపాను నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉంటుందని, దక్షిణకోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ల కూడదని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని కోరింది.