ఇంగ్లాండ్ తో జరుగుతోన్న టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టగా మూడు వికెట్లకు 60 పరుగుల వద్ద వర్షంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది.
నిన్న 83 పరుగులతో క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా సెంచరీ (104) సాధించి 9వ వికెట్ గా వెనుదిరిగాడు. ఏడు వికెట్ల నష్టానికి 338 పరుగులతో నేడు రెండో రోజు ఆట మొదలు పెట్టిన ఇండియా జట్టులో షమీ-16 స్కోరు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ బుమ్రా 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు, సిరాజ్ కేవలం రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరడంతో ఇండియా ఆలౌట్ అయ్యింది.
తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ కు ఐదు; మ్యాటీ పాట్స్ రెండు; స్టువార్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్, జో రూట్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ 16 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అలెక్స్ లీస్ 6 పరుగులు చేసి ఔటయ్యాడు. జాక్ క్రాలే-9; ఓలీ పోప్ -10 పరుగులు చేసి వెనుదిరిగారు. అంతరాయం తరువాత మ్యాచ్ ప్రారంభం కాగా మరో రెండు వికెట్లు ఇంగ్లాండ్ కోల్పోయింది. సిరాజ్, షమీలకు చెరో వికెట్ దక్కింది. జో రూట్ 31 పరుగులు చేసి ఔట్ కాగా జాక్ లీచ్ డకౌట్ అయ్యాడు. మ్యాచ్ ముగిసే సమయానికి 84 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది.