Sunday, January 19, 2025
Homeసినిమావెండితెర చందమామ... రాజశ్రీ

వెండితెర చందమామ… రాజశ్రీ

తెలుగు తెరకి పరిచయమైన నిన్నటితరం అందాల కథానాయికలలో రాజశ్రీ ఒకరు. కేఆర్ విజయ తరువాత అంతటి అందమైన నవ్వు రాజశ్రీలో కనిపిస్తుందని అప్పట్లో చెప్పుకునేవారు. అలాగే కృష్ణకుమారి తరువాత కళ్లతోనే అద్భుతంగా హావభావాలను పలికించగల నాయికగా రాజశ్రీ గురించి మాట్లాడుకునేవారు. చందమామ కథలలోని అందమైన రాజకుమారిలా ఉందంటూ అంతా ఆమెను అభిమానించారు .. ఆరాధించారు. ఆనాటి కథానాయికలలో చాలా వేగంగా డాన్స్ చేయగల హీరోయిన్ గా కూడా ఆమె పేరు తెచ్చుకున్నారు.

రాజశ్రీ అనేది ఆమె సినిమాల్లోకి వచ్చిన తరువాత మార్చుకున్న పేరు .. ఆమె అసలు పేరు కుసుమకుమారి. వైజాగ్ లో జన్మించిన రాజశ్రీ, ఏలూరు .. విజయవాడలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆ సమయంలోనే క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నారు. చేప పిల్లల మాదిరిగా తళుక్కున మెరిసే కళ్లు .. సమ్మోహితులను చేసే నవ్వుతో రాజశ్రీ పాలపుంతలా కనిపించేవారు. అందం … అభినయం పట్ల ఆసక్తి ఉండటంతో సహజంగానే ఆమె నటన దిశగా అడుగులు వేశారు. చాలా తక్కువ సమయంలోనే ఆమె తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ … హిందీ సినిమాలకు పరిచయమయ్యారు.

సావిత్రి .. జమున .. కృష్ణకుమారి .. కాంచన వంటివారు అందం పరంగాను .. అభినయం పరంగాను బరిలో ఉన్నప్పుడు, ఆ వైపుకు వెళ్లడానికి కొత్తవారు ఆలోచన చేయని పరిస్థితి. అయినప్పటికీ రాజశ్రీ ధైర్యంగా బరిలోకి దిగారు. ఒక్కో సినిమాతో కుదురుకుంటూ ముందుకు వెళ్లారు. రాజశ్రీ ముగ్ధమోహన రూపాన్ని చూసి అప్పట్లో మనసు పారేసుకోనివారు లేరు. ఆ నాటి వెండితెరపై చందమామను .. రాజశ్రీని పక్కపక్కనే చూపిస్తే పోల్చుకోవడం కష్టామన్నంతగా కళగా ఆమె కనిపించేవారు.

రాజశ్రీ ఎంట్రీ ఇచ్చే సమయానికి జానపదాల జోరు సాగుతోంది. అందువలన ఆమె ఎన్టీఆర్ .. కాంతారావులతో ఎక్కువ జానపదాలను చేశారు. జానపద కథ తయారవుతున్నప్పుడే కథానాయికగా రాజశ్రీ పేరును అనుకునేవారు. అందుకు కారణం ఒక జానపదనాయికకు కావలసిన లక్షణాలు ఆమెలో పుష్కలంగా ఉండటమే. ఇక ఆ తరువాత ఏఎన్నార్ .. శోభన్ బాబు .. కృష్ణ .. చలం వంటి హీరోలతోను తెరపై అందాల సందడి చేశారు. రెండవ కథానాయికగా కనిపించ డానికి కూడా ఆమె వెనుకాడేవారు కాదు.

ఇక ఇప్పటి స్టార్ హీరోయిన్లు ఒక వైపున హీరోయిన్ గా తమ జోరును కొనసాగిస్తూనే, అవకాశం వచ్చినప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తూ వెళుతున్నారు. అప్పట్లోనే రాజశ్రీ అలా చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆమె మంచి డాన్సర్ కావడం వలన తమ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు, రాజశ్రీనే ఎక్కువగా సంప్రదించేవారు. అలా ఒక వైపున హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూనే, ఇతర సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ లో ఆమె మెరిసేవారు. అలా రాజశ్రీ తన ప్రత్యేకతను చాటుకున్నారు.

అప్పట్లో హీరోయిన్ల  మధ్య గట్టిపోటీ ఉన్నప్పటికీ రాజశ్రీ తట్టుకుని నిలబడ్డారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తమిళంలో ఆమె చేసిన ‘కాదలిక్క నేరమిల్లై’ అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను తెలుగులో ‘ప్రేమించిచూడు’ ..  హిందీలో ‘ప్యార్ కియే జా’ అనే టైటిల్స్ తో రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాల్లో హీరోలు మారినప్పటికీ హీరోయిన్ మాత్రం ఆమెనే. ఇక్కడ కూడా ఆ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అలా ఈ మూడు భాషల్లోను ఈ సినిమా ఆమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

రాజశ్రీ పేరుతో తెలుగు .. తమిళ … కన్నడ .. హిందీ సినిమాల్లో నటించిన ఆమె, మలయాళంలో మాత్రం ‘గ్రేసీ’ అనే పేరుతో పాప్యులర్ అయ్యారు. తెలుగులో సాంఘిక చిత్రాల్లో నటించినప్పటికీ, జానపద చిత్రాలు ఎక్కువగా చేయడం వలన జానపదనాయికగానే ఆమెకి ఎక్కువ గుర్తింపు లభించింది. 5 భాషల్లోను కలుపుకుని 300  సినిమాల వరకూ చేసిన ఆమె, ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. రెండు దశాబ్దాల పాటు వెండితెరపై వేయిపున్నమిల వెన్నెలలా విరిసిన రాజశ్రీ పుట్టినరోజు నేడు (ఆగస్ట్ 31). ఈ సందర్భంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.

(రాజశ్రీ జన్మదిన ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్