నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది. కాటేదాన్ చేవెళ్ళ, చార్మినార్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రాంతాల్ని విభజించి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పర్చారు. సర్దార్ వల్లాభాయి పోలీస్ అకాడమి, రాష్ట్ర పోలీస్ అకాడమి, అంతర్జాతీయ విమానాశ్రయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేకతలు.
నియోజకవర్గంలో 5,81,937 మంది ఓటర్లు ఉండగా 3,02,995 మంది పురుష ఓటర్లు, 2,78,898 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. రాజేంద్రనగర్, గండిపేట్, శంషాబాద్ మండలాలతోపాటు GHMC పరిధిలోని శివారంపల్లి, మైలార్ దేవిపల్లి, రాజేంద్రనగర్, శాస్త్రిపురం, అత్తాపూర్ డివిజన్లు ఉన్నాయి. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు GHMC పరిధిలో ఉండగా శాస్త్రిపురం, సులేమాన్ నగర్, హసన్ నగర్ ప్రాంతాల్లో మైనారిటీలు అధికం. నార్సింగి, మణికొండ, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ దీని పరిధిలో ఉన్నాయి.
రాజేంద్రనగర్ లో 2009 2014 ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిన ప్రకాష్ గౌడ్ 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిఛి ఇప్పుడు నాలుగో దఫా విజయం కోసం శ్రమిస్తున్నారు. మూడు సార్లు గెలిచినా ప్రకాశ గౌడ్ నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదని, అభివృద్ధి కార్యక్రమాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు నియోజకవర్గంలో సరిగా అమలు కాలేదనే విమర్శలు ఉన్నాయి. నాలుగు వేల డబుల్ బెడ్ రూముల ఇళ్ళు వచ్చినా అందులో అధికశాతం అనర్హులకు, ఇతర ప్రాంతాల వారికి దక్కాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి కస్తూరి నరేందర్ బరిలో ఉన్నారు. మణికొండ మున్సిపల్ కార్పోరేషన్ చైర్మన్ గా ఉన్న నరేందర్ నియోజకవర్గంలో చురుకుగా ఎన్నికల ప్రచారం నిర్వహించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్థికంగా తట్టుకోలేరని జ్ఞానేశ్వర్ కాకుండా నరేందర్ కు టికెట్ ఇచ్చేసరికి హస్తం శ్రేణులు డీలా పడ్డాయి. మణికొండకే పరిమితమైన నరేందర్ ఇతర ప్రాంతాల్లో పార్టీ నేతగా ప్రజల్లో, పార్టీలో అంతగా గుర్తింపు లేకపోవటం గమనార్హం. దీనికి తోడు కాంగ్రెస్ అభ్యర్థి – బీఆర్ ఎస్ తో కుమ్మక్కయ్యారని రెండు మూడు రోజులుగా పుకార్లు ఎక్కువయ్యాయి.
బిజెపి నుంచి మైలర్ దేవిపల్లి కార్పొరేటర్ గా పనిచేసిన తోకల శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యలపై మొదటి నుంచి ప్రజా పోరాటాలు చేస్తున్న తోకల… ఎమ్మెల్యే అక్రమాలపై తన దగ్గర సాక్షాలు ఉన్నాయని చాలెంజ్ చేసినా అధికార పార్టీ నుంచి స్పందన లేదు. యువకుడు కావటంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకసారి అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
MIM పార్టీ కార్వాన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ ను అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ శాస్త్రిపురంలో నివాసం ఉంటారు. ఎలాగైనా ఈ నియోజకవర్గాన్ని పతంగి ఖాతాలో వేయాలని పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. స్తానికేతరుడు కావటంతో మైనారిటీలు కూడా స్వామి యాదవ్ అభ్యర్థిత్వంపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ – బిజెపిల మధ్యనే పోటీ కేంద్రీకృతం అవుతోంది. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రచారం నిర్వహిస్తున్నాయి. నాలుగో సారి కావటంతో ప్రకాష్ గౌడ్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే సిట్టింగులకే సీట్లు అని పార్టీ అధినేత చెప్పటంతో విరమించుకున్నారని సమాచారం. యుపి సిఎం యోగి ఆదిత్యనాత్ తదితర జాతీయ నేతల ప్రచారంతో బిజెపి క్యాడర్ లో జోష్ వచ్చింది. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, కొంత కాలంగా నియోజకవర్గ సమస్యలపై తోకల గళం ఎత్తడం, MIM మైనారిటీల ఓట్లు చీల్చితే గెలుపు సునాయాసం అని కమలం నేతల అంచనా. కాంగ్రెస్ అభ్యర్థి తన ప్రాంతంలోనే ప్రచారం నిర్వహిస్తున్నారని, మిగతా ప్రాంతాల్లో చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారని పార్టీ నేతలే వాపోతున్నారు.
-దేశవేని భాస్కర్