ఒకప్పుడు ఇద్దరు స్టార్స్ తో సినిమాలు చేస్తేనే మల్టీ స్టారర్ అనేవారు. ఇద్దరు హీరోల్లో ఎవరి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంది అనే విషయంలో అభిమానుల మధ్య పెద్ద చర్చలే నడిచేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పటి మల్టీ స్టారర్స్ లో ఇటు సౌత్ .. అటు నార్త్ కి చెందిన స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారు. వారి రేంజ్ కి తగిన పాత్రలను దర్శక రచయితలు క్రియేట్ చేస్తూ, అభిమానులను ఖుషీ చేస్తుండటం విశేషం. ఒక వైపున కథను .. మరో వైపున పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ ఈ తరహా కథలను తెరకెక్కించడం నిజంగా సాహసమే.
కమల్ హీరోగా లోకేశ్ కనగరాజ్ ‘విక్రమ్’ చేస్తున్నప్పుడు అంతా షాక్ అయ్యారు. ఒక వైపున విజయ్ సేతుపతి .. మరో వైపున మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్. ఈ పాత్రలను ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తాడా అని అంతా అనుకున్నారు. కానీ ఆ విషయంలో ఏ ప్రాంతానికి చెందిన అభిమానుల నుంచి ఎలాంటి విమర్శలూ రాలేదు. అలా లోకేశ్ కనగరాజ్ అందరినీ శాటిస్ ఫై చేశాడు. కమల్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది. ఇలాంటి మల్టీ స్టార్ రజనీ చేస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ అనుకున్నారు.
అలా అభిమానుల అభిరుచికి తగినట్టుగా రజనీ చేసిన సినిమానే ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సన్ పిక్చర్స్ వారు నిర్మించారు. ఈ సినిమాలోని కీలకమైన పాత్రలలో బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ .. కన్నడ నుంచి శివరాజ్ కుమార్ .. మలయాళం నుంచి మోహన్ లాల్ కనిపించనున్నారు. జోనర్స్ వేరైనా భారీతనంలో .. స్టార్స్ ఎంపికలో … యాక్షన్ – ఎమోషన్స్ తో కూడిన కంటెంట్ విషయంలో ‘విక్రమ్’ సినిమాతో పోలికలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 10న థియేటర్లకు రానున్న ఈ సినిమా, సంచలనానికి తెరతీయడం ఖాయమనేది ఫ్యాన్స్ మాట.