బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. రమేశ్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇదే డైరెక్టర్‌తో కోనేరు సత్యనారాయణ ఇప్పుడు రవితేజ కథానాయకుడిగా ‘ఖిలాడి’ అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రమేశ్ వర్మ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో, ఓ స్టార్ హీరోతో ‘రాక్షసుడు 2’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో చేయబోతున్నట్లు ప్రకటించారు కోనేరు.
‘రాక్షసుడు’ సినిమా విడుదలై రెండేళ్లవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘ ‘రాక్షసుడు’ కంటే ‘రాక్షసుడు 2’ చాలా ఎగ్జయిటింగ్ కాన్సెప్ట్ తో రూపొందనుంది. అలాగే కమర్షియల్ అంశాలు కూడా ప్రేక్షకులను ఆక్టుటకునేలా ఈ సబ్జెక్ట్ లో మిక్స్ చేశాం. చాలా థ్రిల్లింగ్ కాన్సెప్ట్. హాలీవుడ్ చిత్రాల రేంజ్‌లో సినిమాను చేయాలనుకుంటున్నాం. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావాలనుకోవడం లేదు. పాన్ ఇండియా రేంజ్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో లీడ్ రోల్ చేయబోతున్నారు. అది ఎవరు అనే విషయాన్ని సరైన సమయంలో తెలియజేస్తాం. ఈ చిత్రాన్ని రూ.100 కోట్లతో చేయాలనుకుంటున్నాం. అలాగే సినిమా మొత్తం లండన్‌లోనే ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం” అన్నారు.