Sunday, May 19, 2024
Homeసినిమాఅలనాటి అందాల నటుడు రామకృష్ణ

అలనాటి అందాల నటుడు రామకృష్ణ

1960లో తెలుగు తెరపై మంచి ఒడ్డూ పొడుగుతో .. ఆకర్షణీయమైన రూపంతో ఆట్టుకున్న కథానాయకులలో రామకృష్ణ ఒకరిగా కనిపిస్తారు. ఆయన కూడా నాటకాల నుంచి సినిమాల దిశగా అడుగులు వేసినవారే. పశ్చిమ గోదావరి జిల్లా  ‘భీమవరం’ గ్రామానికి చెందిన ఆయన, నాటకాల పట్ల గల ఆసక్తితో ఉండేవారు. ఒక వైపున టైలరింగ్ చేస్తూ .. మరో వైపున నాటకాలు వేస్తూ ఉండేవారు. మంచి అందగాడు .. మంచి వాయిస్ .. చక్కని కనుముక్కుతీరు .. హైటుకు తగిన పర్సనాలిటీ ఉండటంతో, సినిమాల్లోకి వెళ్లమని ఆయన స్నేహితులు ఒత్తిడి చేయసాగారు.

దాంతో ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చెన్నై వెళ్లారు. అప్పటికే ఇండస్ట్రీలో మంచి పొడగరి హీరోలుగా కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు .. రంగనాథ్ ఉన్నారు. వాళ్లని దాటుకుని అవకాశాలను తనవరకూ తెచ్చుకోవడం అంత తేలికైన పనేం కాదు. ఆ విషయం ఆయనకి కూడా తెలుసు. వాళ్లంతా కూడా అంతకుముందు తన మాదిరిగా ట్రై చేసినవారే గదా అనే ధైర్యంతో ఆయన ముందడుగు వేశారు. అప్పట్లో ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన వారే అక్కడ ఎక్కువగా ఉండేవారు. వాళ్లందరితో పరిచయాలు పెంచుకుంటే ఎవరో ఏదో ఒక వేషం చెప్పేవారు.

కానీ రామకృష్ణకి కాస్త మొహమాటం ఎక్కువ .. కొత్తవారితో అంత తొందరగా కలిసిపోయే తత్వం కాదు. అందువలన అవకాశాలను వెతికి పట్టుకోవడానికి కొంత సమయం పట్టింది. అలా అవకాశాల కోసం తిరుగుతూ, ‘నిత్య కల్యాణం పచ్చతోరణం’ సినిమాలో వేషం సంపాదించుకున్నారు. వంక బెట్టలేని రూపం రామకృష్ణ సొంతం .. అందువలన ఏ సినిమా ఆఫీస్ కి వెళ్లినా ఆయనకి వ్యతిరేకత ఎదురుకాలేదు. అవకాశాలు ఉన్నప్పుడు చెబుతామని అన్నారు .. అలాగే పిలిచి ఇచ్చారు. అలా ఆయన చిన్న చిన్న పాత్రల నుంచి, కాస్త గుర్తింపు కలిగిన పాత్రలు చేసే స్థాయికి ఎదిగారు.

నిండైన ఆయన రూపానికి తగిన వాయిస్ ఉండటం రామకృష్ణకు ప్లస్ అయింది. అందువలన ఆయన జానపద .. పౌరాణిక పాత్రలకు కూడా బాగా సెట్ అయ్యారు. కృష్ణుడిగా .. వేంకటేశ్వరస్వామిగా .. విష్ణు మూర్తిగా .. పాండురంగస్వామిగా ..   రాఘవేంద్ర స్వామిగా .. అర్జునుడిగా .. లక్ష్మణుడిగా .. బలరాముడిగా ప్రేక్షకులను మెప్పించారు. ఏ పాత్రను పోషించినా ఆయన ఎలాంటి విమర్శలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. అలా ఒక్కో పాత్రను చేస్తూ రామకృష్ణ జనానికి బాగానే కనెక్ట్ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన ఏవీఎమ్ సంస్థ కంట్లో పడ్డారు.

ఏవీఎమ్ వారు ఒక సినిమా విషయంలో తీసుకునే శ్రద్ధ .. జాగ్రత్తల గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఆ సంస్థలో హీరోగా చేయడమనేది అప్పటి హీరోల్లో అందరూ కనే కల. అలాంటి రామకృష్ణ ‘కల’ కూడా చాలా తొందరగానే నిజమైంది. ఆ బ్యానర్లో ఆయన ‘నోము’ .. ‘పూజ’ అనే సినిమాలు చాలా తక్కువ గ్యాప్ లో చేశారు. ఈ రెండు సినిమాలకి లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. కథాకథనాలు .. సంగీతం ఈ సినిమాలను నిలబెట్టేశాయి. ఈ సినిమాతో రామకృష్ణ జనానికి మరింతగా కనెక్ట్  అయ్యారు.

ఈ సినిమాలతో రామకృష్ణకు మహిళా ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా పెరుగుతుందని అంతా అనుకున్నారు. ఇక తిరుగులేని హీరోగా ఆయన దూసుకుపోతాడని చెప్పుకున్నారు. అయితే అంతకుముందున్న ఆయన మార్కెట్ పడిపోలేదుగానీ, అంతా అనుకున్నట్టుగా ఆయన గ్రాఫ్ అయితే పెరగలేదు. ఆ రెండు సినిమాలను దాటుకుని అంతకుమించిన హిట్లను ఆయన అనుదుకోలేకపోయారు. అందుకు కారణం ఆయన ప్రయత్న లోపంగానే చెప్పుకోవాలేమో. ఆయన మొహమాటం .. లౌక్యం తెలియని తనం ఆయన కెరియర్ పై బాగానే ప్రభావం చూపాయని చెప్పుకోవచ్చు.

జానపద .. పౌరాణికాలతో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్రలు కూడా రామకృష్ణకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆయన కాంబినేషన్లో గీతాంజలి ఎక్కువ సినిమాలు చేశారు. ఆ సమయంలోనే వాళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.   రామకృష్ణ .. ఒకానొక సమయంలో అవకాశాల పరంగా శోభన్ బాబుతో పోటీ పడటానికి ప్రయత్నించారు. అయితే శోభన్ బాబు ఇద్దరు హీరోయిన్ల కథలను సెట్ చేసుకుంటూ ఒక కొత్త దారిలో ముందుకు వెళ్లారు. ఇల్లాలుకీ .. ప్రియురాలుకి మధ్య నలిగిపోయే కథల్లో ఆయనకి తిరుగులేకుండా పోయింది.

రామకృష్ణలో రొమాంటిక్ హీరోయిజం తక్కువ. సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ, మహిళా ప్రేక్షకుల మనసులను కదిలించే పాత్రలను చేసింది చాలా తక్కువ. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు .. ఇలా ఎవరికి వారు తమకంటూ ఒక స్టైల్, తమకంటూ ఒక రూట్ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లారు. రామకృష్ణ కూడా అలా చేసి ఉంటే, ఆయన కెరియర్ మరో స్థాయిలో ఉండేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రోజున ఆయన వర్ధంతి .. ఈ సందర్భంగా ఆయనను ఒకసారి గుర్తుచేసుకుందాం.

( హీరో రామకృష్ణ వర్ధంతి ప్రత్యేకం)

– పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్