నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘వరుడు కావలెను’. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రానా దగ్గుబాటి ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం రానా దగ్గుబాటి మాట్లాడుతూ… ‘‘నాగశౌర్యని చూస్తే ‘రాముడు మంచి బాలుడు’ అన్న సామెత గుర్తొస్తుంది. ఈ సినిమాకు హీరో ఎవరనేది చెప్పకపోయినా టైటిల్‌ని బట్టి నాగశౌర్య హీరో అని చెప్పగలను. ట్రైలర్ బావుంది. థియేటర్లు మొదలయ్యాయి. సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాతో నాగశౌర్య ఈజ్ బ్యాక్ అని చెప్పగలను. ఈరోజు ఇక్కడికి గెస్ట్ లా రాలేదు. మా ‘భీమ్లా నాయక్’ నిర్మాత కోసం వచ్చాను. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు.
హీరో నాగశౌర్య మాట్లాడుతూ “చలో సక్సెస్ పార్టీలో సౌజన్య వచ్చి తమ్ముడు నీకో కథ చెబుతా చేస్తావా అని అడిగింది. లైన్ నచ్చి వెంటనే ఓకే చేశా. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. తెర పై ఆర్టిస్ట్ లంతా ఫ్రెష్‌గా కనిపించడానికి కారణం డైలాగ్‌లు. గణేష్ రావూరి చక్కని సంభాషణలు రాశారు. నేను ఇంత అందంగా కనిపించడానికి కారణం మా డిఓపీ వంశీ పచ్చిపులుసు. ఆయన కెమెరా పనితనానికి నాతో నేనే లవ్‌లో పడిపోయా. విశాల్ చంద్రశేఖర్ చక్కని బాణీలు ఇచ్చారు. సౌజన్య అక్క నన్ను, సినిమాను ఎంతో ప్రేమించి ఈ సినిమా చేసింది. ఈ సినిమాతో సౌజన్య అక్క కల నెరవేరబోతోంది. రీతు చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. తను వేరే షూటింగ్‌లో ఉండి రాలేకపోయింది. మంచి కథతో ఈ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నా. ట్రైలర్ విడుదల చేయడానికి వచ్చిన రానా అన్నకి థ్యాంక్స్” అన్నారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ “మా సంస్థ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీదే ఎక్కువ దృష్టి పెడుతుంది. మాకు అవే బాగా కలిసొచ్చాయి. ఇది ఫ్యామిలీ, కమర్షియల్ సినిమా. సెకెండాఫ్‌లో ఒక సస్పెన్స్ ఉంది. అది యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది” అని అన్నారు. దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ “బిజీ షెడ్యూల్‌లో కూడా రానా గారు ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
మాటల రచయిత గణేష్ రావూరి మాట్లాడుతూ “భూమి లాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఆకాశం లాంటి అబ్బాయి కావాలి. ఈ చిత్రంలో మా హీరో హీరోయిన్ల పాత్రలు అంత ప్లజెంట్‌గా ఉంటాయి. నదియా పాత్ర సినిమాకు చాలా కీలకం. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు” అని అన్నారు.