పనికి మాలిన వాళ్ళు నీచ రాజకీయాల కోసం మతం మంటలు పెడుతుంటే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. మోడీ ఎందుకు ఆగం ఆగం అవుతున్నావన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభించిన సిఎం కెసిఆర్ ఆ తర్వాత జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ బిజెపి ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. దుర్మార్గులు, చిల్లర గాళ్ళు.. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. వారి ఆటలు సాగనివ్వమన్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్టాన్ని ఆగం కానివ్వనని, నా బలం, బలగం ప్రజలే అన్నారు.
దేశ ప్రధానమంత్రి గొప్పోడైతే.. దేశమంతటికీ 24 గంటల కరంటు ఎందుకివ్వడు? నదుల నుంచి నీళ్లన్నీ వృధాగా సముద్రంలో కలుస్తుంటే.. దేశమంతటికీ మంచినీళ్లివ్వరా?. తెలంగాణలో 24 గంటలు కరంటు ఉంటది.. ఢిల్లీలో కరంటు సరిగా ఉండదు. దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొడుతున్నరు. తమిళనాడు, బెంగాల్లో ప్రభుత్వాలు కూలగొడుతమని బెదిరిస్తున్నరు. ఈరోజు ఢిల్లీలో కూడా అట్లనే చేస్తున్నరు. ఒక్కో ఎమ్మెల్యేను 25 కోట్ల రూపాయలిచ్చి కొంటామని బాజాప్తా చెప్తున్నరు. ఒక ఇల్లుగానీ, ప్రాజెక్టుగానీ కట్టాల్నంటే చాలా టైము పడతది. కాని, రెండు మూడు రోజుల్లో దాన్ని కూలగొట్టొచ్చు. ఎన్నో ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం. బాగు చేసుకుంటున్నం. తేడా వస్తే.. మళ్లా మంటల తెలంగాణ తయారైతది. గుర్తుంచుకోవాలె. బెంగళూరులో 30 లక్షలమంది ఐటీలో ఉద్యోగాలు చేసుకుంటరు. అక్కడ హిజాబ్ అని, హలాల్ అని వాతావరణాన్ని కలుషితం చేస్తే బెంగళూరు ఈ ఏడాది వెనుకబడి పోయింది. తెలంగాణ ముందున్నది.
ఐక్యత దెబ్బతిన్న నాడు బ్రతుకులు ఆగం అవుతాయని, ప్రతీ నియోజకవర్గంకు 500 మందిని కర్ణాటక, మహారాష్ట్ర తీసుకువెళ్లి అక్కడి పరిస్థితులు చూపెట్టాలని కెసిఆర్ అన్నారు. మత పిచ్చి గాళ్లను తిప్పి కొట్టాలని, దెబ్బ తింటే వంద సంవత్సరాల వెనక్కు పోతామన్నారు. ఒకరినొకరు అసహ్యించు కుంటుపోతే బ్రతకలేమని, ఆకుపచ్చ తెలంగాణ ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించారు.
కృష్ణా జలాల్లో మా వాటా తేల్చమని ప్రదాన్ని అడిగితే ఇప్పటికి ఉలుకూపలుకు లేదని కెసిఆర్ విమర్శించారు. సుప్రీంకోర్టులో కేసు వేశాము. విత్ డ్రా చేసుకుంటే నీళ్లు ఇస్తామన్నారు. ఇప్పటికీ చుక్క నీరు ఇవ్వలేదన్నారు. కేంద్రం నుంచి వీళ్ళను సాగనంపితే మనం బాగుపడుతామని, జాతీయ రాజకీయాల్లో ఉజ్వల పాత్ర పోషిస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు.
అంతకు ముందు సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కొంగరకలాన్‌లోని సర్వే నంబర్ 300లో 44 ఎకరాల్లో రూ.58 కోట్ల వ్యయంతో మూడు అంతస్తుల్లో, వందకు పైగా విశాలమైన గదులతో కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు మహేశ్వరం, కల్వకుర్తి, షాద్‌నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల, ఎల్బీనగర్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Also Read : హైదరాబాద్‌లో పోదు..ఢిల్లీలో 24 గంటలు రాదు: కేసీఆర్