Wednesday, June 26, 2024
Homeసినిమామనసును కదిలించే చిత్రాలు

మనసును కదిలించే చిత్రాలు

తెలుగు సినిమా ప్రస్థానం చూస్తే ఆవేదన కలగక మానదు. ఒకప్పుడు కుటుంబమంతా కలసి చూసేలా ఉండేవి. కాలానుగుణంగా వచ్చిన మార్పులు కూడా ఓకే. కానీ ప్రస్తుతం మార్పే ప్రధాన వస్తువైంది. ఇప్పటి మన తెలుగు హీరోకి చదువు అంతగా ఉండదు. ఎప్పుడూ బూతులు మాట్లాడతాడు. సిగరెట్ ,తాగుడు సాధారణం. తల్లిదండ్రులంటే ఏ మాత్రం గౌరవం ఉండదు.

ఇక హీరో కాలేజీ స్టూడెంట్ అయితే ఖర్మ కాలినట్టే . అధ్యాపకులు, అమ్మాయిలు …అందరితోనూ వెకిలి చేష్టలే. పాటలంటే కుప్పిగెంతులు. ఒకప్పటి తెలుగు సినిమాల్లో మాంసాహారం తినడం చూపేవారు కాదు. ఇప్పుడు మందు, ముక్కలు ప్రతి సినిమానీ మింగేస్తున్నాయి. చూడటానికే ఇబ్బందిగా ఉంది. సెల్ ఫోన్ లేని సినిమా ఊహించలేం. కొంతవరకు తమిళం, మలయాళం సినిమాలు నయం. ఎంత మొరటుగా తీసినా కొన్ని ప్రజా సమస్యలు, రోజువారీ సమస్యలను చాలా చక్కగా తీస్తారు. ఓటీటీ పుణ్యమా అని అటువంటి మంచి సినిమాలు రెండు మూడు చూసే భాగ్యం కలిగింది.

‘రంగోలి’
ఈ తమిళ సినిమాలో ఒక దిగువ మధ్యతరగతి పిల్లవాడి సమస్యలు చాలా బాగా చూపించారు. టీనేజ్ పిల్లల్లో ఉండే ఆవేశం,ఇంట్లో వాళ్ళ పట్ల ప్రేమ, సమస్యలు కొని తెచ్చుకోడం చాలా సహజంగా ఉంది. ఒక్క తాగుడు సీన్ లేదు. సెల్ ఫోన్ కూడా కనిపించదు. సినిమా అంతా అరివు అనే అబ్బాయితో మనమూ ప్రయాణిస్తూ ఉంటాం.అతన్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి మిగతా కుటుంబం పడే కష్టాలు చూస్తే మనకీ ఏడుపొస్తుంది. అంత ఆవేశం లోనూ కుటుంబ పరిస్థితికి పరిష్కారం వెతికిన హీరో వ్యక్తిత్వం కట్టిపడేస్తుంది. కుటుంబమంతా చూడదగ్గ సినిమా. అమెజాన్ ప్రైమ్ లో ఉంది.

పార్కింగ్
మేము ఒక అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అపార్టుమెంటుకి వచ్చేవారంతా మా పార్కింగ్ దగ్గర కార్లు పెట్టేవాళ్ళు. తియ్యమని చెప్పలేక విసుగొచ్చేది. ఇక రోడ్ల పైన ఇష్టారాజ్యంగా పెట్టే పార్కింగ్ సంగతి చెప్పక్కరలేదు. ఇళ్లను, రోడ్లను మింగేసే పార్కింగ్ సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు గానీ ముందు ముందు యుద్ధాలు జరుగుతాయనిపిస్తోంది. ఎంత మంచివాళ్ళయినా అహం అణచుకోలేక పోవడం ఇలాంటప్పుడు చూస్తూ ఉంటాం. అణచుకోలేని అహం ఎంతెంత దారుణాలు చేయిస్తుందో పార్కింగ్ సినిమా చూస్తే తెలుస్తుంది.

ఒక ఇల్లు. కింద,పైన ఒక్కొక్క పోర్షన్. ఒక కారు మాత్రమే పట్టేంత ప్లేస్ ఉంటుంది. ఒకరికి కారు ఉంటే మరొకరి బైక్ పెట్టడమూ కష్టమే. అలాంటిచోట పార్కింగ్ స్థలం కోసం ఇద్దరి మధ్య మొదలైన చిన్న గొడవ ఎంత దూరం వెళుతుందో మనుషులను, మనసులను దూరం చేసి కక్షలు కార్పణ్యాలు పెరిగేలా అహం పోషించే పాత్ర మనని కలచివేస్తుంది. వారితో పాటే మనమూ స్పందిస్తూ ఉంటాం. అవతలివారి ప్రాణాలు కూడా లెక్క చెయ్యనంత విద్వేషం పెరగడం భయం కలిగిస్తుంది. చివరికి ఎలాగో సుఖాంతమైనా గొడవల ప్రభావం మనని ఆలోచనలో పడేస్తుంది. ప్రతి ఒక్కరూ చూడదగ్గ ఈ సినిమా ఏ ఒక్కరి దృక్పథంలో మార్పు తెచ్చినా దర్శకుని కృషి ఫలించినట్లే.(డిస్నీ హాట్ స్టార్ లో)

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్