Monday, June 17, 2024
HomeTrending Newsబిజెపి-టిడిపి రహస్య ఒప్పందం

బిజెపి-టిడిపి రహస్య ఒప్పందం

తెలుగు రాష్ట్రాల్లో ఎంపి సీట్లపై కన్నేసిన బిజెపి…సాధ్యమైనన్ని అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రెండు రాష్ట్రాల్లో ఎవరితో పొత్తులు లేకుండా బరిలోకి దిగాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన, అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం… రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కలిసి వస్తాయని కమలం నేతల వ్యూహంగా ఉంది.

తెలంగాణలో కొంత బలంగా ఉన్న బిజెపి ఏపిలో సొంతంగా నెగ్గుకురావటానికి తెలుగుదేశం, జనసేనతో అవగాహన కుదిరిందని అంటున్నారు. జనసేన మిత్రపక్షం కావటంతో ఇబ్బంది లేదు. బిజెపికి అవకాశం ఉన్న లోక్ సభ స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను రంగంలో నిలిపేలా చంద్రబాబు, లోకేష్ తో సంప్రదింపులు పూర్తి అయ్యాయని వినికిడి. బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు మొదట్లో ఉమ్మడిగా ఎన్నికల్లో పాల్గొనాలని అనుకున్నా… అధికార పార్టీకి అనుకూలం అవుతుందని భావించి కొత్త ఎత్తుగడకు దిగినట్టు తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ నియోజకవర్గాలు బిజెపి కోరినట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మూడు నియోజకవర్గాల్లో సహకరించేందుకు బిజెపి-టిడిపి మధ్య సయోధ్య కుదిరిందని విశ్వసనీయ సమాచారం. ఈ పరిణామాలతో ఎవరి సీటు గల్లంతు అవుతుందో అని టిడిపిలోని ఆశావాహుల్లో ఆందోళన మొదలైంది.

తెలుగుదేశం అధికంగా ఎంపి స్థానాలు గెలిచినా కేంద్రంలో బిజెపికి సహకరించాలని, ప్రభుత్వంలో చేరకపోయినా బయట నుంచి మద్దతు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందం అయిందని అంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నపుడు టిడిపి నేత లోకేష్ ఢిల్లీలో మకాం వేశారు. ఆ సమయంలో బిజెపి కీలక నేతలతో లోకేష్ సమావేశం జరిగిందని, అందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వరి చొరవ తీసుకున్నారని తెలిసింది.

YS షర్మిల కాంగ్రెస్ లో చేరాక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయని, హస్తం గుర్తుకు కొంత ఉపు వస్తుందని విశ్లేషణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టిడిపి – కాంగ్రెస్ వైపు మొగ్గుచూపకుండా కమలనాథులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో విపత్కర పరిస్థితి ఎదురైతే ఎన్.డి.ఏ కూటమికి బాసటగా ఉండాలని…ముందే అవగాహన కుదిరిందని రెండు పార్టీల్లో అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో చేరటమా.. బయట నుంచి మద్దతు కొనసాగించటం తదితర అంశాలు ఎన్నికల తర్వాత ఫైనల్ చేసుకునేందుకు ఇరువర్గాలు సమ్మతించాయని అంటున్నారు.

ఎంపి సీట్ల కోసం బిజెపి- టిడిపి మధ్య కుదిరిన రహస్య ఒప్పందంపై కాంగ్రెస్ వైఖరి వెల్లడించలేదు. చంద్రబాబు జైల్లో ఉన్నపుడు బాసటగా నిలిచిన కాంగ్రెస్ తాజా రాజకీయ పరిణామాలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇండియా కూటమిలోకి టిడిపిని ఆహ్వానించినా చంద్రబాబు తటస్థంగా ఉన్నారు. గోడ మీద పిల్లి మాదిరిగా… తనకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చే వైపు  చంద్రబాబు వాలుతారని…బాబు గత చరిత్ర పరిశీలిస్తే అవగతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్