“తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తెలంగాణకు పూర్వ వైభవం, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం” అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో శరణ్య గార్డెన్స్ పెద్దమ్మ గడ్డ నుంచి వరంగల్ చౌరస్తా వరకు రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఎంజీఎం సర్కిల్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాల వేసి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం వరంగల్ చౌరస్తాలో నిర్వహించిన జనసభలో ప్రసంగించారు. ఈ ప్రాంతానికి చెందిన వంగర బిడ్డ పీవీ నరసింహరావు దేశానికి ప్రధాని అయ్యారు. పాదయాత్రలో ఎవరిని కలిసినా సంతోషంగా లేదు. నా మీద కోపంతో కొడంగల్ ను అభివృద్ధి చేయలేదనుకున్నా. కానీ కొండా దంపతుల మీద కోపంతో వరంగల్ ను కూడా అభివృద్ధి చేయలేదు. ఈ నగరాన్ని చెత్తకుప్పగా మార్చిర్రు. గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ కు 2014 నుంచి గ్రహణం పట్టింది.
ప్రపంచానికి మేధావులను అందించిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీది. అలాంటి కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు లేవు, ప్రొఫెసర్లు లేని పరిస్థితి. ఉద్యోగాలు లేక సునీల్ నాయక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర మరువలేనిది. వరంగల్ ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలు ఇద్దరు బిల్లా రంగాలు. ఏ ఖాళీ జాగా కనిపిస్తే అది కబ్జా. వీరి గంజాయి మత్తులో విచక్షణరహితంగా దాడులకు తెగబడుతున్నారు. ఇటువంటి బిల్లా రంగాలు ఈ పోరు గడ్డకు అవసరమా. వీరికోసమేనా తెలంగాణ వచ్చిందా. తండ్రికొడుకులు చెప్తరు వరంగల్ అంటే మాకు ప్రేమ. వీరికి ఇక్కడి వేల కోట్ల విలువైన భూముల మీద ప్రేమ. వరంగల్ లో ఏ ఎమ్మెల్యే అయినా ప్రజలకు అందుబాటులో ఉన్నారా? వరంగల్ లో బీఆర్ఎస్ నేతలు భూములు ఆక్రమించుకుని దోచుకుంటున్నారు. అజాం జాహీ మిల్లు కార్మికులకు ఇవ్వాల్సిన భూమి ఈ ప్రభుత్వం పంపిణీ చేయలేదు. వరంగల్ జిల్లాలో ఏ ఎమ్మెల్యేను తీసుకున్నా ఉద్యమంలో వీరి దగ్గర ఏమీ లేదు. కానీ ఇప్పుడు వేల కోట్లకు పరిగెత్తారు. వరంగల్లో విలువైన భూములను ఆక్రమించుకొని వేల కోట్ల రూపాయాలు సంపాందించారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప వరంగల్ లో ఈ తొమ్మిదేళ్లలో ఏ అభివృద్ధి జరగలేదు.
వరంగల్ జిల్లాలో ఏదీ తీసుకున్నా కాంగ్రెస్ చేసిందే. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకతీయ విశ్వవిద్యాలయం, ఎంజీఎం ఆస్పత్రి, కాజీపేట రైల్వే జంక్షన్, ఇందిరమ్మ ఇండ్లు..ఇలా ఈ రోజు ప్రతి గ్రామంలో, మండలంలో కనిపించే బడి, గుడి అన్ని కాంగ్రెస్ పార్టీ చలవే. తెలంగాణ తెచ్చిన అన్నోడికి రెండు సార్లు ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి. వరంగల్ లో కొండా దంపతులను ఆశీర్వదించండి. వారు మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటారు. వైఎస్ హయాంలో వారికి ఎలాంటి గౌరవం దక్కిందో.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే గౌరవం ఉంటుంది.
2024, జనవరి1న కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తాం. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసి వారిని ఆదుకుంటాం. పేదలకు వైద్యం అందించేందుకు 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ మార్జిన్ ను 5లక్షలకు పెంచుతాం. కాంగ్రెస్ గెలిస్తేనే పేదల బతుకులు బాగుపడతాయి.
వరంగల్లో బీఆర్ఎస్ గుండాల రాజ్యం
వరంగల్లో బీఆర్ఎస్ గూండాల రాజ్యం నడుస్తోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సోమవారం బీఆర్ఎస్ నాయకుల చేతిలో దాడికిగురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ను ఆయన మంగళవారం ఉదయం పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ అపోలోకు తరలించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చైతన్యవంతమైన వరంగల్ గడ్డపై ఇలాంటి దాడులు జరగడం దుర్మార్గమన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత తొమ్మిదేళ్లుగా బీఆరెస్ గూండాల రాజ్యం నడుస్తోంది. రౌడీ కార్యక్రమాలకు కథానాయకుడు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు.. గంజాయి బానిసలు మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారు.
రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తమ విధి నిర్వర్తించడం లేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు శాశ్వతం కాదు. క్రిమినల్ చర్యలను ఉక్కు పాదంతో అణచాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాడులు చేసి వీడియోలు చిత్రీకరించి బెదిరిస్తున్నా.. పోలీసులు నిస్సహాయంగా ఉండటం మంచిది కాదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటన కాదు.. మా యాత్రపైనే దాడి జరిగినట్టు. పర్యవేక్షించాల్సిన డీజీపీ వైపు నుంచి స్పందన లేదు. దీన్ని కాంగ్రెస్ శ్రేణులు సహించరు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడంతోపాటు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించాల్సిందిగా పిలుపినిస్తున్నా. తర్వాత ఆస్పత్రి నుంచి పాదయాత్రగా వెళ్లి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కు సంబంధిత ఘటనపై ఫిర్యాదు చేశారు. “మా సభలపై దాడులు చేసి సభలు జరగకుండా చేయాలని కేసీర్ అనుకుంటే…రేపటి నుంచి కేసీఆర్ ఏ ఊర్లో ఒక్క సభ కూడా జరపలేడు. మా మౌనాన్ని చేతకానితనంగా భావించొద్దు. మా సంయమనాన్ని పరీక్షిస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు. దాడులే ప్రాతిపదికగా రాజకీయం చేద్దామంటే కేసీఆర్.. తేదీ, స్థలం ప్రకటించండి. కేసీఆర్ ఫామ్ హౌస్ అయినా, వరంగల్ హంటర్ రోడ్డు అయినా ఎక్కడైనా సిద్ధం” అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Also Read : 12మంది ఎమ్మెల్యేల పై పిసిసి ఫిర్యాదు