Monday, January 20, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరాయలసీమ మాండలికం (రెండవ భాగం)

రాయలసీమ మాండలికం (రెండవ భాగం)

‘నా భాష’ పేరుతో రాయలసీమ మాండలికం అందచందాలు, వైరుధ్యం, వైశిష్ట్యం గురించి నా అభిప్రాయాలు తెలియజెప్పాను. ప్రామాణిక భాషను పక్కన పెట్టి నా ప్రాంత భాషనే మాట్లాడడం ఎందుకు మొదలు పెట్టానో కూడా చెప్పాను ఆ వ్యాసం లింక్ ఇది.

నా భాష

దీని కొనసాగింపు ఈ రెండో భాగం:-
ఇప్పటి వరకు చెప్పుకున్నది పదాల రూపాల గురించి. ఇక పదసంపద విషయానికి వస్తే తెలుగులో పదాలను రెండు రకాలుగా పెంచుకోవచ్చు. 1. కొత్త పదాలను సృష్టించుకోవడం 2. పరభాషా పదాలను కలుపుకోవడం. ఈ రెండిటి కంటే ముఖ్యమైనది 3. తెలుగులోనే వేర్వేరు మాండలికాల్లో ఉన్న సొగసైన పదాలను విస్తృతంగా వాడి, వాటికి ప్రామాణికతను కల్పించడం.

నాకు తెలిసిన రాయలసీమ మాండలిక పదాల్లో ఇతర ప్రాంతాలవాళ్ళు కూడా వాడదగ్గవని నాకు బలంగా అనిపించిన పదాలు కొన్నిటిని పరిచయం చేస్తాను:

మొదటి భాగంలో అల్పాహారం దగ్గర ఆపినాం కాబట్టి తిండికి సంబంధించిన పదాలు కొన్నిటిని పరిశీలిద్దాం. బొరుగులతో చేసే అల్పాహారం (బొరుగుల ఉప్మా/బొరుగుల చిత్రాన్నం పేర్లతో) చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నా ఉగ్గాని అనే పొందికైన పేరు నాకు పరిచయమైంది మాత్రం అనంతపురంలో. దీనికి తెలంగాణలో కూడా సాధికారత ఏర్పడింది ఇప్పుడు (Image attached: ప్రభుత్వ బళ్లలో అల్పాహార మెనూ. Friday: Uggani అని గమనించవచ్చు.) కేటీఆర్ ఈ మెనూ చూసి “ఉగ్గాని అంటే?” అని సభాముఖంగా అడిగి ఊరుకోకుండా “మనది గాదా టిఫిన్ ఇది?” అని ప్రొవోక్ చెయ్యడం ద్వారా మరింత ప్రాచుర్యం కలిగించినారు.

ఇంత చక్కటి పేరు సృజించిన అనంతపురం వాళ్ళు సంగటిని కేవలం ‘ముద్ద’ అనడం నాకు అసలు నచ్చదు. కలిపితే ఏదైనా ముద్దైతాది – మట్టితో సహా. అన్నం కూడా ముద్దలు చేసుకునే తింటాం. ఈ ప్రత్యేకమైన భోజన పదార్థానికి అంతే ప్రత్యేకమైన పేరు కచ్చితంగా వాడాల.

చింతపండుతో చేసే పులిహోర వేరు, నిమ్మరసంతో చేసే చిత్రాన్నం వేరు. ఈ చిత్రాన్నం అనే పదం రాయలసీమలోను, పొరుగున ఉన్న కన్నడసీమలోను వాడుతారు.

రసం అనే పదాన్ని పైన నిమ్మరసం అనే సమాసంలో వాడినాను, చూసినారా? ఆ పదాన్ని చారుకు బదులుగా వాడి పలుచన చెయ్యొద్దు.

ఈమధ్య కడప మిత్రుడొకరు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినారు “రాగి సంగటి విత్ రోటి పచ్చడి” అని. ‘విత్’ అని కలిపినదానికంటే ఎక్కువగా ‘రోటి పచ్చడి’ అని చూడగానే నా మనోభావాలు పచ్చడైనాయి. ఈ ‘పచ్చడి’ అనే పదం అనేక అర్థాల్లో వాడుతూ ఉంటారు. నాకు చాలా చిరాకు తెప్పించేది వేర్వేరు అర్థాలను సూచించడానికి ఒకే పదాన్ని వాడి తాము కన్‌ఫ్యూజ్ అయి, ఎదుటివాళ్ళను కన్‌ఫ్యూజ్ చెయ్యడం, ఆ కన్‌ఫ్యూజన్లో క్లారిఫికేషన్ కోసం అదనపు విశేషణాలను ఊతగా తెచ్చుకోవడం. రోట్లో నూరేది రోటి పచ్చడి, గిన్నెలో కలిపేది గిన్నె పచ్చడి, జాడీలో పెట్టేది జాడీ పచ్చడి ఏమిటండీ? ఈరోజుల్లో రోలు వాడడం లేదు కాబట్టి ఇంట్లో చేస్తే మిక్సీ పచ్చడి, హోటళ్ళలో చేస్తే గ్రైండర్ పచ్చడి, ఇంకో మేడీజీ సాధనమేదైనా వస్తే దాని పేరుతో పిలవాలేమో కదా? ఇట్లా ఎన్నని మార్చుకుంటూ పోతారు? సాధనమేదైనా దంచిన/రుబ్బిన దాని పేరు ఊరిమిండి, ఊరవేసిన కాయ (సో కాల్డ్ నిలవ పచ్చడి) ఊరగాయ అని వాడుకుంటే ఆ భాష ఎంత రుచికరం?

ఇట్లాంటిదే ఇంకొకటి. గోరు చిక్కుడు, వేలు చిక్కుడు, తీగె చిక్కుడు, మాను చిక్కుడు అనుకుంటూ. గోరు చిక్కుడుకు రాయలసీమలో వాడే పేరు మటిక్కాయ.

విడి పదాలు కచ్చితంగా ఉండాల. అదే విధంగా ఒకే సమూహానికి చెందినవాటన్నిటికీ ఒకే పేరు ఉమ్మడిగా వాడాల. లేకపోతే ఈ సంక్లిష్టతలు కొత్తగా భాష నేర్చుకునేవాళ్ళను గందరగోళ పరచి విముఖులను చేసే ప్రమాదం ఉంది. ఉదాహరణలు: కాయలన్నిటినీ కాయలు అని, కంకులన్నిటినీ కంకులని, ఆకులన్నిటినీ ఆకులనే అనాల. ఉదాహరణలు: ములక్కాడ అని ఎందుకు అనడం? చక్కగా మునక్కాయ అనవచ్చు కదా? కాడ రూపంలో ఉన్నంత మాత్రాన అది కాయ కాకుండా పోతాదా? ఈ లెక్కన గుండ్రంగా ఉన్నవాటిని కాయలు అనడానికి బదులు బంతులు అనాలా?

అట్లాంటిదే మొక్కజొన్న కండె. అదీ కంకే కదా? కంకి అనడానికి ఏమిటి అభ్యంతరం?

కూరలో వేసుకునే కాయలు కూరగాయలు. కూరలో వేసుకునే ఆకులు కూరాకులు. అంతేగానీ ఏకంగా ఆకులనే కూరలనడం మరీ విడ్డూరం. రేప్పొద్దున వేరే వేరే ఆకులతో కూరలు చెయ్యడం మొదలుపెడితే అవి హఠాత్తుగా ఆకులు కాకుండా కూరలైపోవడం, (వండక ముందే, చెట్టున ఉండగానే) వాటిని కూరలని పిలవడం మతిలేని పరిణామాలు.

కొన్ని ఆటల పేర్లు కూడా చూద్దాం. అచ్చ తెలుగు పేర్లున్న ఆటల్లో ఒకటి ఏడుపెంకులాట. ఏడు పెంకులను పేర్చి ఆడే ఆట పేరే ఏడు పెంకులాటైతే, మూడు పుల్లలను గుచ్చి ఆడతారు కాబట్టి క్రికెట్ పేరు ‘మూడు పుల్లలాట’ అవ్వాల గదా? ఆ ఆటకు క్రికెట్ అనే పేరుంది కాబట్టి అది తెలుగు పేరు కాకపోయినా వాడుతున్నప్పుడు ఈ ఆటకు మాత్రం ఉన్న పేరు వాడడానికి ఏమిటి అభ్యంతరం? రాయలసీమలో కడప ప్రాంతంలో ‘డికోరి’ అంటాం. మా భాషను అంటరానిది అనుకోకపోతే ఎవరైనా వాడుకోవచ్చు. అది అచ్చ తెలుగు పదం కాకపోవచ్చు. అదే మీ అభ్యంతరమైతే మీరు ఆడే లేదా చూసే ఆటల్లో ఎన్నిటికి తెలుగు పేర్లున్నాయి చెప్పండి?

మైదానపు ఆటల్లో ఇంకొకటి జిల్ల-కట్టె. దాన్ని కొందరు బిళ్లంగోడు అంటారు. బిళ్ల అంటే ఎట్టుండాల? ఆటలో వాడే కర్ర ముక్కకు, బిళ్ళకు ఏమైనా పోలికుందా? గిల్లీ దండా అని కొందరంటారు గానీ అది హిందీ పేరు. అచ్చ తెలుగు పేరు, పరభాషలో పేరు రెండూ ఉన్నప్పుడు తెలుగు పేరు వాడడమే మేలు కదా? ఆ అచ్చ తెలుగు పేరే జిల్ల-కట్టె. జిల్ల అనేది అచ్చ తెలుగు పదమే. బ్రౌన్ నిఘంటువులోకి కూడా ఎక్కింది. దాన్ని చివరన సాగదీసినప్పుడు జిల్లా అయితాది. డిస్ట్రిక్ట్ అనే అర్థంలో ఆ పదాన్ని మనం కూడా వాడతాం గానీ అది హిందీ పదమే. హిందీలో దాన్ని జిల్లా అనరు అంటారు. గూగుల్లో కొట్టి చూడు जिल्ला కు 57 లక్షల ఫలితాలు వస్తే जिला కు పదైదున్నర కోట్ల ఫలితాలు వస్తాయి. కాబట్టి లెక్క ప్రకారం మనం కూడా జిలా అనాల కానీ తెలుగులో మాత్రం జిల్లా అనడం మార్చలేనంత గాఢంగా అలవాటైపోయింది. ఐతే జిలా దీర్ఘాంతం, జిల్ల హ్రస్వ అజంతం. సందర్భాన్ని బట్టి కూడా తేడాను అర్థం చేసుకోవచ్చు.

కుటుంబ సభ్యులకు వాడే పదాల్లో ఒక వైపరీత్యం ఉంది. అమ్మమ్మ, నాన్నమ్మ అంటారు, అదే విధంగా అత్తమ్మ అని కూడా అంటారు. ఈమె ఎవరి(కి) అమ్మ? ఇదే వరుసలో అక్కయ్య, అన్నయ్య, మామయ్య, అత్తయ్యలు ఎవరి(కి) అయ్యలు? కానీ అమ్మమ్మకు బదులు అవ్వ అని, నాన్నమ్మకు బదులు జేజి అని, నాన్న నాన్నను అబ్బ అని వాడొచ్చు (కొన్ని ప్రాంతాల్లో అమ్మనే అవ్వ అంటారు, అట్లే నాన్ననే అబ్బ అని కూడా అంటారు. కానీ ఈ వాడుకలు తక్కువ). జేజి అనే పదం గురించి డా. ఎం.వి. రమణారెడ్డి గారు ఏమంటారంటే రాయలసీమ ప్రాంతంలో తండ్రి తల్లిని ‘జేజి’ అంటారు. కోస్తాలో ‘నాయనమ్మ’ అంటారు. నాయనమ్మ అనేది తేలికైన రెండు పదాల కలయిక. చిన్నపిల్లలు, ఇంకా భాష సరిగారానిసమయంలో నాయనకు అమ్మకాబట్టి నాయనమ్మ అంటూ తేలిగ్గా వాళ్ళకు వాళ్ళు కూర్చున్నమాట. జేజి పదం అలా తయారైంది కాదు. అది తెలుగుభాష ప్రత్యేకతను సూచించే పదం. సంస్క¬ృతానికీ తెలుగుకూ ఉన్న తేడాను తెలియచేసే పదం. కుటుంబ సంబంధాలను విడివిడిగా, స్పష్టంగా తెలియజేసే అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, అత్త, కోడలు వంటి పదాలు సంస్కృతానికి లేవు. అవి తెలుగులోనే దొరుకుతాయి.

మన భాషకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉందని నిరూపించే పదాల్లో జేజి అనే పదం కూడా ఒకటి. అందువల్ల అది మనం పోగొట్టుకోవడానికి కూడా వీల్లేని మేలిమి. అలాంటి పదా న్ని చులకన చేసి ‘జేజి ఏమిటండీ జేజి. చక్కగా నాన మ్మా అని పలకలేరా?’ అంటూ ముఖం చిట్లించుకుంటారు కోస్తా సోదరులు. వెంటనే మనం చిన్నబోతాం. మనం కూడా ‘నానమ్మ ఏంటండీ నానమ్మ. చక్కగా జేజి అని పలకలేరా?’ అని అడగచ్చు. కానీ అడగలేం. ఎందుకంటే నా భాష తప్పేమో అనే గిలి మనను వెనక్కు లాగుతుంది. నాది ప్రామాణిక భాష కాదు అనే మానసిక బానిసత్వం మననుజవాబు చెప్పే పరిస్థితిలో లేకుండా గొంతునొక్కేస్తుంది.

ఇట్లాంటిదే పరందపు కాయ. పపాయా అనే పరదేశీ పదం నుంచి వచ్చిందే బొప్పాయి. దానికి తెలుగు పేరు పరందం లేదా పరందపు చెట్టు/కాయ.

-త్రివిక్రమ్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్