Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంన్యాయాన్యాయాలు

న్యాయాన్యాయాలు

Justice & Language: న్యాయం మనకు దైవం. అందుకే న్యాయ దేవత అంటుంటాం. నయం అన్న మాటనుండే న్యాయం అన్న మాట పుట్టింది. అంటే నయమయినది న్యాయం. నియతిగా పొందేది న్యాయం, న్యాయాన్ని వదలకుండా పట్టుకుని ఉండేది న్యాయ్యం అని వ్యుత్పత్తి అర్థాలు. న్యాయ్యం అని య కు య వత్తుతో రాస్తే తప్పు రాశారనుకునే అన్యాయమయిన భాషా అజ్ఞాన కాలంలో ఉన్నాం.

న్యాయం ఎప్పటికయినా గెలుస్తుంది అని ఒక ఓదార్పు మాట ఉన్నట్లే…గెలిచేదంతా న్యాయం కాకపోవచ్చు అనే నిట్టూర్పు మాట కూడా ఉంది.

“అగ్రణీ ర్గ్రామణీ శ్శ్రీమాన్‌ న్యాయో నేతా సమీరణః”
అని విష్ణు సహస్రనామంలో ఉన్న నామాన్ని పరమ పవిత్ర భావంతో మనం స్మరిస్తున్నది కూడా బతుకు తరించే న్యాయం పొందడానికే. న్యాయానికి మూలమయిన సత్యం, తర్కం తానే అయినవాడు; వాటిని పొందే యుక్తిని ఇచ్చేవాడు; విశ్వ నియతిని రక్షించేవాడు విష్ణువు.

న్యాయం వాదనలో ఉంటుంది. ఆ వాదనకు చట్టాలే దారి దీపాలు. ఇరువైపుల వాదనలను న్యాయదేవత త్రాసులో వేసి కొలుస్తుంది. కొలిచాక తీర్పు చెబుతుంది.

కోర్టుల్లో ఏళ్లకు ఏళ్లు విచారణలు జరిగి…జరిగి…తీర్పు వచ్చేసరికి…ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు. గెలిచినవాడు ఇంటికొచ్చి తలుపులు వేసుకుని…కుళ్లి కుళ్లి ఏడుస్తాడు…అని లోకానుభవం.

ప్రపంచంలో వేన వేల భాషలున్నాయి. అందులో న్యాయభాష ప్రత్యేకం. సమాసం ప్రకారం న్యాయభాష అంటే న్యాయస్థానాల్లో వాడే భాష కావచ్చు. న్యాయమయిన భాష కావచ్చు. లేదా న్యాయం కొరకు, కోసం, వలన, కంటె, పట్టి, కిన్, కున్, యొక్క, లోన్, లోపల…ఇలా అన్ని విభక్తులు భక్తిగా వ్యాకరణాతీతంగా న్యాయాన్ని ఆశ్రయించి ఉండవచ్చు.

న్యాయ భాష వ్యాకరణం, ప్రతిపదార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, అన్వయాలు, అలంకారాలు, ఛందస్సు కూడా ప్రత్యేకం. న్యాయ విద్య చదివినవారికి ఇవన్నీ తెలిసి ఉంటాయని అనుకోవాలి.

దేశ రాజధానిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హై కోర్టుల న్యాయమూర్తులు, న్యాయశాఖ మంత్రులతో సర్వోన్నత న్యాయస్థానం ఒక సమావేశం నిర్వహించింది. స్థానిక ప్రాంతీయ భాషల్లో కోర్టు వ్యవహారాలు జరగాలని ఈ సమావేశంలో ప్రధాన మంత్రి కోరారు. రాత్రికి రాత్రి ఇది సాధ్యం కాదు కానీ…అవసరమే అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అనువాదకుల సమస్యే పెద్ద అవరోధం అని ఆయన వివరించారు.

“స్వస్తిః ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః
గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు!”

అన్న శాంతి మంత్రాన్ని యుగయుగాలుగా వింటూనే ఉన్నాం. ఈ భూమి మీద పాలకులు న్యాయ మార్గాన్ని విడవకుండా ఉండాలని అందులో కోరిక. ఆదర్శం. అభ్యుదయం. అదే శాంతికి మూల మంత్రం. న్యాయేన అని రాస్తే తప్పు. న్యాయ్యేన అనే రాయాలి.


న్యాయం అంటే నయమయినది.
న్యాయ్యం అంటే న్యాయమార్గాన్ని వదలకుండా పట్టుకోవడం. తరచి చూస్తే చాలా తేడా ఉంటుంది.
న్యాయేన అని రాస్తూ…పలుకుతున్నందుకే న్యాయం ఆలస్యమవుతోందో? ఏమో? ఎవరు తీర్పు చెప్పాలి ఈ న్యాయాన్యాయ న్యాయ్య వ్యాకరణ మీమాంస మీద?
కోర్టులా? వైయాకరుణులా?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఉత్తర- దక్షిణాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్