హైదరాబాద్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిపై హెచ్ఎండిఏ కన్నేర్ర చేసింది. తెల్లాపూర్ లో కబ్జా విషయం మెట్రోపాలిటన్ కమిషనర్ ఆర్విoద్ కుమార్ దృష్టికి రావడంతో వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో హెచ్ఎండిఏ ఎస్టేట్ అధికారులు, ఇన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం శనివారం సాయంత్రం రంగప్రవేశంచేసి కూల్చివేత చర్యలు ప్రారంభించారు.
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 361లో హెచ్ఎండిఏకు సంబంధించిన దాదాపు 350 గజాల స్థలాన్ని ఆక్రమించి, హోటల్ నిర్మాణం జరిపి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాలను ధ్రువీకరించుకొని హెచ్ఎండిఏ యంత్రాంగం స్థానిక పోలీసుల సహకారంతో రిమూవల్ ఆపరేషన్ చేపట్టింది.
హెచ్ఎండిఏ అధికారుల కూల్చివేత చర్యలను అడ్డుకునేందుకు కబ్జాదారుల(అక్రమార్కుల) చేసిన ప్రయత్నాలన్నింటిని హెచ్ఎండిఏ భేఖాతర్ చేయడంతో కబ్జాదారుడు కాళ్ళబేరానికి రాక తప్పలేదు. చివరకు తన ఇనుప సామగ్రి, డెకరేషన్ వస్తుపరికరాలు తామే స్వయంగా తొలగించుకుని పోతామన్న కబ్జాదారుడి విజప్తికి హెచ్ఎండిఏ అధికారులు సమ్మతించారు. దాంతో కూల్చివేత ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం వరకు నిలకడగా సాగింది. హెచ్ఎండిఏ భూముల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్ఎండిఏ స్పష్టం చేశారు. ఎవరైనా ఎక్కడ నైనా హెచ్ఎండిఏ భూములపై కబ్జా ఉన్నట్లయితే స్వచ్ఛందంగా వాటిని వదిలి పోవాలని హెచ్ఎండిఏ హెచ్చరించింది.