హైదరాబాద్ లో వారం రోజులుగా వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ గానీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేటీఆర్ పుట్టిన రోజు మోజులో ఉండి ప్రజలను మరచిపోయారని ఎద్దేవా చేశారు. కుండపోత వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈ రోజు హైదరాబాద్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి… ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడంలేదని విమర్శించారు.
వారం రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తము అల్లకల్లోలంగా మారిందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాలతో వాతావరణ శాఖ ఇప్పటికే రాష్ట్రంలో అలెర్ట్ ప్రకటించింది. అయిన కూడా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదన్నారు. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. గంటలకొద్దీ రోడ్లపైనే ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివర్ణించారు. హైదరాబాద్ డల్లాస్, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్ నరక కూపంగా మార్చారని ఆరోపించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నాలాలు, వరద ప్రాంతాలకు వెళ్లకూడదని రేవంత్ రెడ్డి సూచించారు. గత 9 ఏళ్లుగా హైదరాబాద్ లో సౌకర్యాల కల్పన, ప్రజలకు మేలు జరిగే ఒక్క చర్య చేపట్టలేదన్నారు. ఈ విషయాలపై కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని కోరారు. బుధ, గురు వారాలలో రెండు రోజులలో ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.