Rohith- all formats: టీమిండియా వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మకే పింక్ బాల్ కెప్టెన్సీ కూడా అప్పగించారు. ఈ విషయాన్ని బిసిసిఐ నేడు అధికారికంగా ప్రకటించింది. గత టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ముగిసిన తరువాత విరాట్ కోహ్లీ టి20 కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్ళిన టీమిండియా వన్డే జట్టుకు విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించారు. వన్డే, టి20 లకు రోహిత్, టెస్ట్ జట్టుకు కోహ్లీ కెప్టెన్ గా కొనసాగనున్నట్లు నాడు బిసిసిఐ ప్రకటించింది.
అయితే దక్షిణాఫ్రికా టూర్ లో ఇండియా పేలవ ప్రదర్శనతో కోహ్లీ నాయకత్వంపై విమర్శలు తలెత్తాయి. దీనితో తాను టెస్ట్ జట్టు బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. ఈ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకూ మూడు టి 20లు, రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు శ్రీలంక ఇండియాలో పర్యటించనుంది. ఈ నేపధ్యంలో కోహ్లీ స్థానంలో టెస్ట్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ ను బిసిసిఐ ఎంపిక చేసింది. దీనితో రోహిత్ టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో సారధ్య బాధ్యతలు వహించనున్నాడు.