Rosaiah- a unique politician:
తెలుగు రాజకీయ యవనికపై కొణిజేటి రోశయ్యది ప్రత్యేక శైలి. విలక్షణ నేతగా, వక్తగా, ఆర్ధిక వ్యవహారాల్లో రాటు తేలిన ఆర్ధికవేత్తగా తాను పనిచేసిన ముఖ్యమంత్రులందరివద్దా తలలో నాలుకగా వ్యవహరించారు. గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. ఆచార్య ఎన్.జి.రంగా శిష్యుడిగా… విద్యార్ధి దశ నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్న రోశయ్య అనేక ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ విద్య అభ్యసించారు. అయనకు భార్య శివలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
మొదటినుంచీ కాంగ్రెస్ వాదిగా ఉన్న రోశయ్య క్రియాశీల రాజకీయ జీవితం 1968లో శాసనమండలి సభ్యుడిగా మొదలైంది, 1974, 80లలో కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1989, 2004 సంవత్సరాల్లో చీరాల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో మరోసారి శాసనమండలికి రోశయ్య ఎన్నికయ్యారు. 1998లో నరసరావు పేట నుంచి లోక్ సభకు కూడా రోశయ్య ఎన్నికయ్యారు.
డా. చెన్నారెడ్డి, నేదురుమిల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఆర్ధిక మంత్రిగా కీలకంగా వ్యవహరించారు. వరుసగా ఏడుసార్లు, మొత్తం 15 సార్లు ఉమ్మడి ఏపీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టి రోశయ్య రికార్డు సాధించారు.
1980-82 మధ్య అంజయ్య మంత్రివర్గంలో హౌసింగ్, రవాణా శాఖలు
1982లో కోట్ల మంత్రివర్గంలో హోం శాఖ
1989లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్ధిక, విద్యుత్, శాసనసభ వ్యవహారాలు
1991లో నేదురుమిల్లి మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య
1993 లో కోట్ల మంత్రి వర్గంలో ఆర్ధిక, శాసనసభ వ్యవహారాలు
2004 లో వైఎస్ మంత్రివర్గంలో ఆర్ధిక, శాసనసభ వ్యవహారాలు
2009 లో వైఎస్ మంత్రివర్గంలో ఆర్ధిక, శాసనసభ వ్యవహారాలు
2009-2010 – ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
2011-2016 – తమిళనాడు గవర్నర్ గా వివిధ పదవులు నిర్వర్తించారు.
తమిళ నాడు గవర్నర్ గా పదవీ విరమణ చేసిన తరువాత హైదరాబాద్ లో ఉంటున్న రోశయ్య ఏడాది కాలంపాటు నగరంలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆ తర్వాత వయోభారంతో ఇంటికే పరిమితమయ్యారు. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా నేతలెవరినీ కలవడంలేదు. తెలంగాణా పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంలో ఏ. రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా రోశయ్యను కలుసుకున్నారు. ఆ సమయంలోనే అయన మీడియాలో కనిపించారు.
అయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కెసియార్ దీక్ష, డిసెంబర్ 9 ప్రకటన అయన హయాంలోనే జరగడం గమనార్హం.
1968 లో మొదలైన అయన రాజకీయ జీవితం 2016 వరకూ 48 ఏళ్ళపాటు అప్రతిహతంగా కొనసాగింది. ఆహికారంలో ఉన్నపుడు మంత్రిగా అయన ఎంతో క్రియాశీలకంగా ఉండేవారు. కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ప్రతిరోజూ గాంధీ భవన్ కు వచ్చేవారు. మీడియా సమావేశాల్లో పార్టీ తరఫున మాట్లాడేవారు. 1994 నుంచి 1996 వరకూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తెలుగు రాజకీయాల్లో విలక్షణ నేతగా పేరు పొందారు.
Also Read : రేపు రోశయ్య అంత్యక్రియలు