Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్లక్నో నిష్క్రమణ: క్వాలిఫైర్ 2 కు బెంగుళూరు

లక్నో నిష్క్రమణ: క్వాలిఫైర్ 2 కు బెంగుళూరు

RCB for qualifier-2:  ఐపీఎల్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ నిష్క్రమించింది,  నేడు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 14 పరుగులతో లక్నోపై విజయం సాధించింది. బ్యాటింగ్ లో రజత్ పటీదార్ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 112; బౌలింగ్ లో హాజెల్ వుడ్ మూడు వికెట్లతో రాణించి బెంగుళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు.

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగుళూరు బ్యాట్స్ మెన్ లో పటీదార్-112; దినేష్ కార్తీక్-37; విరాట్ కోహ్లీ-25 పరుగులతో  రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 8పరుగులకే తొలి వికెట్ (డికాక్-6) కోల్పోయింది, 41 వద్ద మనన్ వోహ్రా (19) కూడా ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ కెఎల్ రాహుల్- దీపక్ హుడా మూడో వికెట్ కు 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హుడా 26 బంతుల్లో 1ఫోర్, 4సిక్సర్లతో 45 చేసి ఔట్ కాగా, స్టోనిస్ 9 మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు 180 వద్ద 58 బంతుల్లో 3ఫోర్లు, 5 సిక్సర్లతో 79 పరుగులు చేసిన రాహుల్ కూడా ఔటవ్వడంతో లక్నో కష్టాల్లో పడింది. 19వ  ఓవర్లో హాజెల్ ఉడ్ రాహుల్ తో పాటు కృనాల్ పాండ్యా వికెట్ ను కూడా రాబట్టాడు. అయితే హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో దుష్మంత చమీర ఒక ఫోర్, ఒక సిక్సర్ తో కాసేపు బెంగుళూరు శిబిరంలో ఆందోళన రేకెత్తించినా చివరి మూడు బంతులూ పొదుపుగా వేయడంతో బెంగుళూరు విజయం ఖాయమైంది. లక్నో 20 ఓవర్లలో 193పరుగులు చేయగలిగింది.

బెంగుళూరు బౌలర్లలో హాజెల్ ఉడ్ మూడు; సిరాజ్, హసరంగ, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

రజత్ పటీదార్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

రేపు శుక్రవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్- బెంగుళూరు మధ్య  క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరగనుంది.

Also Read ఫైనల్లో గుజరాత్: రాజస్థాన్ పై విజయం

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్