Saturday, June 13, 2026
HomeTrending Newsరష్యాలో మూడో డోసు

రష్యాలో మూడో డోసు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ మొదలైనప్పటికీ.. చాలా దేశాలను వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. ఇదే సమయంలో మరికొన్ని దేశాలు మాత్రం మూడో డోసును పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్‌ డోసు పంపిణీ చేపడుతున్నట్లు రష్యా ప్రకటించింది. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకున్న రష్యా.. మూడో డోసు పంపిణీలోనూ మొదటిస్థానంలో నిలిచింది.

కరోనా వ్యాక్సిన్‌ను తొలిసారిగా రిజిస్టర్‌ చేసుకున్న దేశంగా నిలిచిన రష్యాలో ప్రస్తుతం వైరస్‌ విజృంభణ మరోసారి మొదలయ్యింది. దీంతో అప్రమత్తమైన పుతిన్‌ ప్రభుత్వం.. మూడో డోసును (Booster Dose) ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలను సవరించింది. రెండు డోసులు తీసుకొని 6నెలల కంటే ఎక్కువ సమయం గడిచిన వారు మూడో డోసు తీసుకోవాలని సూచించింది. అంతేకాదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి బూస్టర్‌ డోసులు ఇవ్వాలని యోచిస్తోంది. రష్యా రాజధాని మాస్కోలో జులై ఒకటో తేదీ నుంచి బూస్టర్‌ డోసు పంపిణీ ప్రారంభించారు. కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్‌లను దృష్టిలో ఉంచుకొని శరీరంలో యాంటీబాడీల స్థాయిలను అధికమొత్తంలో ఉంచేందుకు రీ-వ్యాక్సినేషన్‌ ప్రారంభించినట్లు  గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గిన్ట్స్‌బర్గ్‌ వెల్లడించారు.

పెరుగుతోన్న కొవిడ్‌ మరణాలు

కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్‌తో పలు దేశాల్లో తిరిగి వైరస్‌ విజృంభణ మొదలయ్యింది. దీని ప్రభావాన్ని చూస్తోన్న రష్యాలో రోజువారీ మరణాలు పెరుగుతున్నాయి. గతకొన్ని రోజులుగా నిత్యం అక్కడ 650కి పైగా కొవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి. అంతేకాదు రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిత్యం 23వేల కేసులు బయటపడుతున్నట్లు అక్కడి కరోనా టాస్క్ ఫోర్స్‌ వెల్లడించింది. గతేడాది జనవరిలోనే రష్యా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించినప్పటికీ.. ఇప్పటివరకు కేవలం 16 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ అందించగలిగింది. వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగా సాగడం కూడా వైరస్‌ వ్యాప్తికి మరో కారణంగా నిపుణులు భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లలో ఎక్కువగా రెండు డోసుల్లో తీసుకునేవే ఉన్నాయి. అంతేకాకుండా తొలి రెండు డోసుల వల్ల వృద్ధి చెందే యాంటీబాడీలు 6నెలల తర్వాత క్షీణిస్తున్నాయని నివేదికలు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌లన్నీ కరోనా వైరస్‌ వెలుగు చూసిన తొలిరోజుల్లో ఉన్న వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించారు. దీంతో, కొత్తగా పుట్టుకువస్తోన్న వేరియంట్‌లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌లలో మార్పులు చేయడమో.. లేదా మరో డోసుతో యాంటీబాడీల స్థాయిని మెరుగుపరచడమో చేయాల్సి వస్తోంది. ఈ తరుణంలో మూడో డోసుతో మరింత రక్షణ లభిస్తుందన్న నిపుణుల సూచనలతో ఆయా దేశాలు మూడో డోసును ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular