Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకమ్యూనిజం-ఒక నిజం

కమ్యూనిజం-ఒక నిజం

Communism In India – The Real Truth About Communism

చైనాలో కమ్యూనిజానికి వందేళ్లు..అన్నాన్నేను..
మనదగ్గర మాత్రం తోకపార్టీలుగా మిగిలిపోయాయి.. అనేసాడతను.
ఎంత తేలిక కదా..
కమ్యూనిజాన్ని తేలికచేయడం.
అతని తప్పేం లేదు.
అతనొక మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టు..
అప్పుడప్పుడూ పత్రికల్లో, ఛానెళ్లలో వచ్చే కథనాలు చూస్తుంటాడు.
బహుశా రాసుంటాడు కూడా.

ఒక్కో ఎన్నికకూ దేశంలో కమ్యూనిస్టుపార్టీలకు వోట్లు తగ్గిపోతూ వుంటాయి.
సీట్లయితే వేళ్ళు దాటవు.
అప్పుడు రొటీన్ గా ఒక స్టోరీ వస్తుంది.
దేశంలో కమ్యూనిస్టుల పని అయిపోయిందని..
కమ్యూనిస్టులకి రాజ్యాధికారం ఇక కల్లే అని..
ప్రధాన పార్టీలకు తోకపార్టీలుగా మిగిలిపోయాయనీ..
అసలు ఆనాటి కమ్యూనిజం, కమ్యూనిస్టులు ఇప్పుడు లేరని తేల్చేస్తారు..
ఆనాటి త్యాగాలు, ఉద్యమాలు ఇప్పుడెక్కడని ప్రశ్నిస్తారు.
ఈ కార్పొరేట్ ప్రపంచంలో కమ్యూనిజమేంటని తీర్పులిస్తారు.

అసలు కమ్యూనిజాన్ని తూచే తూనిక రాళ్లేంటి..
వోట్లా.. సీట్లా.. అధికారమా?
కమ్యూనిస్టుల విలువని ఎలా అంచనా వేస్తారు?
లాభనష్టాలతోనా..వేల కోట్లలోనా..

అసలు కమ్యూనిస్టులని ఎలా పోల్చుకుంటారు?
ఎర్ర చొక్కాలా? ఎన్నికల గుర్తులా?
కమ్యూనిస్టు అంటే చికెన్ నారాయణా?
కమ్యూనిస్టు అంటే చంద్రబాబు కడుపులో తలపెట్టిన గద్దరా?
కమ్యూనిస్టులంటే..
ఎన్నికలకొక పార్టీతో పొత్తుపెట్టుకుని ఓడిపోయే గుప్పెడు వామపక్షనేతలా?

నిజం మాట్లాడుకుందాం..
అసలు కమ్యూనిజానికి ఎన్నికలకి ఏం సంబంధం..
ఆ మాటకొస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కమ్యూనిజానికి కూడా సంబంధం లేదు.
మార్క్స్ ఎన్నికల్లో గెలిచి కమ్యూనిజం సాధించమని చెప్పలేదు.
మావో మెజారిటీతో కమ్యూనిజం వస్తుందన్లేదు.
కమ్యూనిజం అంటే దోపిడీని ఎదిరించడమే..
బలవంతుల దౌర్జన్యాలకు ఎదురెళ్లడమే..
ధనవంతుల పన్నాగాలను ఎండగట్టడమే..
అన్యాయాన్ని అంగీకరించని మనిషే కమ్యూనిస్టు…
దానికి ఎర్రచొక్కాలే వుండక్కర్లేదు.
లాల్ సలామ్ లే చెయ్యక్కర్లేదు.
ఎర్ర పార్టీల్లో సభ్యత్వాలూ అక్కర్లేదు.
రాత్రనక పగలనక,
మండే ఎండనక.. చంపే చలనక
ఈ చట్టాలు మాకొద్దని పోరాడిన రైతు ఉద్యమంలో వున్నది కమ్యూనిజమే..
పౌరసత్వానికి మతత్వంతో పనేంటని ప్రాణాలకు తెగించి ప్రశ్నించిన
మహిళల తెగువలో వున్నది.. కమ్యూనిజమే.
జెఎన్ యూవిద్యార్థులు చిందించిన ఎర్రెర్రని రక్తంలో వున్నది..కమ్యూనిజమే

అంతెందుకు..
దేశాన్నేలే నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న
రెండు లైన్ల ట్వీట్లలోనూ వున్నది కమ్యూనిజమే..
90 శాతం వైకల్యం వున్నా దేశభద్రతకు ప్రమాదమని జైల్లో పెట్టిన ప్రభువుల భయం వెనుకా కమ్యూనిజమే వుంది.
ఎప్పుడొస్తుందో తెలియని విప్లవం కోసం అడవుల్లో మగ్గిపోతూ కరోనాకి రాలిపోతున్న ప్రాణాల్లోనూ కమ్యూనిజం వుంది.

కనుక కమ్యూనిజం అంటే ఎన్నికలూ, పదవులూ ప్రభుత్వాలు కాదు.
ఎన్నికల్లో ఓడిపోతే కమ్యూనిజం ఓడిపోయినట్టు కాదు.
కమ్యూనిజంలో లోపాల్లేవని కాదు..
నోట్లకి వోట్లు కొనుక్కునే ఈ ఎన్నికల రాజకీయాలకు కమ్యూనిజాన్ని ఓడించే శక్తి మాత్రం లేదు.

(నాకు కమ్యూనిజం గురించి రాసే అధికారం, అర్హత లేవు. ఆ సిద్ధాంతాల పట్ల అభిమానమే తప్ప..లోతైన అవగాహన కూడా లేదు)

-కే.శివప్రసాద్

Read More: ప్రజలు గెలిచేదెప్పుడు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్