జీ7 సదస్సు జరుగుతున్న వేళ.. రష్యా మరింత హుంకరించింది. ఉక్రెయిన్ కు బాసటగా ఉంటామని జి 7 దేశాలు తీర్మానం చేస్తుండగానే రష్యా సేనలు ఉక్రెయిన్ నగరాలపై నిప్పుల వర్షం కురిపించాయి. నాటోలో ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇస్తే పుతిన్ దాడులు ఎటు నుంచి ఎటువైపు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలనుసారం.. కేవలం గంటల వ్యవధిలోనే క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడ్డాయి రష్యన్ బలగాలు. తూర్పు ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకొనేందుకు చురుగ్గా పావులు కదుపుతున్న రష్యా సేనలు రాజధాని కీవ్‌పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో నగరాలకు నగరాలే నామరూపాలు లేకుండా పోతున్నాయి.
పుతిన్‌ను హేళన చేస్తూ..
జీ7 సదస్సులో.. సభ్య దేశాల ప్రతినిధులు పుతిన్‌ను అవహేళన చేసేలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌పై దాడి చేయిస్తుండడంతో.. జర్మనీలో జరుగుతున్న జీ7 సదస్సుల్లో.. ఏడు సంపన్న దేశాల గ్రూప్ నాయకులు ఆదివారం పుతిన్ ఇమేజ్‌ను ఎగతాళి చేశారు. కోట్లు, చొక్కాలు విప్పేసి మనమందరం పుతిన్ కంటే కఠినంగా ఉన్నామని చూపించాలి అంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కామెంట్ చేశాడు. చొక్కా లేకుండా గుర్రపుస్వారీ చేయాలి అంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడో కామెంట్ చేశాడు. గతంలో పుతిన్ చొక్కాలేకుండా గుర్రపు స్వారీ చేసిన ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. రష్యాను మరింత ఒంటరి చేసే ప్రయత్నాలపై G7 నాయకులు చర్చించారు. G7 సభ్య దేశాలైన బ్రిటన్, కెనడా, జపాన్, అమెరికాలు రష్యా బంగారం దిగుమతులను నిషేధించే చర్యలను ప్రకటించాయి. G7లో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ కూడా సభ్య దేశాలే.
ఆదివారం తెల్లవారుజామున కీవ్‌లో కనీసం రెండు రెసిడెంట్ కాంప్లెక్స్‌లపైన క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ విషయాన్ని స్థానిక మేయర్ విటాలీ క్లిట్‌స్కో ప్రకటించారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున పొగలు వెలువడిన దృశ్యాలు కనిపించాయి. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి, భవనాల్లోని పౌరులను బయటకు తరలించారు. తూర్పు ఉక్రెయిన్‌లో కీలకమైన లుహాన్‌స్క్‌పై రష్యా సైన్యం దాదాపు పట్టుబిగించింది. సీవిరోడోంటెస్క్ ఇప్పటికే రష్యా వశమయ్యింది. లీసిచాన్‌స్క్‌లో ఆదివారం రష్యా వైమానిక దాడుల్లో టీవీ టవర్ ధ్వంసమయ్యిందని, ఒక వంతెన తీవ్రంగా దెబ్బతిన్నదని లుహాన్‌స్క్ గవర్నర్ చెప్పారు. తాము సీవిరోడోంటెస్క్ పరిసర గ్రామాలను పూర్తిగా ఆక్రమించుకున్నారని రష్యా సైన్యం వెల్లడించింది.
కీవ్ ప్రాంతంలో రష్యా సైన్యం గంటల వ్యవధిలోనే 14 క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ ఎంపీ ఒలెస్కీ గోంచారెంకో చెప్పారు. స్పెయిన్‌లో త్వరలో జరుగనున్న నాటో సదస్సు నేపథ్యంలో రష్యా ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నామని అన్నారు. ఈ నెల 5వ తేదీ తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఈ స్థాయిలో దాడులు జరగడం ఇదే మొదటిసారి.