Monday, May 20, 2024
Homeసినిమామరో సచిన్ టెండూల్కర్ పుట్టరు: ముత్తయ్య మురళీధరన్

మరో సచిన్ టెండూల్కర్ పుట్టరు: ముత్తయ్య మురళీధరన్

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ముంబైలో సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా ‘800’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ వేడుకలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ… ”మై వెరీ డియర్ ఫ్రెండ్ మురళీధరన్ కి ఆల్ ది బెస్ట్. అతని జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. నేను 1993లో తొలిసారి మురళీధరన్ ని కలిశా. అప్పటి నుంచి మా మధ్య స్నేహం అలాగే ఉంది. లాస్ట్ మంత్ యూనిసెఫ్ వర్క్ మీద నేను శ్రీలంక వెళ్ళా. అప్పుడు మురళీధరన్ కి మెసేజ్ చేశా… ‘నేను మీ సిటీలో ఉన్నాను’ అని! ‘అక్కడ ఏం చేస్తున్నావ్. నేను భారత్ లో ఉన్నాను’ అని రిప్లై ఇచ్చాడు. తర్వాత బయోపిక్ గురించి చెప్పాడు. ఈ ఈవెంట్ కి రాగలవా? అని అడిగాడు. మురళీధరన్ ఎంతో సాధించాడు. అయినా చాలా సింపుల్ గా ఉంటాడు. అతనికి నో చెప్పడం కష్టం. అతని కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఆటలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మన ఆట పట్ల డిజప్పాయింట్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు. పిచ్ ఎలా ఉన్నా సరే మురళీధరన్ బంతిని టర్న్ చేయగలడు. అతడిని ఎలా ఎదుర్కోవాలని మేం డిస్కస్ చేసేవాళ్ళం. హర్భజన్ ఒకసారి చెప్పాడు… అంతర్జాతీయ క్రికెట్ లో తొలిసారి దూస్రా వేయడానికి ముందు 18 నెలలు మురళీధరన్ నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడట. ఇంటర్నేషనల్ మ్యాచులలో 10,500 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ తీసుకుంటే మరో 10 వేల ఓవర్లు ఉంటాయి” అని అన్నారు.

ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ… ”నా కోసం ఇక్కడికి వచ్చిన, మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న సచిన్ టెండూల్కర్ కి థాంక్స్. నేను కూడా సచిన్ ఫ్యాన్. క్రికెట్ లో ఆయన సాధించినది ఎవరూ సాధించలేరు. మరో వందేళ్ళ తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు. క్రికెట్ ఎలా ఆడాలో, ఎంత వినమ్రంగా ఉండాలో సచిన్ నేర్పించారు. ఆయన ఎప్పటికీ బెస్ట్. మరో సచిన్ టెండూల్కర్ పుట్టరు. ఆట ఆడేటప్పుడు ఎంజాయ్ చేస్తుంటే.. ఫలితం గురించి ఆలోచించం. క్రికెటర్లకు నేను ఇచ్చే సలహా అదే. పెర్ఫార్మన్స్ గురించి ఆలోచించడం మానేసి ఎంజాయ్ చేయమని చెబుతా. నేను 10, 12 ఏళ్ళు హాస్టల్ లో ఉన్నాను. అందుకని, ఎప్పుడూ నవ్వుతూ షేరింగ్ చేసుకోవడం అలవాటు అయ్యింది. నేను బౌలింగ్ చేసినప్పుడు రన్స్ చేయడంలో లారా సక్సెస్ అయ్యాడు. కానీ, నా బౌలింగ్ శైలిని పట్టుకోలేదు. రాహుల్ ద్రావిడ్ కూడా! సచిన్ మాత్రం నానా ఆటను పూర్తిగా చదివేశాడు” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్