Monday, February 24, 2025
Homeతెలంగాణసైదాబాద్ అత్యాచార నిందితుడి ఆత్మహత్య

సైదాబాద్ అత్యాచార నిందితుడి ఆత్మహత్య

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ బాలికపై హత్యాచారం చేసిన కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించారు.

గత 8 రోజులుగా రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతని ఆచూకీ తెలియజేసిన వారికి 10 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. రాజు ఆత్మహత్య విషయాన్ని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ధ్రువీకరించారు.

హైదరాబాద్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న విషయాన్ని గమనించిన రాజు రైల్వే ట్రాక్ పై పడి ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధమయ్యాడు. తొలుత రైల్వే సిబ్బందిని చూసి చెట్లలోకి వెళ్లి దాక్కున్నాడు. సిబ్బంది వెళ్ళగానే బైటకు వచ్చి అదే సమయంలో హైదరాబాద్ వైపుగా వెళ్తున్న కోణార్క్ రైలుకింద పడి చనిపోయాడు.

వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డిసిపీ, ఏసీపీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. వరంగల్ ప్రభుత్వాస్పత్రికి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తామని, రాజు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించామని తరుణ్ జోషి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్