సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలోకి దిగిపోయాయి. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియన్స్ చూస్తారు అనే ఉద్దేశంతోనే, వరుస సినిమాలను వదిలారు. ఆ జాబితాలో వెంకటేశ్ ‘సైంధవ్’ కూడా ఒకటిగా కనిపిస్తుంది. వెంకటేశ్ కి ఇది 75వ సినిమా కావడంతో, ఆయన అభిమానులంతా ఈ సినిమాపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు. అయితే ఫ్యాన్స్ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది.
‘గుంటూరు కారం’ సినిమాలో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. పక్కా మాస్ హీరోగా మహేశ్ ను చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. త్రివిక్రమ్ కూడా ఆయనను అలాగే చూపించాడు. కథా పరంగా ఆడియన్స్ లో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించకపోయినా, త్రివిక్రమ్ చేసిన ప్రయోగం మిస్ ఫైర్ మాత్రం కాలేదు. అందుకు శ్రీలీల గ్లామర్ .. సాంగ్స్ .. కొరియోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. వంటివి యాడ్ కావడం కారణం కావొచ్చు. ఇక పిల్లలు తమ పేరెంట్స్ ను థియేటర్స్ కి తీసుకు రావడం ‘హను మాన్’ కి ప్లస్ అయింది.
నాగార్జున సినిమా ‘నా సామిరంగ’లో పండగకి సంబంధించిన కంటెంట్ ఉంది. మూడు రోజుల పండుగ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది గనుక, ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అయ్యారు. కానీ ‘సైంధవ్’ విషయంలో ఆశించిన స్థాయి రిజల్ట్ కనిపించలేదు. అందుకు కారణం ఇది పండుగ రోజుల్లో రావలసిన కంటెంట్ కాకపోవడం .. వెంకటేశ్ కి ఉన్న ఇమేజ్ కి భిన్నమైన కంటెంట్ కావడం సమస్య అయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు ఒక రేంజ్ లో ఉంది. ఈ కంటెంట్ కి వాళ్ల ఓటు పడకపోవడమే సమస్యగా మారిందనే వాదన కూడా వినిపిస్తోంది.