Tell your stand: కోనసీమ జిల్లాకు డా. అంబేద్కర్ పేరు పెట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు చెప్పారని, జనసేన నేతలు కూడా ఆందోళనలు చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అంబేద్కర్ పేరు విషయంలో వారి వైఖరి ఏమిటో చెప్పాలని టిడిపి, జనసేన నేతలను సజ్జల డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని, మాట్లాడేముందు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. టిడిపి ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టు చదివితే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు బి టీం గానే ఉండాలనుకుంటే పవన్ ఇష్టమని, కానీ అయన నిక్కచ్చిగా రాజకీయాలు చేయాలనుకుంటే బాబు నీడ నుంచి బైటకు రావాలని సజ్జల సూచించారు.
ప్రధాన నిందితుడు అన్యం సాయి తమపార్టీకి చెందినవాడు కాదని, జనసేన కార్యకర్త అని సజ్జల చెప్పారు. ఆయన తనతో, పార్టీ నేతలతో దిగన ఫోటోలు… మంత్రి విశ్వరూప్ కు కట్టిన ఫ్లెక్సీలు కూడా కొందరు బైట పెట్టారని, కానీ అతనితో తమ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. టిడిపి, జనసేనలవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలని, ఈ దాడులు తామే చేయించామని వారు చెప్పడం సహేతుకంగా లేదని, మా మంత్రి, మా ఎమ్మెల్యే ఇళ్ళపై తామెందుకు దాడులు చేసుకుంటామని ప్రశ్నించారు. ఇలాంటి తుచ్చమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అడ్డదారుల్లో ప్రయోజనం పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, దాడుల వెనుక కొన్ని శక్తుల కుట్ర ఉందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలకు చెందిన నేతల వ్యాఖ్యలు చూస్తుంటే వాళ్ళే దీన్ని వెనకుండి నడిపించినట్లు అర్ధమవుతుందన్నారు. దాడులకు పాల్పడిన వారిలో ఒక్కొక్కరుగా బైట పడుతున్నారని, త్వరలోనే నిజాలు తెలుస్తాయన్నారు. అల్లర్ల వెనుక కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తోందన్నారు.
సిఎం జగన్ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, కులాలను, మతాలను అడ్డుపెట్టుకొని గతంలో ఎన్నడూ తాము రాజకీయాలు చేయలేదని, తమకు ఆ అవసరం ఎప్పటికీ ఉండబోదని సజ్జల తేల్చి చెప్పారు.