చంద్రబాబు తన స్థాయి దిగజారి సిఎం జగన్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని, శాపనార్ధాలు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి రాజధానిపై నిన్న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు వక్రభాష్యం చెబుతున్నారని, కానీ దానిలో ఎక్కడా అమరావతిని ఆమోదిస్తున్నట్లు చెప్పలేదని స్పష్టం చేశారు. అమరావతిపై ఏ చిన్న ఆశ కనబడినా, అక్కడ భూముల రేట్లు పెరుగుతాయని, అప్పుడు భూములు అమ్మేసుకొని బైట పడవచ్చనే ఆశ కనబడుతోందని, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.
ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయకపోయినా రాద్ధాంతం చేస్తున్నారని, బాబు సిఎంగా ఉండగా తన ఫోన్ ట్యాప్ చేశారని, దీనిపై స్వయంగా తాను హైకోర్టుకు వెళ్తే ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారని సజ్జల గుర్తు చేశారు. ప్రజలకు ఎలా మంచి చేయాలన్న ఆలోచన తప్ప ఇతర విషయాలు ఆలోచించే తీరిక జగన్ కు లేదన్నారు. ఫోన్లు ట్యాప్ చేయడం కోసం స్పై వేర్ తెప్పించిన ఉదంతం బాబు హయంలోనే జరిగిందని, కానీ అలాంటివి తమకు అవసరం లేదన్నారు.
అమరావతిపై జగన్ మాట్లాడిన అంశాలని పూర్తిగా చెప్పకుండా, వక్రీకరించి, ఆయనకు కావాల్సిన పదాలే చూపిస్తూ అబద్ధాలు ఆడడానికి బాబుకు సిగ్గుండాలి అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. శివరామ కృష్ణన్ కమిటీ నివేదికరాకముందే అమరావతిని రాజధానిగా నియమించారని, ఆ కమిటీ ఉండగానే మరో కమిటీని నారాయణ నేతృత్వంలో నాడు నియమించి, సొంత కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అమరావతిని ప్రకటించారని, ఇది ఎలా కుదురుతుందని సజ్జల ప్రశ్నించారు. సొంత జేబులు, కోటరీ జేబులు నింపడానికే అమరావతిని నిర్ణయించారని ఆరోపించారు.
పాలనలో సిఎం జగన్ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారని, దాన్ని అందుకోగలిగితేనే ప్రజలు ఆదరిస్తాని, గతంలో లాగా హామీలు ఇచ్చి వాటిని అధికారంలోకి రాగానే మర్చి పోవాలనుకుంటే తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబుకు గెలుపు సాధ్యం కాదని పేర్కొన్నారు.